Sharmila: కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనం ఖాయమా.. ఈ ఒక్క ట్వీట్ చెప్తోంది అదేనా ?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. పార్టీ నేతలు, శ్రేణులు.. రాహుల్‌కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ హోరెత్తిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - June 19, 2023 / 01:56 PM IST

రాహుల్‌గాంధీకి వైటీపీ అధ్యక్షురాలు షర్మిల బర్త్ డే విషెస్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు రాహుల్‌కు విషెస్ చెప్తూ షర్మిల ట్వీట్ చేయగా.. ఇది వైరల్‌గా మారింది. కాంగ్రెస్‌లో వైటీపీని విలీనం చేస్తారనే ప్రచారం కొద్దిరోజులుగా జరుగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా పూర్తి అయ్యాయని.. త్వరలోనే అధికారిక ప్రకటన ఉండొచ్చని అంటున్నారు. ఈ ఊహాగానాల నడుమ రాహుల్‌కు షర్మిల విషెస్ చెప్పడం హాట్‌టాపిక్‌గా మారింది.

షర్మిల ట్వీట్‌తో.. కాంగ్రెస్‌లో వైటీపీ విలీనం ఖాయం అయిందని.. అందుకు ఇది బలం చేకూరుస్తుందని.. అప్పుడే అంచనాలు మొదలుపెట్టేశారు కొంతమంది. కాంగ్రెస్‌లో వైటీపీ విలీనానికి సంబంధించి ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయనే ప్రచారం జరుగుతోంది. దీనికోసం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పాటు మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు మధ్యవర్తిత్వం వహించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్. తెలంగాణ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి షర్మిల పోటీ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం ఓకే చెప్పిందని, ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీ ఎన్నికల్లో కూడా షర్మిలను కాంగ్రెస్ ఉపయోగించుకుంటుందనే ప్రచారం నడుస్తోంది.

రేపో, మాపో కేవీపీ రామచంద్రరావు, డీకే శివకుమార్‌లతో షర్మిల భేటీ కానుందని, ఈ భేటీ తర్వాత విలీనంపై మరింత స్పష్టత వచ్చే అవకాశముందని ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. రాహుల్‌కు షర్మిల బర్త్ విషెస్ చెప్పడం.. వ్యవహారాన్ని మరింత వేడెక్కించింది. మరి ఇది ప్రచారంగానే మిగిలిపోతుందా.. నిజంగా నిజం అవుతుందా అంటే.. ఇంకొద్దిరోజులు ఎదురుచూడాల్సిందే.