ఇషాన్ లేకపోవడం లోటే, హార్థిక్ ఎమోషనల్ కామెంట్స్

ఐపీఎల్ మెగావేలంలో చాలా మంది క్రికెటర్లు కొత్త ఫ్రాంచైజీలకు వెళ్ళిపోయారు... ఎన్నో ఏళ్ళుగా ఆడిన టీమ్స్ ను వీడి కొత్తగా బిడ్ వేసిన ఫ్రాంచైజీలకు ఆడబోతున్నారు. ఈ నేపథ్యంలో పాత ఫ్రాంచైజీలకు కొందరు ఎమోషనల్ వీడియోలతో గుడ్ బై చెబుతుంటే...

  • Written By:
  • Publish Date - December 3, 2024 / 12:49 PM IST

ఐపీఎల్ మెగావేలంలో చాలా మంది క్రికెటర్లు కొత్త ఫ్రాంచైజీలకు వెళ్ళిపోయారు… ఎన్నో ఏళ్ళుగా ఆడిన టీమ్స్ ను వీడి కొత్తగా బిడ్ వేసిన ఫ్రాంచైజీలకు ఆడబోతున్నారు. ఈ నేపథ్యంలో పాత ఫ్రాంచైజీలకు కొందరు ఎమోషనల్ వీడియోలతో గుడ్ బై చెబుతుంటే… కొన్ని టీమ్స్ ఆయా ప్లేయర్స్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నాయి. తాజాగా ముంబై ఇండియన్స్ తమ కీలక ప్లేయర్ ఇషాన్ కిషన్ ను వేలంలో మిస్ అవ్వడంతో స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ముంబై కెప్టెన్ హార్థిక్ పాండ్యా ఇషాన్ కిషన్ ను ఉద్దేశించి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. ఐపీఎల్ మెగా వేలంలో ఇషాన్ కిషన్‌ను తిరిగి సొంతం చేసుకోవడం కష్టమని ముందే అనుకున్నట్టు హార్దిక్ పాండ్యా చెప్పాడు.

కిషాన్ డ్రెస్సింగ్ రూమ్ ను ఎప్పుడూ సందడిగా ఉంచుతాడని గుర్తు చేసుకున్నాడు. జట్టులో అందరితో త్వరగా కలిసిపోతాడనీ, ఖచ్చితంగా తామంతా అతన్ని మిస్ అవుతున్నామంటూ వ్యాఖ్యానించాడు. ముంబై ఇండియన్స్ ఫ్యామిలీ అంతా ఇషాన్ ను ఎంతగానో ప్రేమిస్తోందంటూ చెప్పుకొచ్చాడు. మెగావేలానికి ముందు ముంబై బూమ్రా, పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ , రోహిత్ శర్మ, తిలక్ వర్మలను రిటైన్ చేసుకుంది. వేలంలో ఇషాన్ కిషన్ ను దక్కించుకునేందుకు తగినంత బడ్జెట్ లేకపోవడంతో వదులుకోక తప్పలేదు. కాగా ఇషాన్ కిషన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ 11.25 కోట్లకు దక్కించుకుంది. ఈ యువ వికెట్ కీపర్ బ్యాటర్ కోసం వేలంలో ఫ్రాంచైజీ‎లు గట్టిగానే పోటీ పడ్డాయి. ముందుగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్ర పోటీ నడవగా.. చివర్లో ఎంట్రీ ఇచ్చిన సన్ రైజర్స్ అనుహ్యంగా ఇషాన్ కిషన్‎ను కొనుగోలు చేసింది.

కాగా ముంబై ఛాంపియన్ గా నిలిచిన పలు విజయాల్లో ఇషాన్ కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్ గా ఎన్నోసార్లు అద్భుతమైన ఆరంభాలనిచ్చాడు. ఓవరాల్ గా ఇషాన్ కిషన్ ఐపీఎల్ కెరీర్ లో 106 మ్యాచ్ లు ఆడి 2644 పరుగులు చేయగా.. దీనిలో 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2014 నుంచి 2024 వరకూ ఇషాన్ ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే వేలంలో 3 కోట్లు బిడ్డింగ్ దాటగానే తప్పుకున్న ముంబై ఇప్పుడు అనవసరం బాధపడుతోందంటూ పలువురు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.