ఎన్నికల ప్రచారం జరుగుతున్నంత సేపు తనను తాను అర్జునుడి తో పోల్చుకునే వాడు జగన్. పద్మవ్యూహంలో చిక్కుకొని మరణించడానికి తాను అభిమన్యుడిని కాదని… అర్జునుడునీ అని తనను తానే పొగుడుకునేవాడు జగన్. చివరికి పద్మవ్యూహంలో అభిమన్యుడు గానే మిగిలిపోయాడు.11 సీట్లతో రాజకీయంగా కతం అయిపోయాడు. అయితే ఇప్పుడు ప్రశ్న అంతా జగన్ అసెంబ్లీలో అడుగు పెడతాడా? అడుగుపెట్టి నిలబడగలడా? లేక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి అప్పటినుంచి అసెంబ్లీ కి గుడ్ బై చెప్తాడా?ఇలా రకరకాల ప్రశ్నలు జనాన్ని వేధిస్తున్నాయి.
ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి 11 సీట్లకే పరిమితం అయిపోయాడు వైసిపి అధినేత జగన్. 2019 నుంచి 24 వరకు అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలతో, టిడిపి నుంచి వలస వచ్చిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలతో కలసి మొత్తం 154 మంది ఎమ్మెల్యేలతో టిడిపిని అల్లాడించేవారు. ఆ దాడిని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు ఇది కౌరవ సభ అనే ఆక్షేపిస్తూ ఇది గౌరవ సభగా ఉన్నప్పుడే మళ్ళీ అడుగు పెడతానని శపధం చేశారు. ఓడలు బళ్ళు… బళ్ళు ఓడలు అయ్యాయి. ఇప్పుడు కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో వైసిపి అసెంబ్లీలో దీనాతి దీనంగా నిలబడాల్సిన పరిస్థితి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ప్రతిపక్ష నేతకు దక్కాల్సిన గౌరవం కూడా జగన్ కు దక్కదు. మరోవైపు స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు.
మామూలుగా ఉండదు. పోనీ 11 మందిలో సమర్థులైన వారు ఎవరైనా ఉన్నా రా అంటే అదీ లేదు. కేవలం జగన్, పెద్దిరెడ్డి మాత్రమే వైసీపీ నావన్ని నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. కసితో, కక్షతో రగిలి పోతున్న టిడిపి నేతలు జగన్ ఇలా ఒంటరిగా దొరికితే వదిలి పెడతారా? మాటలతో చీల్చి చెండాడుతారు? జగన్ కి చుక్కలు చూపిస్తారు. ఆనాడు సభలో తన మంత్రులు ఎమ్మెల్యేలు టిడిపి నేతలను ఆడుకుంటుంటే, ముఖ్యంగా చంద్రబాబును మాటలతో కుల్లబడుస్తుంటే.. జగన్ ఎంత విలాసవంతంగా కులాసాగా …దిలాసాగా.. నవ్వుతూ ఎంజాయ్ చేశాడో అదే పరిస్థితి ఇప్పుడు. చంద్రబాబు నాయుడుకు వచ్చింది. పైగా 164 మంది ఎమ్మెల్యేలు.
జగన్ అరాచకాలపై ఒక్కొక్కరు కసితో రగిలిపోతున్నారు. మాటలతోటాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో సభలో కూర్చుని తనను తాను హరాకిరి చేసుకోవడమా? లేక సభ నుంచి ఐదేళ్ల పాటు పూర్తిగా నిష్క్రమించడమా అనే ఆలోచనలో ఉన్నాడు జగన్. ఒకవేళ శాసనసభ కే వెళ్లకూడదు అనుకుంటే… ప్రోటీన్ స్పీకర్ లేదా స్పీకర్ ఛాంబర్ లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయి అసెంబ్లీకి ఐదేళ్లపాటు దూరంగా ఉండాలి. కానీ అలా చేస్తే సభ నుంచి పారిపోయాడని, పిరికివాడని ప్రతిరోజు ఆడుకుంటారు టిడిపి జనసేన బిజెపి ఎమ్మెల్యేలు. అలాగని సభలో ఉంటే 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి 164 మందిని ఎదుర్కోవడం ఆషామాషీ కాదు. ప్రతిక్షణం… ప్రతి నిమిషం అవమానం తప్పదు. పైగా ఇప్పుడు జగన్ అనుభవిస్తున్న ఓటమి అలాంటి ఇలాంటి ఓటమి కాదు. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఏ పార్టీ నాయకుడు చూడని అత్యంత నికృష్టమైన ఓటమి.
ఏం చేయాలో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు జగన్. అసెంబ్లీకి వెళితే ఒకతంట, వెళ్లకపోతే మరో తంటా. చాలామంది రాజకీయ విశ్లేషకులు మాత్రం జగన్ సభకు వెళ్లాలి, అధికార పక్షాన్ని ఎదుర్కోవాలి… అప్పుడే అతగాడి నాయకత్వం ఏంటో బయటపడుతుంది. సభ నుంచి మొదటి రోజే పారిపోతే జనానికి మరింత చులకన అయిపోతాడు అని చెప్తున్నారు.2014 19 మధ్య కూడా జగన్ చివరి రెండేళ్లు రాలేదు. పాదయాత్రకు వెళ్లిపోయాడు. మొదటి మూడేళ్లు అసెంబ్లీకి వచ్చి, చివరి రెండేళ్లు ఏదైనా పెద్ద కార్యక్రమం పెట్టుకునే అవకాశం ఉందని జగన్ సన్నిహితులు చెబుతున్నారు. ఏది జరిగినా అసెంబ్లీలో రచ్చ రగడ మాత్రం తప్పదు. జగన్ అన్నిటికి సిద్ధమై ఉండాలి.