BJP: రఘునందన్‌పై పార్టీ హైకమాండ్ సీరియస్‌!

బీజేపీలో పరిణామాలు థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయ్. ఢిల్లీకి వెళ్లిన రఘునందన్‌ రావు.. కిషన్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఆ సమావేశానికి ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు రచ్చరేపాయ్. పార్టీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వాలని.. పదేళ్ల నుంచి కష్టపడుతున్నా తాను.. ఎందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాదని ప్రశ్నించారు.

  • Written By:
  • Publish Date - July 4, 2023 / 01:44 PM IST

దుబ్బాక నుంచి తాను రెండోసారి గెలవడం ఖాయం అని.. దుబ్బాక ఉప ఎన్నికలో తనకు ఎవరూ సాయం చేయేలేదన్న రఘునందన్ రావు.. మునుగోడు విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు టాక్ నడిచింది. వంద కోట్లు ఖర్చు పెట్టినా మునుగోడులో గెలవలేకపోయారని.. అదే వంద కోట్లు తనకు ఇస్తే రాష్ట్రాన్ని దున్నేసేవాన్ని అని రఘునందన్ అన్నారంటూ వార్తలు హల్‌చల్‌ చేశాయ్. తన గెలుపుతోనే ఈటల.. బీజేపీలో చేరారరని.. తన సేవలకు ప్రతిఫలం దక్కకపోతే నడ్డాపై మోదీకి ఫిర్యాదు చేస్తానని రఘునందన్ అన్నారని రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. మీడియాతో చిట్‌చాట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు వార్తలు వినిపించాయ్. తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ దీనిపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. బండి సంజయ్ మీద కూడా రఘునందన్‌.. సంచలన వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వైరల్ అయ్యాయ్.

ఐతే ఆ తర్వాత అలాంటి వ్యాఖ్యలు తానే చేయలేదని.. మీడియాలో వక్రీకరించారని.. దీనికి కారణం అయిన వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని రఘునందన్ చెప్పినా.. రచ్చ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఐతే రఘునందన్ వ్యాఖ్యలు.. బీజేపీలో కొత్త చర్చకు కారణం అవుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. రఘునందన్ వ్యాఖ్యలను.. కొందరు ట్రాన్స్‌లేట్ చేసి మరీ.. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇంచార్జ్ తరుణ్‌చుగ్‌కు పంపించినట్లు తెలుస్తోంది. దీంతో రఘునందన్ రావు వ్యవహారంలో హైకమాండ్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. రఘునందన్‌పై చర్యలు తప్పవని కూడా పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో బీజేపీ తర్వాత అడుగులు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.