Pilli Subhash Chandra Bose: పిల్లి వారి అలక..!

వైసీపీలో మరో సీనియర్‌ నేత అలకపాన్పు ఎక్కారు. జగన్‌పై కారాలు మిరియాలు మిక్సీలో వేసి మరీ నూరుతున్నారు. పీకలదాకా అసంతృప్తితో ఉన్న ఆ నేత రేపో మాపో బరస్ట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకీ ఎవరా సీనియర్ అంటే బోసు బాబు.. ఇంతకీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు ఎందుకంత కోపం వచ్చింది.?

  • Written By:
  • Publish Date - July 10, 2023 / 03:36 PM IST

నిన్న మొన్నటి దాకా బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్.. ఒక్కొక్కరుగా సీనియర్లు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. పార్టీ హైకమాండ్ ముఖ్యంగా సీఎం జగన్ తీరుపై పిల్లి సుభాష్ చంద్రబోస్ రగిలిపోతున్నారు. తన నియోజకవర్గంలో తనకు చెక్‌ పెట్టేలా వ్యతిరేక వర్గం చేస్తున్న ప్రయత్నాలను ఆయన కాస్త సీరియస్‌గానే తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్‌గా ఉన్న బోస్ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కాకినాడ, అమలాపురంలో జరిగిన పార్టీ సమావేశాలకు ఆయన డుమ్మా కొట్టారు. కాకినాడలోనే ఉన్నా, వేరే కార్యక్రమాలు లేకపోయినా పార్టీ మీటింగ్‌వైపు కన్నెత్తి కూడా చూడలేదు. స్వయంగా మిథున్ రెడ్డి ఫోన్ చేసినా తర్వాత వచ్చి కలుస్తానని చెప్పి తప్పించుకున్నారు. మిథున్‌రెడ్డి తీరుపై కూడా ఆయన గుర్రుగా ఉన్నారు. అయితే నేతలు బుజ్జగించడంతో అన్యమనస్కంగానే రాజమండ్రి సమావేశానికి వచ్చారు. అబ్బే నేను అలగలేదు అని చెప్పుకొచ్చినా నేతలతో అంటీముట్టనట్లుగానే ఉన్నారు.

కారణాలు ఏమైనా మొదట్నుంచి జగన్ వెంట నడిచి, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచారు వాసు-బోసు ( బాలినేని శ్రీనివాస్- పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌). ఈ ఇద్దరికీ ఇప్పుడు అన్యాయం జరిగిందన్నది పార్టీ నేతల అభిప్రాయం. రామచంద్రాపురం పిల్లి సుభాష్ చంద్రబోస్ నియోజకవర్గం. 2004, 2009లో ఆయన ఇక్కడ్నుంచే గెలిచారు. 2004లో అయితే ఇండిపెండెంట్‌గా గెలిచారు. అయితే 2014లో టీడీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు చేతిలో ఓడిపోయారు. 2019లో ఇక్కడ్నుంచి వైసీపీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను బరిలోకి దింపింది. తోటపై గెలిచిన ఆయన మంత్రి అయిపోయారు. అప్పట్నుంచి పిల్లి కాస్త అసంతృప్తితోనే ఉన్నారు. తన నియోజకవర్గం చేజారిపోతోందన్న టెన్షన్‌ ఆయన్ను వెంటాడుతోంది. దీనికి తోడు వేణు అక్కడ పాతుకుపోవడానికి చేస్తున్న ప్రయత్నాలు పిల్లిని మరింత ఇరకాటంలో పెట్టాయి. తన అనుచరులకు న్యాయం చేయలేక తలపట్టుకుంటున్నారు. తాను చెప్పిన పనులు జరగకపోవడం, తన వారిని మంత్రి వేణు టార్గెట్ చేయడంతో ఆయన కోపం పీక్‌కు చేరింది. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా పార్టీ పెద్దలు దాన్ని లైట్ తీసుకోవడాన్ని ఆయన లైట్ తీసుకోలేకపోయారు. వలస నేతలను తమపై రుద్దుతున్నారంటూ పరోక్షంగా వేణును ఉద్దేశించి ఘాటుగా స్పందిస్తున్నారు పిల్లి.

వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి తన కుమారుడు సూర్యప్రకాష్‌ను రంగంలోకి దించాలన్నది పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆలోచన. అయితే అందుకు వేణు అడ్డంకిగా మారారు. వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి వేణునే పోటీ చేస్తారని ఇటీవల మిథున్‌రెడ్డి ప్రకటించడం పిల్లి వర్గానికి మింగుడు పడటం లేదు. సీనియర్ అయిన తనతో మాట్లాడకుండా తన నియోజకవర్గం గురించి మిధున్ అలా ఎలా ప్రకటిస్తారని పిల్లి ప్రశ్నిస్తున్నారు. దీనిపై హైకమాండ్‌తో తేల్చుకోవడానికి ఆయన సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు సూర్యప్రకాష్‌ను పోటీలోకి దించి తీరుతానని ఆయన స్పష్టంగా చెప్పేస్తున్నారు. అవసరమైతే ఎంపీ పదవిని వదిలేస్తానంటున్నారు. 2004లో తాను రామచంద్రాపురం నుంచే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అవసరమైతే తన కుమారుడ్ని కూడా అలాగే గెలిపించుకుంటానని ఆయన చెబుతున్నారు.

బాలినేని అలక ఇంకా తీరలేదు. జగన్ బుజ్జగించినా ఆయన కోపం తీరలేదు. ఆదిమూలపు సురేష్‌కు ప్రాధాన్యం ఇచ్చి తనను పక్కన పెట్టారని ఆయన మండిపడుతున్నారు. ఇప్పుడు పిల్లి వంతు వచ్చింది. ఆయనే కాదు మరికొందరు సీనియర్లు కూడా తమకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని తమ వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారని గుర్రుగా ఉన్నారు. త్వరలో వారు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి పిల్లిని, మిగిలిన సీనియర్లను జగన్ ఎలా బుజ్జగిస్తారో చూడాల్సి ఉంది.