కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ లో కొత్త జోష్ కనిపించడం.. బీజేపీ కూడా సవాల్ విసురుతుండడం.. రాజకీయాన్ని ఆసక్తికరంగా మార్చాయ్. వరుసగా రెండేళ్లు అధికారంలో ఉన్న పార్టీగా బీఆర్ఎస్ మీద జనాల్లో వ్యతిరేకత మొదలైంది. కేసీఆర్‌కు కూడా తెలుసు ఈ విషయం నిజానికి ! అందుకే దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టినట్లు కనిపిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ మీద యువతలో వ్యతిరేకత మొదలైంది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి సామాజికవర్గాలవారీగా రాజకీయాలు మొదలుపెట్టినట్లు కనిపిస్తున్నారు. దీనికి తోడు సంక్షేమ పథకాల స్పీడ్ పెంచారు.
కులవృత్తులకు ఆర్థిక సాయంతో పాటు.. పింఛన్ పెంపు నిర్ణయాలు ఒకరకంగా చెప్తోంది కూడా అదే! ఇక ఉద్యమకారులను కేసీఆర్ పక్కనపెట్టేశారని.. అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదని.. మలిదశ ఉద్యమానికి తన ఆత్మహత్యతో ఊపిరి ఊదిన శ్రీకాంతాచారి కుటుంబాన్ని కేసీఆర్ కనీసం లెక్కలోకి కూడా తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయ్. వచ్చే ఎన్నికల్లో ఇలాంటి విషయాలు కీలకంగా మారే చాన్స్ ఉంటుంది. అందుకే ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు కేసీఆర్ సిద్ధం అయినట్లు కనిపిస్తున్నారు.
శ్రీకాంతచారి తల్లి శంకరమ్మకు బీఆర్ఎస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. ఆమెను మంత్రి జగదీష్‌రెడ్డి హైదరాబాద్ తీసుకువచ్చారు. మంత్రి కేటీఆర్ హామీ మేరకు శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే శంకరమ్మను హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారని చర్చ నడుస్తోంది.
నిజానికి గత కొద్దిరోజులుగా శంకరమ్మ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయ్. అమరవీరుల కుటుంబాలను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో శంకరమ్మకు పదవి కట్టబెట్టి విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సాధారణ ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ నిర్ణయం రాజకీయంగా కలిసొచ్చే అంశం అవుతుందని కేసీఆర్ అంచనా.