Israel: హమాస్ ఉచ్చులో ఇజ్రాయెల్ పడబోతుందా.. అదే జరిగితే ఈ దేశం పరిస్థితి ఏంటి..?

హమాస్ - ఇజ్రాయెల్ యుద్దం గత పక్షం రోజులుగా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. అయితే హమాస్ తన యుద్దాన్ని కాస్త నెమ్మదింపజేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హమాస్ చేసిన దాడికంటే ఇజ్రాయెల్ సృష్టించిన మారణహోమమే అధికంగా కనిపిస్తోంది. ఇది ఇలాగే జరిగితే రానున్న రోజుల్లో భౌతికంగా, రాజకీయంగా, సైనికదళాల పరంగా తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

  • Written By:
  • Publish Date - October 16, 2023 / 12:02 PM IST

హమాస్ చేసిన చాటు యుద్దానికి ప్రతీకగా ఆ ప్రాంతంపై దండయాత్ర చేపట్టింది. టెంపర్ సినిమాలో డైలాగ్ ను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. ఇద్దరు కొట్టుకుంటే యుద్దం.. ఒకడిపై పడిపోతే దండయాత్ర అది ఇజ్రాయెల్ దండయాత్ర అని చెప్పాల్సి ఉంటుంది. ఈ వాతావరణం ఇలాగే కొనసాగితే అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ కు భారత్ సహా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, అమెరికా అగ్రదేశాలు మద్దతు ప్రకటించాయి. ఈ మద్దతు ఉపసంహరించుకునే ప్రమాదం ఉంది. దీనికి కారణం ఇజ్రాయెల్ చేసిన దాడుల కారణంగా గాజాలోని అమాయక ప్రజలు తమ ఇళ్లను కోల్పోయి నిర్వాసితులు అయ్యారు. పైగా కూటికి కూడా గతిలేని దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒకరి కోసం మరొకరిని బలిపెట్టడం అనేది ప్రపంచ దేశాలు అంగీకరించవు. దీంతో మానవత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది ఇజ్రాయెల్. ఇదే గనుక జరిగితే ఆర్థికంగా, సాంకేతికంగా చాలా దెబ్బతినే ప్రమాదం ఉంది అంటున్నారు నిపుణులు. ఎందుకుంటే ఆ దేశంతో దాదాపు చాలా వరకూ సత్సంబంధాలను తెంచుకునేందుకు ప్రయత్నిస్తాయి మిగిలిన దేశాలు. దీంతో దౌత్యం రద్దయి ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సాంకేతికంగా ఐటీ సంస్థలు తమ ప్రాజెక్టులను ఇతర దేశాలకు కట్టబెట్టే అవకాశం ఉంది. దీంతో ఆదాయం క్షీణించి దేశాభివృద్దిని కోల్పోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

హమాస్ ను అంతం చేసేందుకు ప్రయత్నం..

ఇజ్రాయెల్ తమకున్న మూడు లక్షల మంది రిజర్వుడ్ బలగాలను గాజా సరిహద్దుల్లోకి తరలించింది. దీంతో పాటూ 1.70 లక్షల మంది సైనికులను కూడా అక్కడకు పంపించింది. దీనికి కారణం హమాస్ ను ఆశ్రయం కల్పిస్తున్న గాజాను ఆక్రమించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపోతోంది. అటు హామాస్ సైన్యాన్ని లెక్కలోకి తీసుకుంటే కేవలం 30,000 మంది మాత్రమే ఉన్నారు. అంటే ఇజ్రాయెల్ రిజర్వుడు బలగాల్లో కేవలం 10 శాతం అనమాట. పైగా వీరి వద్ద వైమానిక దళాలు, యుద్ద ట్యాంకులు లేని పరిస్థితి. దీంతో గాజాను ఆక్రమించుకుని హమాస్ ను మట్టుపెట్టాలని భావిస్తోంది ఇజ్రాయెల్.

పాలస్తీనియన్ల ఉచ్చులో ఇజ్రాయెల్..?

ఇదిలా ఉంటే హమాస్ కు ఉన్న సొరంగ మార్గాల ద్వారా గాజా పై దాడులను సులభంగా తిప్పికొట్టగలదు. పైగా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న నగరాల్లో గాజా ఒకటి. హమాస్ సైనికులు అడిగితే గాజా వాసులు తమ ఇళ్లను ఆవాసాలుగా ఇచ్చేందుకు వెనుకాడరు. దీంతో గాజాలోని ప్రతి ఇల్లు హమాస్ సైనికులకు రక్షణ కవచంలాగా మారుతుంది. దీనిని ఆసరాగా చేసుకుని ఇజ్రాయెల్ సైనికులు చొరబడే ప్రాంతాల్లో మందు పాతరలను ఏర్పాటు చేస్తే.. వాటిని దాటుకుని గాజా ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం కష్టమౌతుంది. పైగా ఇజ్రాయెల్ రిజర్వుడు బలగాలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో తమ దేశ సైనిక బలగాలను కోల్పోవల్సి వస్తుంది ఇజ్రాయెల్. బహుశా ఇలా భావించే ఉత్తర గాజాలోని ప్రజలను ఖాళీ చేయాలని హెచ్చరిస్తోంది ఇజ్రాయెల్.

మరో అమెరికా – అఫ్గాన్ యుద్దం తప్పదా..?

ఇలాంటి భిన్నమైన ఉపద్రవాలతో కూడిన పరిస్థితులను అంచనా వేయకుండా రంగంలోకి దిగితే ఇజ్రాయెల్ తీవ్రంగా నష్టపోక తప్పదని హెల్యర్ అనే విశ్లేషకుడు అభిప్రాయపడుతున్నారు. పైగా ఇది హమాస్ వేసిన ట్రాప్లో పడి తన దేశ సైనిక బలగాలను కోల్పోవడంతో పాటూ ఆర్థికంగా, సామాజికంగా నష్టపోవడమే అని పశ్చిమాసియాకు చెందిన మరో విశ్లేషకుడు హసన్ అల్ హసన్ అభిప్రాయపడ్డాడు. అయితే హమాస్ తనపై దొంగదెబ్బ తీసిందని భావించి ఇజ్రాయెల్ ఎదురుదాడికి దిగితే యుద్దం ఇప్పట్లో చల్లారేది కాదు. సుదీర్ఘ కాలం చాలా మంది ప్రాణాలను కోల్పోవల్సి వస్తుంది. దీంతో తీవ్ర స్థాయిలో రక్తపాతం సంభవించే అవకాశం ఉంది. ఈ పరిస్థితులు తన రాజకీయ భవిష్యత్తకే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని నెతన్యాహు గమనించాలి. లేకుండా గతంలో అఫ్గానిస్తాన్ – అమెరికా 20 ఏళ్ల యుద్ద పరిస్థితులు పునరావృతం అవుతాయని చెప్పకతప్పదు.

T.V.SRIKAR