ఎవ్వరూ ఊహించని విధంగా తన నిర్ణయాలను ప్రకటించడంలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) స్టైలే వేరు.. అంతర్జాతీయ క్రికెట్ (International cricket) కు వీడ్కోలు పలికినప్పుడూ హఠాత్తుగా నిర్ణయం వెల్లడించి ఆశ్చర్యపరిచాడు. ఇక ప్రస్తుతం ఐపీఎల్ లోనూ తన రిటైర్మెంట్ పై ఊరిస్తూనే ఉన్నాడు. ప్రతీ సీజన్‌లోనూ ధోనీకి ఇదే చివరి టోర్నీ అని ప్రచారం జరగ్గా.. అతను మాత్రం ఇప్పుడు కాదంటూ ముందుకు కొనసాగుతున్నాడు. తాజాగా అభిమానులు అడిగిన ప్రశ్నకు మరోసారి ధోనీ రిటైర్మెంట్ (Dhoni retirement)పై హింట్ ఇచ్చాడు. మెగా వేలానికి సంబంధించిన నిబంధనలు, రిటెన్షన్ పాలసీని ప్రకటించిన తర్వాతే క్యాష్ రిచ్ లీగ్‌లో కొనసాగే విషయంపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ధోనీ స్పష్టం చేశాడు. నాలుగేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ధోనీ.. కేవలం ఐపీఎల్ (IPL) లో మాత్రమే కొనసాగుతున్నాడు.
అందుకు తగ్గట్లుగానే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొని రుతురాజ్ గైక్వాడ్‌ను (Ruthuraj Gaikwad) కెప్టెన్సీ చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో సీఎస్‌కే ఆడే చివరి మ్యాచే ధోనీకి ఫేర్‌వెల్ గేమ్ అని అంతా అనుకున్నారు. కానీ ధోనీ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకుండా ఆ సీజన్‌ను ముగించాడు. తాజాగా దీనిపై మాట్లాడిన మహి తాను ఏ నిర్ణయం తీసుకున్నా జట్టుకు మేలు చేసేలానే ఉంటుందన్నాడు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ సైతం ధోనీ తన రిటైర్మెంట్‌కు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. అతన్ని రిటైన్ చేసుకునేందుకు తాము సిద్దంగా ఉన్నామని తెలిపింది.