మెల్ బోర్న్ టెస్టులో ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది టీమిండియా… టాపార్డర్ ను లేపేశాం ఇక ఫాలో ఆన్ ఆడించేద్దాం అనుకున్న కంగారూల ఆశలపై తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి నీళ్ళు చల్లాడు. అద్భుతమైన బ్యాటింగ్ తో సెంచరీ చేయడమే కాదు జట్టును ఫాలో ఆన్ ముప్పు నుంచి తప్పించాడు. ఈ సిరీస్ తోనే టెస్ట్ కెరీర్ ప్రారంభించిన నితీశ్ తొలి సెంచరీతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా మెల్ బోర్న్ లో తన కొడుకు సెంచరీని ప్రత్యక్షంగా చూసిన నితీశ్ తండ్రి ముత్యాలరెడ్డి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. సెంచరీ పూర్తి చేసుకున్నప్పుడు ఆయన ఎమోషనల్ అయ్యారు. లక్ష మంది ప్రత్యక్షంగా, కోట్లాది మంది టీవీ సెట్ల ముందు అభినందిస్తున్న వేళ కొడుకును చూసి కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఒక్కసారిగా తన కష్టాలను గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ సీన్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి హైలైట్‌గా నిలిచింది.
అందరి క్రికెటర్లలానే నితీష్ కుమార్ రెడ్డి సక్సెస్ వెనుక పుట్టెడు దు:ఖం ఉంది. ముఖ్యంగా అతని తండ్రి గొప్ప త్యాగం ఉంది. కొడుకు కెరీర్ కోసం ముత్యాల రెడ్డి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగమే వదిలేసారు. నితీశ్ కుమార్ రెడ్డిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అతని తండ్రి ముత్యాల రెడ్డి హిందూస్తాన్ జింక్‌లో ఉద్యోగం చేసేవారు. హిందూస్తాన్ జింక్ కంపెనీ గ్రౌండ్‌లో క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ పెరిగిన అతను ప్లాస్టిక్ బాల్‌తో తన ఆటను ప్రారంభించాడు. ఆ తర్వాత తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. అయితే ముత్యాల రెడ్డిని ఉదయ్‌పూర్ ట్రాన్స్‌ఫర్ చేయడంతో అతను కొడుకు కెరీర్ కోసం ఉద్యోగానికి రాజీనామ చేశారు. 25 ఏళ్ల సర్వీస్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని కొడుకుపై నమ్మకంతో వదిలేసారు.
మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సాయంతో కడప ఏసీఏ అకాడమీలో చేరి మరింత రాటు దేలాడు. కెరీర్ ఆరంభంలో ఓపెనింగ్ చేసిన నితీష్ కుమార్ రెడ్డి మీడియం పేసర్‌గానూ సత్తా చాటాడు. ఇండియ అండర్ 19 బీ టీమ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 2019-20 రంజీ సీజన్‌తో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి.. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీతో 366 పరుగులు చేశాడు. అయితే అతని కెరీర్ ను మలుపు తప్పింది ఐపీఎల్లే… దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న నితీష్ కుమార్ రెడ్డిని సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. ఆరంభంలో పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. ఐపీఎల్ 2023 సీజన్‌లో క్యాష్ రిచ్ లీగ్‌లోకి అరంగేట్రం చేసిన నితీష్.. రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో మరోసారి అతనిపై నమ్మకం ఉంచిన ఆరెంజ్ ఆర్మీ.. ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో సత్తా చాటడంతో తుది జట్టులోకి తీసుకుంది. తర్వాత జాతీయ టీ ట్వంటీ జట్టులోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే అటు టెస్ట్ టీమ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. కోచ్ గంభీర్ అతనిపై నమ్మకంతో అవకాశాలు ఇవ్వడం దానిని అందిపుచ్చుకుని ఇప్పుడు సెంచరీ కొట్టాడు. అందుకే ఈ కష్టాలన్నీ ఒక్కసారి కళ్ళ ముందు కదలాడడంతో నితీశ్ తండ్రి ఎమోషనల్ అయ్యారు.