ఇజ్రాయెల్ బాంబుల మోతలతో, యుద్ద రాకెట్ల దాడులతో చిగురుటాకుల్లా ఒణికిపోతోంది. అక్కడి ప్రజలు బిక్కు బిక్కుమని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఏ క్షణంలో ఎవరి ఇంటిపై పాలస్తీన్లు దాడి చేస్తారో అర్థం కాని పరిస్థితి.ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది. ఈ నిశ్శబ్ధ యుద్దాన్ని ఎందుకు అంచనా వేయలేక పోయింది అనే అనుమానాలు చాలా మందిలో మొదలుతోంది. నిజానికి చెప్పాలంటే ఎవరు చిటికేసినా ఇట్టే చెప్పేయగల సాంకేతికత ఇజ్రాయెల్ సొంతం. ప్రతి పౌరుడి ఉచ్చ్వాస, నిశ్వాసలు కూడా ప్రభుత్వానికి తెలిసేలా జాగ్రత్తపడగల దేశం ఇది. ఒకరికి తెలియకుండా మరొకరి రహస్యాన్ని ఇట్టే రాబట్టగల అత్యంత అధునాతనమైన విషయాలపై పట్టుకలిగి ఉంది. ఇలాంటి దేశంలో ఇంతటి భీకరపరిస్థితులు తలెత్తుతుంటే ఇంటెలిజెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
భారత్ ను ఒణికించిన పెగాసస్..
గతేడాదిలో భారత పార్లమెంట్ ను గడగడలాడించిన అంశం ఒకటి ఉంది. అదే పెగాసస్. దీనిని ఎవరి ఫోన్లో, లాప్ టాప్, లేదా ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజ్ లోనైనా చొప్పించి వారి వ్యక్తి గత గోప్యతా వివరాలను ఇట్టే లాగేయవచ్చు. ఇలాంటి సాంకేతికతను తయారు చేసింది ఇజ్రాయెలే. ఇలాంటి సాఫ్ట్ వేర్ ను రూపొందించి ప్రపంచానికి అత్యధునికతను అందిపుచ్చేలా చేసింది. ఇలాంటి సాఫ్ట్ వేర్ ఉండి కూడా పాలస్తీన్ల చర్యలను తన సొంత దేశంలో జరుగుతున్న దాడికి సంబంధించిన విషయాలను కనిపెట్టలేక పోయింది. సైనిక బలగాలకు చెందిన సరైన కార్యాచరణ, రానున్న సవాళ్లు , ప్రతికూలతలు ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలం అయింది. అయితే ఇంతటి అధునాతన గురించి హమాస్ కు బాగా తెలుసు. అదే విధంగా ఎక్కడెక్కడ బలహీనంగా ఉంది అనే అంశాన్ని వీరు క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సమయం చూసి బాంబుల వర్షం కురిపించారు ఇజ్రాయెల్ మీద. గతంలో చేసిన దాడులకు ఈ సారి చేసిన దాడుల తీవ్రతలో చాలా తేడా ఉంది.
వేరే దేశంపై దృష్టి పెట్టి తాను ఇరుకున పడిందా..
తన దేశంలో ఏ మారుమూల ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎప్పటికప్పుడు గుర్తిస్తూనే ఉంటుంది. అయితే తాజాగా హమాస్ కి మద్దతుగా నిలుస్తున్న ఇరాన్ పై ఎక్కువ దృష్టి సారించింది. ఈ క్రమంలో ఇరాన్, ఇజ్రాయెల్ పతనానికి చేస్తున్న మద్దతును ఎలా చెక్ పెట్టాలన్న కోణంలో ఎక్కువ ఆలోచిస్తూంది. దీంతో పాటూ నిధుల అధిక సంఖ్యలో అందుతున్న ఇస్లామిక్ రిపబ్లికన్ అణుకార్యక్రమాలతోపాటూ, అరేబియన్ దేశాలపై నిఘా పెట్టింది. ఇలా ఇతర దేశాలపై ఎక్కువ సమయం కేటాయించడంతో తన దేశంలో జరుగుతున్న విధ్వంసాన్ని గుర్తించడంలో విఫలం అయింది. అలా ఇంటెలిజెన్స్ తీవ్రంగా విఫలమైందని చెప్పాలి.
దీని ప్రభావం ఇజ్రాయెల్ పై ఇలా..
హమాస్, ఇజ్రాయెకు మధ్య జరుగుతున్న హోరా హోరీ యుద్దంలో సామాన్య ప్రజలు బలి అవుతున్నారు. పరస్పరం చేసుకుంటున్న దాడుల్లో చాలా మంది క్షతగాత్రలుగా, విగతజీవులుగా పడి ఉన్నారు. అక్కడి స్థానిక మీడియా సంస్థలు వెలువరిస్తున్న కథనాల ప్రకారం మృతుల సంఖ్యతో పాటూ గాయపడిన వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అక్కడి స్థానిక అధికారులు చెబుతున్నారు. కొందరి పరిస్థితి చాలా విషయంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి.
మృతులు-క్షతగాత్రులు
ఇజ్రాయెల్ లో మరణాల సంఖ్య 300 దాటింది.
గాయపడ్డవారి సంఖ్య 1500
పరిస్థితి విషమంగా ఉన్న వారి సంఖ్య 700 పైనే.
పాలస్తీనాలోని గజాలో 300 మంది మరణించినట్లు తెలుస్తోంది.
T.V.SRIKAR