పింక్ బాల్ అంత ఈజీ కాదు, బ్యాటర్లకు కష్టాలేనా ?

దాదాపు 10 రోజుల బ్రేక్ తర్వాత మళ్ళీ భారత్, ఆస్ట్రేలియా టెస్ట్ సమరం మొదలుకాబోతోంది. పెర్త్ టెస్టులో కంగారూలను చిత్తుగా ఓడించిన టీమిండియా సిరీస్ లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. అయితే ఇక్కడ నుంచి రోహిత్ సేనకు అసలైన సవాల్ ఎదురుకాబోతోంది.

  • Written By:
  • Publish Date - December 5, 2024 / 12:45 PM IST

దాదాపు 10 రోజుల బ్రేక్ తర్వాత మళ్ళీ భారత్, ఆస్ట్రేలియా టెస్ట్ సమరం మొదలుకాబోతోంది. పెర్త్ టెస్టులో కంగారూలను చిత్తుగా ఓడించిన టీమిండియా సిరీస్ లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. అయితే ఇక్కడ నుంచి రోహిత్ సేనకు అసలైన సవాల్ ఎదురుకాబోతోంది. ముఖ్యంగా ఆధిక్యాన్ని కాపాడుకోవడంతో పాటు దానిని పెంచుకునే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. కానీ అడిలైడ్ వేదికగా జరగబోయే డే అండ్ నైట్ టెస్టులో గులాబీ సవాల్ ఎదురుచూస్తోంది. గత టూర్ లో పింక్ బాల్ టెస్టులోనే భారత్ ఘోరపరాభవాన్ని మూటగట్టుకుంది. కేవలం 36 పరుగులకే కుప్పకూలి దారుణంగా ఓడిపోయింది. తర్వాత పుంజుకుని మళ్ళీ సిరీస్ గెలిచినప్పటకీ పింక్ బాల్ టెస్ట్ చేదు జ్ఞాపకంగా మిలిగిపోయింది. ఇప్పుడు మరోసారి పింక్ బాల్ టెస్టులో పిచ్ భారత్ కు సవాల్ విసురుతోంది. రెండో టెస్టు మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 1-1తో స‌మం చేయాల‌ని ఆస్ట్రేలియా ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ నేప‌థ్యంలో పిచ్ ఎలా ఉండ‌బోతుందోన‌ని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ డే అండ్ నైట్ టెస్టు కోసం ప‌చ్చిక‌తో కూడిన పిచ్‌ను రూపొందిస్తున్నారు. సుమారు ఆరు మిల్లీమీట‌ర్ల గ‌డ్డిని ఉంచ‌నున్న‌ట్లు హెడ్ క్యూరేట‌ర్ చెప్పాడు. దీంతో ఫ్ల‌డ్ లైట్ల కింద కొత్త బంతితో బ్యాటింగ్ చేయ‌డం చాలా క‌ష్టంగా మారుతుంద‌న్నాడు. పిచ్ పై ప‌చ్చిక ఎక్కువ‌గా ఉండ‌డంతో తేమ‌శాతం అధికంగా ఉంటుంద‌న్నాడు. మ్యాచ్ జ‌రుగుతున్నా కొద్ది స్పిన్న‌ర్ల‌కు కూడా స‌హ‌కారం దొరుకుతుందని చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం పిచ్ పై ఏడు మిల్లీమీట‌ర్ల గ‌డ్డి ఉంద‌ని, మ్యాచ్ స‌మ‌యానికి దాన్ని ఆరు మిల్లీమీట‌ర్ల‌కు త‌గ్గిస్తామ‌ని చెప్పాడు. బ్యాట్‌కు, బంతికి మ‌ధ్య మంచి గట్టి పోటీ ఉంటుంద‌న్నాడు. రెండు జ‌ట్ల‌కు అద్భుత‌మైన పేస‌ర్లు ఉన్నార‌ని, బాల్ పాత‌ది అయ్యే కొద్ది బ్యాట‌ర్లు రాణిస్తారని క్యూరేటర్ చెబుతున్నప్పటకీ… ఓవరాల్ గా పరుగులు చేయడం మాత్రం సవాల్ గానే ఉంటుందని అంచనా.

ఇదిలా ఉంటే పింక్ బాల్ టెస్టుల్లో భారత్ రికార్డు మెరుగ్గానే ఉన్నప్పటకీ… ఆసీస్ గడ్డపై మాత్రం చుక్కెదురైంది. 2019లో తొలిసారి భారత్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లను ఆడటం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు 4 పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా.. అందులో మూడింటిలో గెలిచింది. అయితే ఆసీస్ టూర్ లో మాత్రం గెలవలేకపోయింది. ఈ సారి గెలుపు రుచి చూడాలని పట్టుదలగా కనిపిస్తోంది. అయితే తుది జట్టు కూర్పే సవాల్ గా మారింది. వ్య‌క్తి గ‌త కార‌ణాల‌తో తొలి టెస్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శ‌ర్మ వ‌చ్చేశాడు. అత‌డితో పాటు గాయంతో దూరం అయిన గిల్ సైతం రెండో టెస్టుకు అందుబాటులోకి వ‌చ్చాడు. దీంతో తొలి టెస్టులో ఆడిన దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్‌, ధ్రువ్ జురెల్‌ల స్థానంలో వీరిద్దరూ ఆడతారు. అయితే ఓపెనర్ గా రాహుల్, రోహిత్ లో ఎవరు వస్తారనేది చూడాలి.