YS Jagan: సెప్టెంబర్ నుంచి జగన్ ప్రజాయాత్ర చేపట్టనున్నారా..? అవలంభించే వ్యూహాలు ఇవేనా..?

వైఎస్ జగన్ సెప్టెంబర్ నుంచి ప్రజల్లో మమేకం అవనున్నారా.. సంక్షేమానికి మరింత పెద్దపీట వేస్తూ ఆయన ప్రయాణం సాగుతుందా.. వీటన్నింటకీ సమాధానమే ఈ సారాంశం.

  • Written By:
  • Publish Date - August 30, 2023 / 09:15 AM IST

జగన్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన నాయకుడు. ఆర్థికంగా అట్టడుగున ఉన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి అద్భుతమైన సంక్షేమ పాలన అందిస్తూ  ముందుకు దూసుకుపోతున్నారు. అయితే ఇందులో చాలా మందికి లబ్ధి చేకూరలేదనే వాదనలు కూడా వినిపిస్తుంన్నాయి. నాణానికి రెండువైపులా ఉన్నట్లు రాజకీయ నాయకులకు ప్రసంశలు, విమర్శలు రెండూ ఉంటాయి. అయితే వీటన్నింటినీ పక్కన పెట్టి అద్భుతమైన రాజకీయానికి తెరలేపబోతున్నట్లు సమాచారం. అందేంటో ఇప్పుడు చూద్దాం.

గతంలో 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రతి రోజూ ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని తన డైరీలో రాసుకున్నారు జగన్. అయితే రానున్న 2024 ఎన్నికల్లో కూడా ఇలాంటి మహాస్త్రాన్ని ప్రత్యర్ధులపై సంధించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. దీనికి సెప్టెంబర్లో తన విదేశీ పర్యటన ముగించిన వెంటనే ఆచరణలోకి వచ్చేలా కార్యాచరణ రచిస్తున్నట్లు సమాచారం. ఆయన చేపట్టిన ప్రతి సభలోనూ ఒకే మాట చెప్తూ వచ్చారు. నాకు దేవుడి ఆశీస్సులు, ప్రజలందరి దీవెనలు ఉంటే చాలు అనే మాట తరచూ వినిపించేది. ఇప్పడు కూడా దీనిని నిజం చేస్తూ మరో సారి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఇలా ప్రజల్లో మమేకం అయ్యే క్రమంలో కొన్ని కీలకమైన అంశాలపై చర్చ జరిగిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

పవన్, బాబు, లోకేష్ లక్ష్యంగా జగన్ పర్యటన..

గతంలో ప్రతిపక్షనేతగా ప్రజల్లో ఉండి వారి కష్టాలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేశారు. అయితే ఈ సారి పాదయాత్ర కాకుండా రచ్చబండ లాంటి కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసేందుకు సిద్దమౌతున్నారట. గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏవిధంగా అయితే ప్రజా సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరాయో లేదో తెలుసుకునేందుకు సిద్దమైన విషయం మనకు తెలిసిందే. అదే బాటలో జగన్ కూడా తన సంక్షేమాన్ని ఏ స్థాయిలో ప్రజలకు చేరవేశామో తెలుసుకునేందుకు అడుగులు వేస్తున్నారు. ఈ ఐదేళ్ల పాలనలో ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకునేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించనున్నాట్లు సమాచారం. గతంలో ఉన్న ముఖ్యమంత్రలు చేసిన పాలనకు తన ఐదేళ్ల పాలనకు ఏమైనా తేడా ఉందా.. జగనన్న వల్ల మంచి జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి అనే బ్రహ్మాస్త్రాన్ని వాడనున్నట్లు తెలుస్తోంది. దీంతో కార్యకర్తల్లో, అభిమానుల్లో సరికొత్త జోష్ నింపుతూ ముందుకు సాగేలా కార్యాచరణ రచిస్తున్నారు.

సంక్షేమంలో సరికొత్త మార్పులు..

జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి అధికారం చేపట్టిన ఈ ఐదేళ్ల కాలంలో నవరత్నాల పేరుతో ముందుకు వెళ్లారు. వాటి అమలులో ఎక్కడా జాప్యం, అవినీతికి తావులేకుండా చేశారు. అయితే రానున్న ఎన్నికలే లక్ష్యంగా ఆర్థికంగా ఎలాంటి అదనపు భారం పడకుండా సంక్షేమంపై దృష్టి సారించారట. ఇప్పడు చేసిన దానికంటే మెరుగ్గా చేసేందుకు చిన్న మార్పులు చేర్పులను చేయాలని సూచించించారంనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పెద్దగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ను నియమించినట్లు సమాచారం. ఈ మొత్తం తతంగమంతా తాడేపల్లి జగన్ క్యాంపు కార్యాలయం నుంచే జరుగుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అలాగే ఇప్పటి వరకూ తన పాలనలో రెండున్నర నుంచి మూడు కోట్ల వరకూ సామాన్యలు ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా లబ్థి పొందిన వారి జాబితా కూడా జగన్ దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. దీనినే వ్యూహంగా మలుచుకొని ప్రత్యర్థులకు చమటలు పట్టించేలా పర్యటన ఉంటుందని భావిస్తున్నారు.

వైఎస్ఆర్ వర్థంతి సాక్షిగా..

గతంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా తన తండ్రి సమాధి వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకొని ప్రజా ప్రస్థానం ను ప్రారంభించారు. ఇప్పుడు కూడా ఇడుపులపాయ వేదికగా తన రాజకీయ ప్రజాయాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రతి నియోజక వర్గంలో రెండు రోజులు బస చేసేలా కూడా ఏర్పాట్లు ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తుంది. ఇలా ప్రజల్లో మమేకం అవుతూనే నియోజకవర్గాల వారిగా ఉన్న అసంతృప్త నాయకులను కూడా మంచి చేసుకొని ముందుకు సాగాలని వారికి బలమైన హామీ ఇచ్చి తన విజయానికి సహకరించేలా రాజకీయ వ్యూహ రచన చేస్తున్నారని చెబుతున్నారు రాజకీయ పండితులు.

అయితే సెప్టెంబర్ నుంచి నియోజకవర్గాల వారీగా జగన్ చేపట్టే యాత్రతో ఏపీ రాజకీయాలు కూడా మరింత వేడిగా మరనున్నాయి. ఇటు తెలంగాణ, అటు ఏపీలో ఎన్నికల వేడి నోటిఫికేషన్ కంటే ముందుగానే రానుందని అర్థమౌతోంది. ఈ ప్రజలతో మమేకం అయ్యే జగన్ యాత్ర  ఫలిస్తుందా లేదా అంటే మరి కొన్ని నెలలు వేచి చూడక తప్పదు.

T.V.SRIKAR