Live In: లివ్‌ ఇన్‌.. ఓ దిక్కుమాలిన కాన్పెప్ట్‌.. సహజీవం ప్రాణాలు తీస్తోందా ?

బంధానికి భద్రత ఉండాలి.. అప్పుడు ఆ బంధానికి ఎలాంటి పేరు పెట్టినా తప్పు లేదు. అలాంటి భద్రత కల్పించుకునే మెచ్యూరిటీ ఉందా లేదా అన్నదే యూత్ తెలుసుకోవాలి.

  • Written By:
  • Updated On - February 20, 2023 / 04:41 PM IST

పెద్దలు కుదిర్చితే సంప్రదాయం అంటారు.. అదే పిల్లలే చూసుకుంటే ప్రేమ అంటారు.. ఈ రెండూ కాకుంటే.. లివ్‌ఇన్‌.. తెలుగులో సహజీవనం ! ఆడామగా కలిసుండే విధానానికి, కలిసి ఉండాలని అనుకుంటున్న పద్ధతికి.. రకరకాల పేర్లు వినిపిస్తున్నాయ్ ఈ మధ్య ! ఒకప్పుడు ప్రేమ పెళ్లిళ్లను ఒప్పుకునేది కాదు సమాజం. ఒకప్పుడు కులాలు, మతాలు అడ్డుగా ఉండేవి ప్రేమకు ! ఐతే లివ్ ఇన్ అంటూ పెద్దలను ఒప్పించలేక.. తమ ప్రేమకు యువతే అడ్డుగా మారుతోంది. ఈ దిక్కుమాలిన కాన్సెప్ట్‌ సంగతి ఎలా ఉన్నా.. ఇది పూర్తిగా తప్పు అనడానికి లేదు. పది కాలాలు చల్లగా ఉంటే.. లివ్‌ఇన్‌కు అడ్డు చెప్పేవాళ్లు కూడా ఉండరు. ఐతే ఈ సహజీవనం.. ఇప్పుడు మనిషిని చంపేసే వరకు వెళ్తోంది. లివ్‌ఇన్ అంటూ మొదట్లో బాగానే ఉంటుంది.. ఆ తర్వాతే అసలు కథ మొదలు అవుతుంది.

దేశవ్యాప్తంగా జరిగిన మూడు ఘటనలు.. మూడు ఘటనలు కాదు కాదు మూడు హత్యలు.. ఇప్పుడు సహజీవనం కాన్సెప్ట్‌ను ప్రశ్నించేలా చేస్తున్నాయ్. ఆ ముగ్గురిది వేర్వేరు కథలు కావొచ్చు.. వ్యథలు కావొచ్చు.. ఐతే ప్రేమించడంలో, మోసపోవడంలో.. చివరికి చనిపోవడంలోనూ ఆ ముగ్గురు ఒక్కటే ! ప్రేమించినవాడిని తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నమ్మారు. కలిసుండేందుకు పెళ్లే అవ్వాల్సిన అవరసరం లేదని.. కలిసుంటే సరిపోతుందని డేటింగ్‌ జీవితంలోకి అడుగుపెట్టారు. కొన్నిరోజులు ఆనందంగా గడిపారు. ప్రియుడి బుద్ధి తెలుసుకున్నాక నిలదీశారు… అదే వారి జీవితం పాలిట శాపమైంది. చేసిన పాపాన్ని ప్రశ్నించినందుకు.. ప్రాణాలే పోగొట్టుకున్నారు. అవి అలాంటి ఇలాంటి హత్యలు కాదు.. ఘోరం, కిరాతకం అనే పదాలే చిన్నబోయేంత దారుణంగా జరిగాయ్ హత్యలు ! చంపి శవాన్ని ఫ్రిడ్జిలో పెడతాడు ఒకడు.. యువతిని చంపి డెడ్‌బాడీని ముక్కలు చేసి సిటీ అంతా పారేస్తాడు మరొకడు.. బెడ్‌ బాక్సులో శవాన్ని దాచిపెడతాడు ఇంకొకడు.. దేశం అంతా ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనలు.. ఇప్పుడు లివ్‌ఇన్ రిలేషన్‌ మీద కొత్త చర్చకు కారణం అయ్యాయ్.

