Naagam Janardhan Reddy: హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్.. కారెక్కనున్న నాగం.?

నాగర్ కర్నూల్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన నాగం జనార్థన్ రెడ్డికి కాంగ్రెస్ నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాగం కు కాకుండా కొత్తగా పార్టీల తీర్థం పుచ్చుకున్న రాజేష్ కు టికెట్ కేటాయించింది. దీంతో నాగం కాంగ్రెస్ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - October 29, 2023 / 12:55 PM IST

నాగం జనార్థన్ రెడ్డి గతంలో తెలుగుదేశం హయాంలో మంత్రిగా కొనసాగారు. నాగర్ కర్నూల్ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రత్యేక రాష్ట్రం నేపథ్యంలో టీడీపీని వీడి బీజేపీలో చేరారు. ఆ తరువాత కొన్నాళ్లకు కాంగ్రెస్ గూటికి చేరారు. తాజాగా నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి టికెట్ కాంగ్రెస్ టికెట్ ఇస్తుందని ఆశించారు. కానీ హస్తం పార్టీ ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డికి టికెట్ కన్ఫాం చేసింది. దీంతో నాగం కాంగ్రెస్ పై గుర్రున ఉన్నారు.

గడిచిన నాలుగైదేళ్లుగా కాంగ్రెస్ క్యాడర్‌ను కాపాడుకుంటూ వస్తున్న నన్ను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడంలో చాలా కాలంగా కృషి చేస్తున్నానన్నారు. అవసరానికి నన్ను వాడుకుని తాజాగా పక్కపార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్ కేటాయించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్లు కేటాయించి.. కొన్నేళ్లుగా పార్టీకి సేవలు చేసిన వారిని విస్మరించడంతో కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయాలను నాశనం చేశారన్నారు.

ఈరోజు సాయంత్రం నాగం జనార్థన్ రెడ్డి ఇంటికి కేటీఆర్ వెళ్లి పరామర్శించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయనను బీఆర్ఎస్ లోకి ఆహ్వనించేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. 2018 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అనేక కార్యక్రమాలు చేశానిని చెప్పారు. అలాంటి నన్ను బోగస్ సర్వేల పేరుతో రేవంత్ రెడ్డి తనకు మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నాకు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణాన్నికూడా చెప్పకపోవడం తీవ్రం బాధ కలిగిస్తుందన్నారు. ఇతర పార్టీ నేతలు తనకు జరిగిన అన్యాయం పై స్పందిస్తే కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. ఇదిలా ఉంటే కేటీఆర్ ఆదివారం సాయంత్రం నాగం ఇంటికి వెళ్లి కలిసిన తరువాత బీఆర్ఎస్ లోకి చేరే అవకాశాలు ఎక్కవగా ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

T.V.SRIKAR