జులై 14న చంద్రయాన్-3ని ప్రయోగించినప్పటి నుంచీ ఇప్పటి వరకూ దాదాపు రెండున్నర లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసింది చంద్రయాన్-3. మూడు వారాల్లో ఐదు సార్లు కక్ష్యను పెంచుతూ భూమికి దూరంగా స్పేస్ షిప్‌ను తీసుకెళ్లారు. ఆగస్టు 1న కీలక విన్యాసమైన స్లింగ్‌షాట్‌ను నిర్వహించారు. చంద్రయాన్ కక్ష్యను పెంచి ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత స్పేస్‌షిప్ భూకక్ష్యను వీడి, చందమామను చేరుకునే మార్గమైన లూనార్ ట్రాన్స్‌ఫర్ ట్రాజెక్టరీలోకి ప్రవేశించింది.
ఇక నేడు మరో కీలక విన్యాసానికి రెడీ అయ్యింది ఇస్రో. లూనార్ ట్రాన్స్‌ఫర్ ట్రాజెక్టరీలో ఉన్న స్పేస్‌షిప్‌ను లూనార్ ఆర్బిట్ ఇంజక్షన్‌లో ప్రవేశపెట్టబోతోంది. పెరిలూన్ అనే విన్యాసాన్ని ఇవాళ రాత్రి నిర్వహించబోతున్నారు. రాకెట్ ప్రయోగించిన తేదీ నుంచి చంద్రుడి కక్షను చేరుకునేందుకు చంద్రయాన్-3కి 33 రోజులు పడుతుంది. ఆ తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి.. ల్యాండర్, రోవర్‌తో కూడిన మాడ్యూల్ విడిపోతుంది. అది గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో జాబిల్లి ఉపరితలం దిశగా దూసుకువెళ్తుంది.
నాలుగు ఇంజిన్ల సాయంతో వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటూ ఆగస్టు 23 లేదా 24న ల్యాండర్.. చంద్రుడి దక్షిణ దృవానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద దిగనుంది. చంద్రునిపై సురక్షితంగా, సాఫ్ట్ ల్యాండ్ అయిన తర్వాత.. ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి పరిశోధనలు చేయనుంది. చంద్రయాన్-3లో ఆర్బిటర్‌ను పంపలేదు. చంద్రయాన్-2లో ప్రయోగించిన ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ కక్ష్యలో ఇంకా తిరుగుతోంది. దాన్నే ఇప్పుడు వినియోగించ బోతోంది ఇస్రో.