IT RAIDS: తెలంగాణలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. కొద్ది రోజులుగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావుతోపాటు పలువురు రాజకీయ నేతలు, వారి సన్నిహితుల ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరులపై దాడులు జరిగాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి దగ్గరి బంధువు అయిన ప్రదీప్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. గచ్చిబౌలిలోని మైహోం బూజాలో ఉంటున్న ప్రదీప్ రెడ్డితో పాటు రెడ్డి ల్యాబ్స్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేశారు.
Earthquake: పాకిస్తాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదు..
నరేందర్ రెడ్డి ఇంట్లో రూ.7.50 కోట్లు.. ప్రదీప్ రెడ్డి ఇంట్లో రూ.5 కోట్లకు పైగా నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లకు పంచేందుకే ఈ డబ్బును సమకూర్చుకున్నట్లు తేలిందని అధికారులు పేర్కొన్నారు. నగదు దొరికిన నిందితుల్లో ప్రదీప్ రెడ్డి.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అతడికి వివాదాస్పద భూముల అమ్మకాలు జరిపే వ్యక్తిగా పేరుంది. అధికారులు, రాజకీయ నేతలతో సత్సంబంధాలు ఉండటం వల్ల కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహిస్తుంటాడు. ఇటీవలి దాడులు మహేశ్వరం నియోజకవర్గం నేతలే టార్గెట్‌గా జరిగినట్లు తెలుస్తోంది. మొదట కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్‌తోపాటు అతడి అనుచరుల ఇండ్లపై దాడులు జరిగాయి. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి అనుచరులపై దాడులు చేశారు.
ఇలా ఒకే నియోజకవర్గానికి చెందిన నేతలపై దాడులు జరగడం రాజకీయంగానూ సంచలనంగా మారింది. తమను కావాలనే లక్ష్యంగా చేసుకుని, ఐటీ శాఖ దాడులు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే, ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని అడ్డుకునేందుకే ఈ దాడులు జరుగుతున్నాయనే వాదన ఉంది.