aftab-shraddha

ఆ ముగ్గురు ఎవరో కాదు.. శ్రద్ధావాకర్, నిక్కీ, మేఘా.. ఈ ముగ్గురిది దాదాపు ఒకటే కథ.. ఒకటే ముగింపు. ఈ మూడు హత్యల్లోనూ పాయింట్‌… లివ్-ఇన్‌ రిలేషన్‌షిప్‌ ! నిక్కీ యాదవ్‌ హత్య కేసు గురించి ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటోంది. సాహిల్ అనే యువకుడు తన లివ్ఇన్ పార్ట్‌నర్ అయిన నిక్కీ యాదవ్‍ను.. డేటా కేబుల్ గొంతుకు బిగించి చంపేశాడు. తర్వాత దాదాపు 40 కిలోమీటర్లు ప్రయాణించాడు. తన కుటుంబానికి చెందిన దాబాలోని ఫ్రీజర్‌లో డెడ్‌బాడీని దాచిపెట్టాడు. ఏమీ ఎరగనట్టు వెళ్లి… మరో అమ్మాయిని చేసుకున్నాడు. మరో అమ్మాయి మేఘా సింగ్‌ తోర్వి. హార్దిక్‌ షాతో మూడేళ్ల ప్రేమలో ఉన్న మేఘా.. ఆరు నెలలు సహజీవనం చేశారు. హార్ధిక్‌కు ఉద్యోగం లేకపోయినా.. మేఘానే జాబ్ చేసి ఖర్చులన్నీ భరించేది. ఐతే కొద్దిరోజులు లివ్‌ఇన్‌ బాగానే సాగినా.. ఆ తర్వాత ఇద్దరిమధ్య గొడవలు మొదలయ్యాయ్. దీంతో మేఘాను హత్య చేసిన హార్థిక్‌.. శవాన్ని బెడ్‌ బాక్స్‌లో ఉంచి.. ఇంట్లో ఉన్న వస్తువులను అమ్మి ఆ డబ్బుతో పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇక దేశం అంతా ఉలిక్కిపడేలా చేసిన మరో కేసు శ్రద్ధా వాకర్‌. అఫ్తాబ్ అనే యువకుడు తన లివ్ఇన్ పార్టనర్‌ అయిన శ్రద్ధా వాకర్‌ను… గొంతు నులిమి చంపి ఆమె శరీరాన్ని 35ముక్కలు చేశాడు. వాటిని ఫ్రిజ్‌లో స్టోర్ చేశాడు. రోజుకు రెండు, మూడు ముక్కల చొప్పున అడవిలో పారేశాడు. శ్రద్ధా వాకర్‌ను హత్య చేసిన తర్వాత అఫ్తాబ్… మరో మహిళతో లవ్‌ ట్రాక్‌ నడిపాడు. అది కూడా శ్రద్ధా డెడ్‌బాడీ ఫ్రిడ్జిలో ఉంచుకునే ఆ మహిళను తన ఫ్లాట్‌కు తీసుకొచ్చాడు అఫ్తాబ్‌.

ప్రేమలో ఉన్నప్పుడు.. ప్రేమికులు దూరంగా ఉన్నప్పుడు జీవితం అందంగానే ఉంటుంది. ప్రతీది పాజిటివ్‌గానే కనిపిస్తుంది. అదే ఇద్దరు కలిసి ఒకే గది పంచుకున్నప్పుడే.. నెగిటివ్స్‌ బయటపడతాయ్. అలాంటి సమయంలో ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నామన్న దానిమీదే బంధం ఆధారపడి ఉంటుంది. ఏం జరిగినా కలిసి ఉండాలంటే.. ఓ బంధం కావాలి.. ఆ బంధం పెళ్లే కావాలన్నది పెద్దల మాట. ఐతే ఒకటి రెండు ఘటనలతో లివ్‌ఇన్ తప్పు అంటే ఎలా అన్నది యూత్ మాట. నిజమే.. ప‌దికాలాల పాటు క‌లిసి ఉంటే లివ్‌ఇన్‌ అసలు తప్పే కాదు. పెద్దల మీద కోపంతోనో.. ఒప్పుకోరన్న భయంతోనో.. అవతలి వ్యక్తి గురించి ఏమీ తెలుసుకోకుండా లివ్‌ఇన్ మొదలుపెట్టి మోసపోయి.. ప్రాణాలు తీసుకుంటున్నారు చాలామంది ! బంధానికి భద్రత ఉండాలి.. అప్పుడు ఆ బంధానికి ఎలాంటి పేరు పెట్టినా తప్పు లేదు. అలాంటి భద్రత కల్పించుకునే మెచ్యూరిటీ ఉందా లేదా అన్నదే యూత్ తెలుసుకోవాలి.