Team George: టీమ్ జార్జ్…పెగాసస్ అమ్మ మొగుడు!

టీమ్ జార్జ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యంగా భారత్ లో ఎన్నికలను టీమ్ జార్జ్ తీవ్రంగా ప్రభావితం చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అబద్ధాలను విస్తృతంగా వ్యాపింపజేయడమే లక్ష్యంగా ఇది పనిచేస్తుంది.

  • Written By:
  • Updated On - February 17, 2023 / 07:43 PM IST

ప్రపంచ ఎన్నికల ప్రక్రియనే మార్చేసే టీమ్ జార్జ్ (Teal George) వ్యవహారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీన్ని మన దేశంలోనూ వినియోగించినట్లు ఆరోపణలున్నాయి. ఇంతకీ మన దేశంలో దీన్ని వాడిందెవరు…?

పెగాసస్ (Pegasus) అప్పట్లో భారత రాజకీయాల్లో ఓ పెను సంచలనం సృష్టించింది. పెగాసస్ తో నిఘా పెట్టారనే ఆరోపణలు పార్లమెంటును కుదిపేశాయి. ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో దానికి మించి మరో కలకలం రేగింది. అదే టిమ్ జార్జ్… పెగాసస్ అమ్మ మొగుడు ఇది. పెగాసస్ ను కేవలం నిఘా కోసమే ఉపయోగించారనే ఆరోపణలున్నాయి. అది ఫోన్లు, కంప్యూటర్లను హ్యాక్ చేసే ఓ సాఫ్ట్ వేర్ మాత్రమే. కానీ ఇది మాత్రం అంతకు మించి….ఏకంగా జనం మూడ్ ను మార్చేసి ఎన్నికల ఫలితాలనే మార్చేసేంత మహాముదురు ఇది. దీంతో చేయలేనిదంటూ ఏమీ లేదు…. రాజకీయ ప్రత్యర్థుల మధ్యే కాదు మొగుడు పెళ్లాల మధ్య కూడా మంటలు పుట్టించగల మహమ్మారి ఇది..

ఈ టిమ్ జార్జ్ గురించి తాజాగా బయటకొచ్చిన ఓ స్టింగ్ ఆపరేషన్ ప్రపంచదేశాలను కుదిపేస్తోంది. కొంతమంది జర్నలిస్టులు చేసిన ఈ ఆపరేషన్… ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేస్తున్న ఓ పెద్ద డర్టీ పిక్చర్ ను బయటపెట్టింది. ఈ సంస్థ ఇప్పటివరకు 30కి పైగా దేశాల్లో క్లయింట్స్ కు సేవలు అందించింది. అందులో 27 దేశాల్లో ఇది విజయం సాధించింది. అంటే ప్రత్యర్థులపై బురదజల్లి తమ ఖాతాదారులకు విజయాన్ని కట్టబెట్టింది. అందులో భారత్ కూడా ఉందన్నది ఓ ఆరోపణ.

ఎన్నికలను హైజాక్ చేయడమే ఈ సాఫ్ట్ వేర్ ముఖ్య ఉద్దేశం. సోషల్ మీడియాను దుర్వినియోగం చేయడం, మనకు కావాల్సినట్లుగా వార్తలను మార్చేయడం, ప్రత్యర్థుల ప్రచారాన్ని దెబ్బతీయడం, ఫేక్ న్యూస్ (Fake News) సృష్టించడం ఇలా ఒకటేమిటి ఏమేం చేయకూడదో అన్నీ చేస్తుంది. నిజాన్ని అబద్దంలా… అబద్దాన్ని నిజంలా నమ్మించేలా వార్తలను సృష్టిస్తుంది.

ఈ సాఫ్ట్ వేర్ (Software) కొనుగోలు చేసిన ఖాతాదారుడికి అనుకూలంగా టీమ్ జార్జ్ రంగంలోకి దిగుతుంది. వారికి అనుకూలంగా సోషల్ మీడియాలో (Social Media)  భారీ సంఖ్యలో ఖాతాలు తెరుస్తుంది. పోస్టులు సృష్టిస్తుంది. ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళుతుంది. మర్డరర్ అయినా తన క్లయింట్ ను మహానుభావుడిగా ప్రొజెక్ట్ చేస్తుంది. వారి అనుకూల భావజాలం ప్రజల్లోకి ఎక్కువగా వెళ్లేలా చేస్తుంది. ప్రజల్లో ఇదే నిజమనే అభిప్రాయాన్ని కలిగిస్తుంది. వారి రాజకీయ ప్రత్యర్థులను గుర్తిస్తుంది. వారికి వ్యతిరేకంగా పోస్టులు సృష్టిస్తుంది. వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతుంది. పదే పదే వాటిని చూపించి ప్రజల్లో వ్యతిరేకత పెంచుతుంది. ఇదంతా ఓ పద్దతి ప్రకారం జరుగుతుంది. ఇదేదో ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారంలా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఫలితంగా ప్రజల తీర్పు మారిపోతుంది.

ఇజ్రాయెల్ (Isreal) అంటేనే టెక్నాలజీకి కేరాఫ్. అలాంటి దేశానికి చెందిన ఓ మాజీ సైనికుడు తాల్ హనన్ (Tal Hassan) నడుపుతున్న ప్రైవేట్ సంస్థే టిమ్ జార్జ్… వారు తయారు చేసిందే AIMS అనే సాఫ్ట్ వేర్… పేరుకే ఇది సాఫ్ట్ వేర్.. కానీ చేసే పనులన్నీ హార్డ్ కోర్… తన క్లయింట్స్ కు అనుకూలంగా సోషల్ మీడియాను మార్చేస్తుంది. ఈ సాఫ్ట్ వేర్ ఖరీదు మన లెక్కల్లో చెప్పాలంటే కనీసం 53కోట్ల రూపాయలు…. ఆపైన ఎంత పెడితే ఆ ఖాతాదారులకు అన్ని సేవలు.. గరిష్టంగా 2-3 వందల కోట్ల రూపాయల వరకూ చెల్లించాల్సి ఉంటుంది.

ఈ సాఫ్ట్ వేర్ ను భారత్ లోనూ వినియోగించారన్న వార్త ఇప్పుడు కలకలం రేగుతోంది. ఎవరు వినియోగించారన్నది మాత్రం తెలియదు. అయితే ఇది అధికార బీజేపీ పనేనని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇలాంటి పనులు ఆ పార్టీకి అలవాటేనంటోంది. 30 ప్రముఖ సంస్థలకు చెందిన జర్నలిస్టులు టీమ్ జార్జ్ యజమాని తాల్ హనన్ను కలిశారు. ఆయన తానెలా ఆపరేట్ చేసేది చూపించాడు. వారి ఎదురుగానే టెలిగ్రామ్ (Telegram) అకౌంట్లను హ్యాక్ చేసి మొత్తం మార్చేశాడు. ఆరు గంటల పాటు ఈ రహస్య సమావేశం జరిగింది. అందులో తాము సమాచారం ఎలా సేకరిస్తాం, రాజకీయ ప్రత్యర్థుల మెయిల్స్, టెలిగ్రామ్ అకౌంట్లను ఎలా హ్యాక్ చేస్తామో ఆ బృందం జర్నలిస్టులకు వివరించింది. బ్లాగర్ మెషిన్ విషయం కూడా బయటకొచ్చింది. టెక్నాలజీ సాయంతో ఏమైనా చేయవచ్చు… కానీ ఈ స్థాయిలో మోసం చేయొచ్చన్న విషయం ఇప్పుడు కలకలం రేపుతోంది.

(KK)