కొన్ని రోజుల క్రితం విజయవాడలో ఆప్కాబ్ స్వర్ణోత్సవ వేడుకలు జరిగాయి. దీనికి ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. ఈ సమయంలోనే ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అందరితో పాటు కూర్చున్న జయప్రకాశ్ నారాయణను ఆయన గమనించారు. వెంటనే మంత్రి జోగి రమేష్‌ను పంపి ఆయన్నుపైకి పిలిపించారు. తన పక్కనే కూర్చోబెట్టుకుని మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా దీనిపై చర్చ మొదలైంది. అయితే దీని వెనక చాలా పెద్ద కథే ఉంది అంటున్నారు. తెరవెనుక చాలా రాజకీయం నడిచిందన్నది వైసీపీ వర్గాల అనుమానం.
జయప్రకాశ్ నారాయణ చాలాకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఓసారి కూకట్‌పల్లి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్నుంచి పాలిటిక్స్ తనకు సూట్ కావని డిసైడై దూరంగా ఉంటున్నారు. కానీ ఇటీవల ఆయన వైఖరి మారినట్లు కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన మాట్లాడుతున్నారు. వాలంటీర్ వ్యవస్థను సమర్ధించారు. జగన్ తీసుకున్న పలు నిర్ణయాలకు ఆయన మద్దతిచ్చారు. అప్పట్నుంచి వైసీపీ కూడా ఆయన్ను ప్రత్యేకంగా గౌరవిస్తోంది. ఇటీవల జగన్ ఆయన్ను ప్రత్యేకంగా చూడటంతో అధికార పార్టీతో ఆయన అనుబంధం పెరుగుతోందని మరోసారి రుజువైంది.
జయప్రకాశ్ నారాయణ వచ్చే ఎన్నికల్లో వైసీపీ మద్దతుతో విజయవాడ ఎంపీగా పోటీ చేసే అవకాశముందన్నది లేటెస్ట్ టాక్. ఒకవేళ కాదంటే గుంటూరు నుంచైనా ఆయన పార్లమెంట్‌కు పంపాలని వైసీపీ భావిస్తోంది. తమ పార్టీ తరపున పోటీ చేయించడం లేదంటే ఇండిపెండెంట్‌గా ఆయనకు మద్దతిచ్చైనా గెలిపించడం అనే ఆప్షన్లను వైసీపీ పరిశీలిస్తోంది. ఒకవేళ ఈ రెండూ కుదరకపోతే రాజ్యసభకు పంపే అవకాశాలూ లేకపోలేదు. ప్రస్తుతానికి వైసీపీకి విజయవాడలో ఎంపీగా పోటీ చేయడానికి గట్టి అభ్యర్థి ఎవరూ లేరు. గతంలో పోటీ చేసిన పీవీపీ ఆ తర్వాత అటువైపు చూడలేదు. మరికొందరు టికెట్ ఆశిస్తున్నప్పటికీ వైసీపీ హైకమాండ్ మాత్రం జేపీ వైపే చూస్తున్నట్లు కనిపిస్తోంది.
జయప్రకాశ్ నారాయణను విజయవాడ బరిలో నిలపాలని అనుకోవడం వెనక చాలా కారణాలే ఉన్నాయి. కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండే విజయవాడలో జేపీని నిలబెడితే అది కొంతమేర కలసి వచ్చే అవకాశం ఉంది. పైగా జేపీకి ఎంతో కొంత క్లీన్ ఇమేజ్ ఉంది. అలాగే ఎన్టీఆర్ వంటి నేతలతో కలసి పనిచేసిన అనుభవం ఉంది. ఇవన్నీ కలసి వస్తాయని జగన్ లెక్కలేస్తున్నారు. పైగా ఈసారి పోటీ కాస్త గట్టిగానే ఉంటుంది. అలాంటప్పుడు జేపీ తనకు మద్దతు పలికితే తటస్థ ఓటర్లు కొందరు తమవైపు మొగ్గే అవకాశం ఉందన్నది వారి ఆలోచన.
మరి జేపీ ఆలోచన ఎలా ఉంది..? మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా..? వైసీపీ తరపున బరిలోకి దిగుతారా లేక ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా..? లేక వైసీపీకి మద్దతుతో సరిపెడతారా..? కొన్నాళ్లు ఆగితే కానీ జయప్రకాశ్ నారాయణ పొలిటికల్ పిక్చర్ ఏంటన్నది తేలదు.