ఇలాంటి పరిణామాల మధ్య ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా అనిపిస్తోంది ఏపీ రాజకీయం. టీడీపీతో పొత్తుకు సిద్ధం అని దాదాపు ఇంకా షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధమైన పవన్.. ఇప్పుడు చంద్రబాబుకు కొత్త టెన్షన్ స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయ్. వారాహి యాత్ర మొదలుపెట్టిన జనసేనానికి.. గోదావరి జిల్లాల్లో మంచి స్పందన లభిస్తోంది. నిజానికి కాపు సామాజికవర్గ ఓటర్లతో పాటు.. మెగా అభిమానులు ఎక్కువ ఉన్న జిల్లాలుగా.. ఆ మాత్రం క్రేజ్ రావడం కామన్. అదే సమయంలో వారాహి యాత్రతో కంపేర్ చేస్తే.. లోకేశ్ యువగళానికి పెద్దగా స్పందన రావడం లేదు.
ఇవన్నీ ఆలోచించారో ఏమో కానీ.. పవన్ కొత్త నినాదం అందుకున్నారు. తనను సీఎం చేయాలని కోరుతున్నారు. నిన్నటివరకు సీఎం అయ్యేంత సీన్ లేదు.. ప్రయోగాలు చేయను అన్న పవన్.. మళ్లీ ఇప్పుడు కొత్త ట్రాప్‌లో ఇరుక్కుంటున్నారా.. వైసీపీకి స్కోప్ ఇవ్వబోతున్నారా అనే డిస్కషన్ మొదలైంది. గోదావరి జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాలను క్లీన్‌స్వీప్ చేయాలన్నది పవన్ టార్గెట్‌గా కనిపిస్తోంది. సభల్లో సేనాని మాటలు వింటే అదే అర్థం అవుతోంది కూడా ! క్లీన్‌స్వీప్ చేద్దామని అంటున్నారంటే.. పొత్తు కుదిరితే గోదావరి జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాలను పవన్ డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్‌గా తక్కువలో తక్కువ 50 సీట్లు తనకు కేటాయించాలని పవన్ అడిగే అవకాశం ఉంది.
ఇన్ని స్థానాలు కేటాయితే.. మళ్లీ వైసీపీకి అధికారానికి రెడ్‌కార్పెట్ పరిచినట్లే! ఇదంతా ఎలా ఉన్నా.. జనసేనకు 35 సీట్లు కేటాయించేందుకు టీడీపీ సిద్ధంగా ఉంది. అవసరం అయితే.. అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీల విషయంలో పవన్ పార్టీకి పెద్దపీట వేయాలన్నది చంద్రబాబు ప్లాన్‌గా అర్థం అవుతోంది. మరి దీనికి పవన్ అంగీకరిస్తారా లేదా అన్న సంగతి పక్కనపెడితే.. టీడీపీ కేటాయించేందుకు సిద్ధంగా ఉన్న 35 స్థానాల్లో జనసేన గెలుస్తుందా లేదా అన్నదే అసలు మ్యాటర్. గత ఎన్నికలతో కంపేర్ చేస్తే జనసేనకు భారీగా ఓటు శాతం పెరిగిన మాట వాస్తవమే ! నిల్చున్న ప్రతీచోట గెలిచేంత బలం ఉందా అంటే.. లేనే లేదు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. 7 నుంచి 10 స్థానాల్లో జనసేన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని.. సర్వేలు చెప్తున్నాయ్. అలాంటిది 35 స్థానాలు జనసేనకు ఇస్తే.. టీడీపీకి నష్టమే తప్ప లాభం లేదు అన్నది చాలామంది నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. చాలాచోట్ల జనసేనకు క్షేత్రస్థాయిలో సరైన బలం కూడా లేదు. అలాంటిది 35 సీట్లు ఇచ్చినా నష్టమే తప్ప.. లాభం లేదు అనే చర్చ జరుగుతోంది. మరి దీనిపై చంద్రబాబు ఎలాంటి ఆలోచన చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక అటు వారాహి యాత్రకు వస్తున్న రెస్పాన్ చూసి.. ఆ బజ్ చూసి లెక్కలు తప్పితే పవన్‌కు, ఆయన పార్టీకి కూడా ఇబ్బందే ! పైకి కనిపించేది ఏదీ నిజం కాదు.. కనిపించనిది ఏదీ అబద్ధం కాదు. పొత్తుల వేళ సేనాని, చంద్రబాబు గుర్తుంచుకోవాల్సింది ఇదే.