Chandrababu: పిలుపు రాకుండా చంద్రబాబు జాగ్రత్తపడ్డారా.. NDA ఆహ్వానం రాకపోవడం వెనక వ్యూహం ఉందా?

ఎప్పుడు ఏం చేయాలో తెలియడం కాదు.. ఏం చేయకూడాదో తెలియకపోవడమే అసలైన నేర్పరితనం. ప్రయాణం ఎంత దూరం సాగింది అన్నది కాదు ముఖ్యం.. ఎక్కడ ఆపామన్నది చాలా ఇంపార్టెంట్! చంద్రబాబు ఇప్పుడు ఇదే ఫాలో అవుతున్నాడా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - July 17, 2023 / 07:00 PM IST

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే రాజకీయ ఎత్తుగడలు కనిపిస్తున్నాయ్. ఎన్డీఏ, యూపీఏ కూటములు.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయ్. కలిసుందాం అని వాళ్లు.. కలుపుకుందాం అని వీళ్లు.. ఎవరికి వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో జాతీయ రాజకీయ సమీకరణాలు.. ప్రతీ నిమిషానికి ఆసక్తికర మలుపులు తీసుకుంటున్నాయ్. ప్రతిపక్ష కూటమి బెంగళూరులో భేటీ అయితే.. ఎన్డీఏ మిత్రపక్షాలు ఢిల్లీలో మీటింగ్ పెట్టుకోబోతున్నాయ్. విపక్షాల సంగతి కాసేపు పక్కనపెడితే.. తెలుగు రాష్ట్రాల నుంచి జనసేనకు మాత్రమే ఎన్డీఏ నుంచి పిలుపు వచ్చింది. టీడీపీ విషయంలో రకరకాల చర్చ జరిగినా.. ఆహ్వానం అందలేదు. 2019 గుర్తులు ఇంకా కమలం పార్టీ నేతలను వెంటాడుతున్నాయ్ అనుకుంటా బహుశా ! అందుకే ఆహ్వానం అందలేదు అని అంతా అనుకుంటున్నారు. ఐతే సీన్ మాత్రం వేరే అన్నది మెజారిటీ వర్గాల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం.

రాజకీయాల్లో బయటకు కనిపించేదేదీ నిజం కాదు. ఎన్డీఏ ఆహ్వానం విషయంలో అదే నిజం అనిపిస్తోంది. పిలుపు రాకుండా చంద్రబాబు ముందే జాగ్రత్తలు తీసుకున్నారేమో అనే అనుమానాలు కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయ్. కమలం పార్టీ పెద్దలతో ముందే మాట్లాడారని.. తన వర్గం నేతలతో రాయబారం పంపించారని.. ప్రస్తుతానికి ఈ భేటీకి ఆహ్వానం అందించకపోవడమే బెటర్ అని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఇదే నిజం అనిపిస్తోంది కూడా ! టీడీపీ గెలిచిన తర్వాత కూడా.. బీజేపీకే సీట్లు ఇవ్వాలి.. ఇచ్చేందుకు చంద్రబాబు రెడీగా ఉన్నారు కూడా ! పవన్‌ కల్యాణ్ ఇప్పిస్తారు కూడా. ఈ మాత్రం దానికి ముందే ఎందుకు రచ్చ చేసుకోవడం అని చంద్రబాబు.. జాగ్రత్త పడినట్లు కనిపిస్తోంది.

బీజేపీ మీద ఏపీలో జనాలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తి కావొస్తున్నా.. విభజన హామీల్లో చాలావరకు పెండింగ్‌లోనే ఉన్నాయ్. ప్రధాని గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడం తప్ప.. రాష్ట్రానికి పెద్దగా చేసిందేమీ లేదని బీజేపీ మీద పీకల దాకా కోపంతో ఉన్నారు ఏపీ జనాలు. ఇలాంటి సమయంలో బీజేపీతో పొత్తులో ఉన్నాం.. ఉంటాం అని ఎన్నికల ముందే బయటపడితే.. మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కమలం పార్టీతో కలిసి.. ముప్పు తెచ్చుకోవడం కంటే దూరంగా ఉండడమే ఉత్తమం అని టీడీపీ ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే ఎన్డీఏ ఆహ్వానం విషయంలో కనీసం రియాక్ట్ కాలేదు ఎవరూ. ఇక అటు పొత్తు అనే మాట ఉన్నా లేకపోయినా.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే.. ఎలాగూ బీజేపీకి మద్దతుగా ఉంటారు. అది మాత్రం పక్కా. ఈ మాత్రం దానికి ఎందుకీ తాపత్రయాలు అని.. బిందాస్‌గా ఎవరి యాత్రలు వారు చేస్తున్నారేమో లోకేశ్‌, చంద్రబాబు అనిపిస్తోంది సీన్ చూస్తుంటే !