బెజవాడ అంటే టక్కున గుర్తొచ్చేది వంగవీటి కుటుంబం. రంగా తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని రాధా కంటిన్యూ చేస్తున్నారు. ఐతే ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వంగవీటి రంగా కుమార్తె ఆశాలత గురించి ఆసక్తికర చర్చ మొదలైంది. వంగవీటి రంగా కుమార్తె ఆశాలత రాజకీయాల్లోకి రానున్నారని.. బెజవాడ సెంట్రల్ నుంచి ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
వంగవీటి రంగా రాజకీయ వారసత్వాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లేందుకు.. ఆయన కుమార్తె ఆశాలతను ఎన్నికల బరిలోకి దించాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా సమాచారం. 2024 ఎన్నికల్లో రంగా కుటుంబానికి రాజకీయంగా గట్టి పట్టు ఉన్న విజయవాడ సెంట్రల్ నుండి ఆమెని బరిలోకి దింపేందుకు.. ఆమె మేనమామ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆశ మీదే.. పార్టీలన్నీ చాలా ఆశలు పెట్టుకున్నాయ్. ఎలాగైనా తమ పార్టీలోకి ఆహ్వానించాలని పట్టు మీద కనిపిస్తున్నాయ్. విజయవాడతో పాటు, గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి ఎక్కువ అవకాశాలు ఉండటంతో రంగా వారసత్వం పార్టీకి అవసరమని భావిస్తున్న పార్టీలు.. ఆశాలతను పార్టీలోకి తీసుకువచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయ్.
రంగాపై ఉన్న అభిమానం ఓటు బ్యాంకుగా మారుతుందని భావిస్తున్న పార్టీలు.. ఆశాలతను రాజకీయాల్లోకి తీసుకురావాలని పావులు కదుపుతున్నాయ్. ఆమె రావడం.. పోటీ చేయడం ఖాయం అనిపిస్తున్నా.. ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారు అన్నది మాత్రం మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. వైసీపీ నుంచి ప్రధానంగా ఆహ్వానం అందుతుండగా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూడా ప్రయత్నాలు సాగిస్తున్నాయ్. మరి ఆశాలత ఏ పార్టీ వైపు మొగ్గుతుందన్న సందిగ్ధం.. ఏపీ రాజకీయాల్లో కనిపిస్తోంది. వంగవీటి రంగా మరణం తర్వాత.. ఆయన భార్య రత్నకుమారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వంగవీటి రాధా విజయం సాధించారు. ఐతే ఇప్పుడు రత్నకుమారి రాజకీయాలకు దూరంగా ఉంటే.. రాజకీయాల్లో రాధా సరిగా రాణించడం లేదు. ఇలాంటి సమయంలో వంగవీటి ఇంటి ఆడపడుచు రాజకీయాల్లోకి రాబోతుందనే వార్తన.. సరికొత్త చర్చకు కారణం అవుతోంది.