ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. అందులో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. మానవసహిత గగన్ యాన్ ప్రాజెక్టులో క్రియాశీలకపాత్ర పోషించేందుకు మహిళా ఫైటర్ టెస్ట్ పైలట్లు కావాలని తెలిపారు. ప్రస్తుతం ఇలాంటి వారు అందుబాటులో లేరని అందుకే మానవరహిత గగన్ యాన్ రాకెట్లో మహిళా హ్యూమనాయిడ్ రోబోను పంపిస్తున్నట్లు వెల్లడించారు. దీనిని వచ్చే ఏడాది ఆచరణలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ గగన్ యాన్ ప్రాజెక్టు ముఖ్య ఉద్ధేశ్యం రాకెట్లను నేల నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి పంపిస్తారు. అక్కడే మూడు రోజులపాటూ ఉంచి తిరిగి భూమిపైకి తీసుకొచ్చేలా చేస్తారు. ఈ వ్యోమగాముల్లో రానున్న రోజుల్లో మహిళలను తప్పకుండా పంపిస్తామని అందుకు తగిన ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్లు చెప్పారు.
ఇలా నింగిలోకి పంపించి తమకు అవసరమైన విషయాలను అందించేలా మహిళలకు ట్రైనింగ్ ఇచ్చేందుకు కార్యాచరణ రచిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వైమానిక దళానికి చెందిన ఫైటర్ పైలట్లను గగనతలంలోకి పంపించేందుకు శిక్షణ ఇస్తున్నాం. ఈ శిక్షణలో అద్భుతంగా రాణించిన వారిని ఎంపిక చేస్తున్నాం. అలాగే ప్రస్తుతం అంతరిక్షంలో అవసరమైన శాస్త్రీయ పరిశోధనలు జరుపుతున్నట్లు వివరించారు. ఈ ప్రయోగం పూర్తి అయితే శాస్త్రవేత్తలే వ్యోమగాములుగా మారే అవకాశం ఉంటుందన్నారు. ఈ క్రమంలో మహిళలకు మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. ఇక 2035 నాటికి పూర్తి స్థాయిలో పరిశోధనలు నిర్వహించే ఇండియన్ స్పేస్ సెంటర్ ను అంతరిక్షంలోనే నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల అంతరిక్ష పరిశోధనలు చేయడం మరింత త్వరగా, సులభతరంగా మారుతుందని వివరించారు.
T.V.SRIKAR