‍Narendra Modi: మోడీ ఆర్భాటానికి చీతాలు బలైపోతున్నాయా ?

హాలీవుడ్ రేంజ్‌లో ప్లాన్ చేశారు. సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియా తరలించేంత వరకు ప్రతి సీన్‌ను ఘనంగా ప్రొజెక్ట్ చేశారు. దేశంలో చీతాలకు మళ్లీ జీవం పోసిన ఘన చరిత్ర మాదే అని చెప్పుకునేందుకు ఎన్ని చేయాలో అన్ని చేశారు.

  • Written By:
  • Publish Date - August 2, 2023 / 05:30 PM IST

ఇక గత ఏడాది సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి మోడీ స్వయంగా నమీబియా నుంచి వచ్చిన చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో వదిలిపెట్టారు. ఆసమయంలో మోడీ భజన మీడియా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. సరే నేషనల్ చీతా ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను సమర్ధిద్దాం. కానీ చీతాలు సౌతాఫ్రికా నుంచి భారత్ వచ్చిన తర్వాత ఏం జరిగింది. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చీతాలను భారత్ తీసుకొస్తే.. ఐదు నెలల్లో 9 చీతాలు ప్రాణాలు కోల్పోయాయి. ఇంతకు మించిన దారుణం మరొకటి ఉంటుందా ?

చీతా ప్రాజెక్టుపై నిపుణుల అనుమానాలు

ఎక్కడో సౌతాఫ్రికాలోని నమీబియా నుంచి భారత్ ‌కు చీతాలను తీసుకువచ్చినప్పుడు అసలు అవి మన వాతావరణానికి తట్టుకోగలవా లేదా అన్నది ఆలోచించాలి. వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. కానీ ఇవేమీ జరిగినట్టు కనిపించడం లేదు. అంతా మాకే తెలుసు అన్నట్టు ప్రచార ఆర్భాటం కోసం ఇలాంటి ప్రాజెక్టులు చేపడితే చివరకు మూగ జీవాల ప్రాణాలు తీస్తున్నాయి. తమ దేశానికి చెందిన చీతాలు భారత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చనిపోవడంపై సౌతాఫ్రికా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

నిపుణులకు ముసుగేసి..చేయాల్సిందంతా చేసి

నేషనల్ చీతా ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీలో దక్షిణాఫ్రికాతో పాటు నమీబియాకు చెందిన వణ్యప్రాణి నిపుణులు కూడా ఉన్నారు. అయితే చీతాలను కునో నేషనల్ పార్క్ కు తరలించిన తర్వాత వాటి ఆలానాపాలనపై వీళ్లకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. చీతాలను ఎలా పరిరక్షిస్తున్నారు.. భారత వాతావరణానికి చీతాలు అలవాటు పడ్డాయా లేదా అన్న విషయాలు కూడా సౌతాఫ్రికా నిపుణులకు తెలియదు. దీంతో వాళ్లంతా మూకుమ్మడిగా సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. సరైన విధానంలో చీతాలను పర్యవేక్షించి ఉంటే.. కొన్నింటి ప్రాణాలైనా కాపాడగలిగేవాళ్లమని ఆందోళన వ్యక్తం చేశారు. సౌతాఫ్రికా చీతాలపై తమకు పూర్తి అవగాహన ఉందని.. తమకు వాస్తవాలు వెల్లడించకపోవడం వల్ల అవి ప్రాణాలు కోల్పోతున్నాయని సుప్రీంకు ఫిర్యాదు చేశారు.

చీతా ప్రాజెక్టు మొత్తం లొసుగులమయం

దక్షిణాఫ్రికా వణ్య ప్రాణి సంరక్షణ నిపుణులు సుప్రీంకోర్టుకు రాసిన లేఖను గమనిస్తే… చీతా ప్రాజెక్టును ప్రభుత్వం ఎంత అసమర్థంగా చేపట్టిందో అర్థమవుతుంది. చీతాలు ఇక్కడి వాతావరణానికి అనుకూలంగా జీవించేలా వాటికి శిక్షణ ఇవ్వడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారంట. కనీసం వాళ్లకు శాస్త్రీయ విధానాలు కూడా తెలియవంటూ సౌతాఫ్రికా నిపుణలు దుయ్యబట్టారు. చీతా ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీలో అంతర్జాతీయ నిపుణుల పేరుతో తమ పేర్లు ఉన్నా.. జూ అధికారులు గానీ, భారత ప్రభుత్వ అధికారులు గానీ చీతాల సంరక్షణకు సంబంధించి తమను ఒక్కసారి కూడా సంప్రదించలేదని స్పష్టం చేశారు. జులై 11న ఒక మగచీతా గాయపడింది. కునో పార్కులో ఉన్న అధికారులు.. ఆడ చీతా దాడివల్లే ఇది జరిగిందని ఓ అభిప్రాయానికి వచ్చేశారు. అయితే సౌతాఫ్రికా నిపుణులు మాత్రం అసలు ఇలా జరిగే అవకాశమే లేదంటున్నారు.

భారం సుప్రీం కోర్టుపై వేసిన సౌతాఫ్రికా నిపుణులు

చీతా ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందని భావిస్తున్న సౌతాఫ్రికా వణ్యప్రాణి నిపుణులు.. భవిష్యత్తులో మరిన్ని మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కునో జాతీయ పార్కులో చీతాలు ఎలా ఉన్నాయో..వాటి సంరక్షణ ఎలా జరుగుతుందో..ఎప్పటికప్పుడు తమకు తెలిసేలా.. రియల్ టైమ్ డేటాను అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది మార్చి 27న తొలి చీతా చనిపోతే.. ఇవాళ కూడా మరో చీతా ప్రాణాలు కోల్పోయింది. ఈ మరణాలు ఇకపై జరగకూడదని.. చీతాల ప్రాణాలు నిలిచేలా చర్యలు తీసుకోవాలని సౌతాఫ్రికా నిపుణులు కోరుతున్నారు.

చీతాల మరణం పాపం ఎవరిది ?
చిత్తశుద్ధి లేకుండా ఆర్భాటాలకు పోతే ఇలాంటి పరిణామాలే చోటుచేసుకుంటాయి. భారత వాతావరణ పరిస్థితులు సౌతాఫ్రికా చీతాలకు అనుకూలంగా ఉంటాయో లేవో.. ఒకవేళ ఉండకపోతే చీతాలు వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టాలి వంటి కనీస ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకుండానే.. చీతాలను మనదేశం తరలించారు. గత ప్రభుత్వాలు చేయలేని పనిని తామే చేశామని చెప్పుకోవడం కోసం.. మోడీ సర్కార్ తొందరపాటుతో వ్యవహరించినట్టు నిపుణుల మాటలను బట్టి అర్థమవుతుంది. చీతాల మరణాలకు ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. సౌతాఫ్రికా నుంచి భారత్ రాగానే.. ఒక చీతా మరణించిందంటే..ఇక్కడ వాతావరణానికి ఇంకా అలవాటు పడలేదని సర్దిచెప్పుకోవచ్చు. కానీ వరుసపెట్టి ఇప్పటి వరకు 9 చీతాలు చనిపోయాయంటే.. ప్రభుత్వం కళ్లు తెరవాలి. అంతర్జాతీయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. చీతాలను మధ్యప్రదేశ్ పార్కులో స్వయంగా విడిచిపెట్టిన ప్రధానిమంత్రి గారూ.. ఈ మరణాలపై రివ్యూ చేయాలి.