ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి జాక్ పాట్ కొట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయిన ఆయనను అధిష్టానం పిలిచి మరీ కీలక పదవిని కట్టబెట్టింది. సత్యసాయి జిల్లాలోని సొంతూరు నీలకంఠాపురంలో వ్యవసాయం చేసుకుంటూ సాధారణ జీవితం గడుపుతున్న రఘువీరారెడ్డి గురించి.. భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలిసిందట. అలాంటి వ్యక్తికి పార్టీలో సముచిత స్థానం దక్కాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో అప్పుడే రాహుల్ చెప్పారట. ఆ విధంగానే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పునర్ వ్యవస్థీకరణలో రాహుల్ గాంధీ మార్క్ కనిపించింది. సీడబ్ల్యూసీ సభ్యులుగా ఛాన్స్ పొందిన 39 మంది పార్టీ దిగ్గజ నేతల లిస్టులో రఘువీరారెడ్డి పేరు కూడా చేరింది.
రాయలసీమ.. రెడ్డి సామాజిక వర్గంపై ఫోకస్..
సీనియర్ నేత రఘువీరారెడ్డికి ఇంతపెద్ద ఛాన్స్ ఇవ్వడం వెనుక కాంగ్రెస్ పార్టీకి భారీ వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో అంతంతమాత్రంగానే ఉన్న కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు రఘువీరారెడ్డి సేవలను వాడుకోవాలని అధిష్టానం భావిస్తోందని చెబుతున్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనతో ఏపీ ప్రజలకు దూరమైన కాంగ్రెస్.. ఇప్పుడు రఘువీరారెడ్డికి కీలకమైన పార్టీ పదవిని కట్టబెట్టడం ద్వారా ఏపీకి తాము ఎంతటి ప్రాధాన్యం ఇస్తామనే విషయాన్ని రాష్ట్ర ప్రజల్లోకి పంపుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా రఘువీరారెడ్డికి పేరు ఉండేది. వైఎస్సార్ సీపీ కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును వాడుకొని అధికారంలోకి వచ్చింది. వైఎస్సార్ సీపీలోకి భారీగా వలస వెళ్లిన కాంగ్రెస్ ముఖ్య నేతలను మళ్లీ కాంగ్రెస్ వైపునకు లాగేందుకు రఘువీరారెడ్డిని కాంగ్రెస్ అస్త్రంగా సంధించనుందని తెలుస్తోంది. వైఎస్సార్ సీపీలోని తగిన ప్రాధాన్యం దక్కక అసంతృప్తి తో ఉన్న మాజీ కాంగ్రెస్ లీడర్లపై రఘువీరారెడ్డి ద్వారా ఆపరేషన్ ఆకర్ష్ ను నిర్వహించాలనే స్కెచ్ తో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఉందట. గతంలో ఏపీలో కాంగ్రెస్ వెనుక విశ్వసనీయంగా నడిచిన సామాజిక వర్గం.. రెడ్డి!! గతంలో ఏపీలో కాంగ్రెస్ వెనుక విశ్వసనీయంగా నడిచిన ప్రాంతం.. రాయలసీమ !! పార్టీతో విధేయంగా నడిచే నేతగా రఘువీరారెడ్డికి ఉన్న ఇమేజ్ తో పాటు ఈ రెండు పాయింట్స్ కూడా ఆయనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చోటు దక్కేలా చేశాయని అంటున్నారు.
రఘువీరారెడ్డిపై షర్మిలకు మంచి ఒపీనియన్ ఉండటం వల్లే ?
వైఎస్సార్ ఫ్యామిలీతో రఘువీరారెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. రఘువీరారెడ్డిపై వైఎస్ షర్మిలకు కూడా మంచి ఒపీనియన్ ఉంది. ఫ్యూచర్ లో షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆమె తెలంగాణ పాలిటిక్స్ కే పరిమితం అవుతానని అంటున్నారు. కనీసం ఏపీలో కాంగ్రెస్ కోసం ప్రచారమైనా చేయాలని హస్తం పార్టీ అధిష్టానం కోరుతోంది. అయితే దీనిపై షర్మిల ఏం రిప్లై ఇచ్చారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ ఏపీలో కాంగ్రెస్ కోసం ప్రచారం చేసేందుకు షర్మిల ఓకే చెబితే.. ఆమె యాత్రకు సంబంధించిన వ్యూహ రచనను రఘువీరారెడ్డి చేసే ఛాన్స్ ఉంటుంది. కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి ఉన్న వైఎస్సార్ సీపీ, టీడీపీ నేతల లిస్టుపై ఆయన కసరత్తు చేయనున్నారు. కనీసం రెడ్డి, క్రైస్తవ, మైనార్టీ ఓటు బ్యాంకులోని కొంత భాగాన్నైనా మళ్ళీ కాంగ్రెస్ తన వైపు లాక్కోగలిగినా వచ్చే ఎన్నికల్లో ఏపీలో సెకండ్ ప్లేస్ కోసం పోటీ బాగా పెరుగుతుంది. జనసేన, బీజేపీ అభ్యర్ధులకు ముచ్చెమటలు పట్టే అవకాశాలు ఇంకా పెరుగుతాయి.