గబ్బా టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. బౌలర్లు విఫలమైన వేళ ఆస్ట్రేలియా భారీస్కోర్ సాధించగా… అటు బ్యాటర్లు కూడా చేతులెత్తేశారు. అంచనాలు పెట్టుకున్న టాపార్డర్ లో రాహుల్ తప్పిస్తే మిగిలినవారంతా నిరాశపరిచారు. ఫలితంగా భారత్ 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే ఆసీస్ భారీస్కోరుకు ఒకవిధంగా రోహిత్ శర్మ డిఫెన్సివ్ కెప్టెన్సీనే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రోహిత్ ఫీల్డింగ్ సెటప్ చెత్తగా ఉందంటూ పలువురు మాజీలు విమర్శిస్తున్నారు. తాజాగా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి రోహిత్ కెప్టెన్సీపై ఫైర్ అయ్యాడు. హెడ్ ను కట్టడి చేసేందుకు ఏమాత్రం ప్రయత్నించలేదని విమర్శించాడు చెత్త సెటప్ అంటూ రవిశాస్త్రి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అసలు భారత్ అంటేనే రెచ్చిపోతున్న ఆటగాడి కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. కోచ్ గంభీర్ ఏం చేస్తున్నాడోనంటూ సెటైర్లు వేశాడు.
మరోవైపు ఆసీస్ మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సైతం రోహిత్ కెప్టెన్సీని తప్పుపట్టాడు. . హెడ్, స్మిత్‌లను షార్ట్ బాల్స్‌తో అటాక్ చేయాల్సిందిపోయి.. వారికి షాట్లు ఆడే అవకాశం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు సైతం రోహిత్ శర్మ కెప్టెన్సీ, ఆట తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కూడా రోహిత్ శర్మను సమర్థిస్తే అంతకంటే ఘోర తప్పిదం మరొకటి ఉండదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇంత డిఫెన్సివ్‌గా కెప్టెన్సీ చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐ సెలక్టర్లు వచ్చే తరంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. రోహిత్ ను సారథిగా తప్పించి బుమ్రాకు టెస్ట్ జట్టు పగ్గాలు ఇవ్వాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అడిలైడ్ టెస్టులోనూ ట్రావిస్ హెడ్ విధ్వంకర ఇన్నింగ్స్ ఆడాడు. అతని సెంచరీతోనే ఆసీస్ భారీ ఆధిక్యం సాధించగా.. ఇప్పుడు గబ్బాలోనూ మరోసారి శతకంతో రెచ్చిపోయాడు. హెడ్ , స్మిత్ ల సెంచరీలతో ఆసీస్ భారీస్కోర్ చేసింది. గత ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తో పాటు వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోనూ భారత్ విజయానికి అడ్డుపడిన హెడ్ కోసం భారత్ ప్రత్యేక వ్యూహం సిద్ధం చేయకపోవడం విమర్శలకు తావిచ్చింది.