రోహిత్ టెస్ట్ కెరీర్ ముగిసినట్టే, ఈ సిరీస్ తోనే గుడ్ బై ?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ ముగిసినట్టే కనిపిస్తోంది. ఈ ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ విజయంతో పొట్టి క్రికెట్ కు వీడ్కోలు పలికిన హిట్ మ్యాన్ ఇప్పుడు రెడ్ బాల్ ఫార్మాట్ కు గుడ్ బై చెబుతాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - December 10, 2024 / 12:20 PM IST

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ ముగిసినట్టే కనిపిస్తోంది. ఈ ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ విజయంతో పొట్టి క్రికెట్ కు వీడ్కోలు పలికిన హిట్ మ్యాన్ ఇప్పుడు రెడ్ బాల్ ఫార్మాట్ కు గుడ్ బై చెబుతాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ తర్వాత రోహిత్ కీలక నిర్ణయం తీసుకునే ఛాన్సుందని భావిస్తున్నారు. గత కొంత కాలంగా టెస్టుల్లో టీమిండియా ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన 3-మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 3-0తో కోల్పోయి తీవ్ర విమర్శలపాలైంది. ఇప్పుడు బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లోని మొదటి టెస్ట్‌లో గెలిచిన భారత్ రెండో టెస్టులో ఓడిపోయింది. అంటే గత 5 టెస్ట్ మ్యాచ్‌ల్లో 4 టెస్టుల్లో టీమిండియా ఓడిపోయింది, ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమ్ ఇండియా ఫైనల్ చేరడం చాలా కష్టంగా మారింది. దీనికి కారణం కెప్టెన్ రోహిత్ శర్మ అంటున్నారు.

టీమిండియా గత 5 టెస్ట్ మ్యాచ్‌ల్లో నాలుగింటిలో రోహిత్ కెప్టెన్సీలోనే ఓడింది. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో రోహిత్ ఆడలేదు. బుమ్రా సారధ్యంలో భారత్ తొలి టెస్టు గెలిచింది. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో రోహిత్ శర్మ అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాటర్‌గా దారుణంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. వీటిల్లో అతని ప్రదర్శన సగటు కంటే తక్కువగానే ఉంది. రోహిత్ చాలా కాలంగా ఫామ్‌కు దూరంగా ఉన్నాడు. రోహిత్ ఆడిన గత 4 టెస్టుల్లో అతని ప్రదర్శనపై ఆందోళన వ్యక్తమవుతోంది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 6 ఇన్నింగ్స్‌ల్లో 92 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్‌గా గత 8 టెస్ట్‌ ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ 101 పరుగులే చేశాడు. అడిలైడ్ లో రాహుల్ కోసం తన ఓపెనింగ్ ప్లేస్ ను త్యాగం చేసిన రోహిత్ మిడిలార్డర్ లో ఆకట్టుకోలేకపోయాడు.

రోహిత్ పేలవ ప్రదర్శన కచ్చితంగా జట్టును ఇబ్బంది పెడుతోంది. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో ఇంకా 3 టెస్టులు మిగిలి ఉన్నాయి. ఈ మూడు టెస్టుల్లో బ్యాటర్ గా, కెప్టెన్‌గా రోహిత్ విఫలమైతే ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకాల్సిందేనని సీనియర్ క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. పెర్త్ టెస్ట్‌లో అద్భుతమైన విజయాన్ని అందించిన బుమ్రాకు పూర్తి స్థాయి టెస్ట్ కెప్టెన్సీ ఇవ్వాలని కోరుతున్నారు. అభిమానులు కూడా రోహిత్ ప్రదర్శనను పాజిటివ్‌గా తీసుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లు హిట్‌మ్యాన్ పేలవ ప్రదర్శనపై నోరు మెదపనప్పటికీ, ఇప్పుడు విమర్శలు ఎక్కు పెడుతున్నారు. 37 ఏళ్ల రోహిత్ 65 టెస్టుల్లో 12 సెంచరీలతో 4280 పరుగులు చేశాడు. ఒకవేళ ఆసీస్ తో సిరీస్ అనంతరం రోహిత్ రెడ్ బాల్ క్రికెట్ కు వీడ్కోలు పలికితే ఇక వన్డేలకు మాత్రమే పరిమితమవుతాడు.