India Vs Australia Match: దుమ్ముదుమ్ము వానలు రెండో వన్ డే లేనట్టే

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో టీమిండియా గెలిచి శుభారంభం చేసింది. ఇప్పుడిదే ఉత్సాహంతో రెండో మ్యాచ్‌కు కూడా రెడీ అయ్యింది. అయితే భారత్ ఉత్సాహంపై వరుణుడు నీళ్లు చల్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - September 24, 2023 / 10:14 AM IST

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో టీమిండియా గెలిచి శుభారంభం చేసింది. ఇప్పుడిదే ఉత్సాహంతో రెండో మ్యాచ్‌కు కూడా రెడీ అయ్యింది. అయితే భారత్ ఉత్సాహంతో వరుణుడు నీళ్లు చల్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం భారత్ ,ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ జరిగే ఆదివారం రోజు ఇండోర్‌లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మ్యాచ్ సమయంలో వర్షం కురిసినా మ్యాచ్‌ను నిర్వహిస్తామని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామంటూ కాస్త ఊరట కలిగించే వార్త చెప్పారు.

ఈ విషయమై వాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ వీపీఎస్ చందేల్ మాట్లాడుతూ.. ‘సెప్టెంబర్ 24 అర్ధరాత్రి 12 గంటల వరకు హోల్కర్ స్టేడియం చుట్టూ పొడి వాతావరణం ఉంటుంది. అయితే మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. ఇండోర్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. గత మూడు రోజులుగా నగరంలో కురుస్తున్న కొద్దిపాటి వర్షాల కారణంగా హోల్కర్ స్టేడియం మైదానం, పిచ్ ను ఎప్పటికప్పుడు మూసివేస్తున్నట్లు ఎంపీసీఏ అధికారులు తెలిపారు. వర్షం ఆగిన తర్వాత ఎండలు వచ్చినప్పుడల్లా మైదానం, పిచ్ పొడిగా ఉండేందుకు, మైదానంలో గడ్డి పచ్చగా ఉండేలా కవర్‌ను తొలగిస్తామని చెప్పారు.

కాగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే హోల్కర్ స్టేడియంలో మధ్యాహ్నం 01:30 గంటలకు ప్రారంభమవుతుంది. మ్యాచ్ సన్నాహకాలపై ఎంపీసీఏ మీడియా మేనేజర్ రాజీవ్ రిసోద్కర్ మాట్లాడుతూ.. ‘భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే మ్యాచ్‌ నిర్వహించేందుకు మేం రెడీగా ఉన్నాం. మ్యాచ్ జరిగేటప్పుడు మైదానం, పిచ్ సురక్షితంగా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. దాదాపు 28 వేల మంది ప్రేక్షకులు ఉండే హోల్కర్ స్టేడియం మైదానంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచామని, మైదానం, పిచ్‌ను కవర్ చేసేలా కొత్త కవర్లను కూడా కొనుగోలు చేశామన్నారు. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం ఉన్నందున హోల్కర్ స్టేడియం మైదానంలో దాదాపు 120 మంది సిబ్బందిని ప్రత్యేకంగా మోహరిస్తున్నాం. మ్యాచ్ సమయంలో వర్షం పడితే ఈ సిబ్బంది వెంటనే మైదానాన్ని, పిచ్‌ను మూసివేస్తారు. వర్షం ఆగిన తర్వాత, ఈ కవర్లు వీలైనంత త్వరగా తీసివేస్తారు. తద్వారా వీలైనంత త్వరగా మ్యాచ్‌ని పునఃప్రారంభించేందుకు ఆస్కారం ఉంది’ అని పేర్కొన్నారు.