Indian Cricket : ఇషాన్ దేశవాళీ క్రికెట్ ఆడు.. యువక్రికెటర్ కు పలువురి సలహా

భారత క్రికెట్ లో యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ తక్కువ కాలంలోనే మంచి ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. దూకుడుగా ఆడుతూ ఆకట్టుకున్నాడు.

భారత క్రికెట్ లో యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ తక్కువ కాలంలోనే మంచి ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. దూకుడుగా ఆడుతూ ఆకట్టుకున్నాడు. అయితే ఏ క్రికెటర్ కైనా ఆటతో పాటు క్రమశిక్షణ కూడా ఉంటేనే అత్యుత్తమ స్థాయికి చేరుకుంటారు. ప్రస్తుతం ఇషాన్ కిషన్ లో అది లోపించింది. ఫిట్ నెస్ తో ఉన్నా దేశవాళీ క్రికెట్ ఆడకుండా డుమ్మా కొట్టడంతో బోర్డు ఆగ్రహానికి గురయ్యాడు. తర్వాత సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. ఇషాన్ కిషన్ భారత్ తరపున ఆడి 9 నెలలు అవుతోంది. చివరిసారిగా గత ఏడాది నవంబర్ లో ఆసీస్ పై టీ ట్వంటీ ఆడిన ఇషాన్ కిషన్ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు.

బీసీసీఐ దేశవాళీ క్రికెట్ ఆడమని చెప్పినా పట్టించుకోకుండా రెస్ట్ తీసుకున్నాడు. దీంతో టీ ట్వంటీ వరల్డ్ కప్ కు అతన్ని ఎంపిక చేయలేదు. తాజాగా జింబాబ్వే, శ్రీలంకతో సిరీస్ లకు కూడా పక్కనపెట్టారు. ఈ నేపథ్యంలో జాతీయ జట్టులోకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలంటే ఇషాన్ కిషన్ ఖచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని అర్థమవుతోంది. కొత్త కోచ్ గంభీర్ ఈ విషయంలో ఏమాత్రం రాజీ పడే వ్యక్తి కాదు. ఇప్పటికే బీసీసీఐ సీనియర్ ప్లేయర్స్ అందరినీ దులీప్ ట్రోఫీ ఆడాలని ఆదేశించింది. ఇషాన్ కిషన్ కూడా రెగ్యులర్ దేశవాళీ మ్యాచ్ లు ఆడి ఫామ్ నిరూపించుకుంటేనే మళ్ళీ టీమిండియాలో చోటు దక్కుతుంది.