ఏపీ కాంగ్రెస్ (AP Congress) అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల (YS Sharmila) నియమితులయ్యారు. 2,3 రోజుల్లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు. తన అన్న వైసీపీ అధినేత, సీఎం జగన్ (CM Jagan) కు వ్యతిరేకంగా ఆమె పనిచేయబోతున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections) జగన్ లోపాలను ఎంత టార్గెట్ చేస్తే.. అంత షర్మిలకు భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కొన్ని సీట్లు రప్పించినా.. కనీసం గణనీయమైన ఓట్లు సాధించిపెట్టినా అది షర్మిలకు ప్లస్ అవుతుంది. మొన్నటిదాకా తన ఇద్దరు బిడ్డలు రెండు రాష్ట్రాలు చూసుకుంటారు.. ఇద్దరూ తనకు రెండు కళ్ళ లాంటివారని చెప్పిన.. తల్లి విజయమ్మ ఏపీలో ఎవరి పక్షాన నిలబడతారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ఒకప్పుడు వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ.. తెలంగాణలో షర్మిల YSR TP పెట్టిన తర్వాత రిజైన్ చేశారు. ఇద్దరు బిడ్డలు రెండు రాష్ట్రాల్లో రాజకీయం చేస్తారని చెప్పారు. వైసీపీకి రిజైన్ చేశాక.. మళ్ళీ ఏపీలో జగన్ తరపున ఏనాడూ.. ఏ మీటింగ్ లోనూ విజయమ్మ పాల్గొనలేదు. కానీ తెలంగాణలో షర్మిల చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో.. పార్టీ మీటింగ్స్ లో ఆమె కనిపించారు. కానీ ఇప్పుడు.. తన రెండు కళ్ళు.. తన ఇద్దరు బిడ్డలు ఒకే రాష్ట్రంలో పోటీ పడుతున్నారు. మరి ఇప్పుడు తల్లి విజయమ్మ ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు.
గతంలో అంటే వైసీపీ, వైఎస్సార్ టీపీ.. రెండూ.. రెండు రాష్ట్రాల్లో ఉండటం.. అవి వేర్వేరుగా ఒక్క రాష్ట్రానికే పరిమితం అయి ఉండటంతో విజయమ్మకు ఇబ్బంది లేకుండా పోయింది. అందుకే ఆమె ఎవరికి మద్దతు ఇస్తారన్న ప్రశ్న కూడా తలెత్తలేదు. ఇప్పుడు తన వైఖరి ఏంటో చెప్పాల్సిన అవసరం ఏర్పడింది విజయమ్మకు. అన్నను ఢీ కొట్టడానికే ఏపీలోకి వచ్చారు షర్మిల. ఆమె మొహమాట పడితే.. 10యేళ్ళుగా పడిపోయి ఉన్న కాంగ్రెస్ అస్సలు లేచే పరిస్థితి ఉండదు. పైగా ఏపీలో కాంగ్రెస్ కోలుకోకపోతే.. షర్మిల రాజకీయ భవితవ్యం కూడా చిక్కుల్లో పడే అవకాశముంది. అందువల్ల షర్మిల కూడా నూటికి నూరు శాతం కాంగ్రెస్ అభివృద్ధికి పనిచేయాల్సి ఉంది.
ఈ టైమ్ లో విజయమ్మ నైతిక బలం కూడా.. షర్మిలకు చాలా ముఖ్యం. తెలంగాణలో తల్లి సపోర్ట్ తో మరింత పనిచేయగలిగింది షర్మిల. ఇప్పటిదాకా విజయమ్మ కూడా షర్మిలనే సపోర్ట్ చేస్తూవచ్చారు. ఒకవేళ ఏపీలో కూడా కూతురుకే మద్దతు అందిస్తే జగన్ కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఎందుకంటే చాలామంది కాంగ్రెస్, వైఎస్సార్ అభిమానులు.. ఏపీలో హస్తం పార్టీ పరిస్థితి బాగోలేక వైసీపీకే అండగా నిలబడ్డారు. కానీ ఇప్పుడు అదే వైఎస్పార్ బిడ్డ కాంగ్రెస్ ని నడిపిస్తుండటం.. రేపు విజయమ్మ సపోర్ట్ కూడా తోడైతే జగన్ చిక్కుల్లో పడ్డట్టే. ఇప్పటికే తల్లి, చెల్లిని వెళ్ళగొట్టారన్న అపవాదు ఆయనపై ఉంది. బాబాయ్ హత్య కేసు విషయంలో మరో చెల్లెలు సునీతారెడ్డి కూడా జగన్ పై ఆగ్రహంగా ఉన్నారు. అంటే షర్మిలకు ఒక్క విజయమ్మ సపోర్ట్ అందిస్తే.. వైఎస్ కుటుంబం చాలా మటకు ఒక వైపే ఉంటుంది. బిడ్డ కోసం కాంగ్రెస్ ప్రచారం కూడా విజయమ్మ చేపడితే.. అప్పుడు ఖచ్చితంగా కొడుకు జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పరిస్థితి కూడా ఆమెకు ఏర్పడుతుంది. విజయమ్మ ప్రస్తుతం షర్మిల ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఎక్కువగా ఆమెతోనే కనిపిస్తున్నారు. జగన్ తో చాలా రోజుల తర్వాత ఈమధ్య క్రిస్మస్ సందర్భంలో ఒక్కసారి మాత్రమే కనిపించారు విజయమ్మ. ఇక ముందు కూడా షర్మిలతోనే విజయమ్మ కనిపిస్తుంటే మాత్రం.. కూతురుకే తల్లి సపోర్ట్ చేస్తుందన్న సంకేతాలు వెళతాయి. అప్పుడు జగన్ కు ఇబ్బందులు తప్పకపోవచ్చు.