ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay), మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etala Rajender) మధ్య విభేదాలు మరింత పెరిగాయా…? అంటే అవునన్న సమాధానమే వస్తోంది పార్టీ వర్గాల నుంచి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇద్దరు నేతలు ఎడ మొఖం పెడ మొఖంగానే ఉంటున్నారట. ఇటీవల బండి సంజయ్ (Bandi Sanjay) హుజూరాబాద్ (Huzurabad) నియోజకవర్గంలో తరచుగా పర్యటిస్తూ… పార్టీ శ్రేణులను పార్లమెంట్ ఎన్నిలకు (Parliament Elections) సమాయాత్తం చేస్తున్నారు… అయితే సంజయ్ టూర్‌లో ఎక్కడా ఈటల కనిపించకపోవడం ఆసక్తికరంగా మారింది.
పల్లె నిద్ర పేరుతో ఓ రోజంతా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నారు సంజయ్. ఆ తర్వాత ఆయోధ్య చిత్ర పటాల పంపిణీ అని మరో రోజంతా అక్కడే తిరిగారాయన. అయినా ఈటల అటువైపు వెళ్లలేదట…అంతేకాదు ఆయన వర్గంలోని నేతలెవరూ ఆ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఈటల పార్టీలోకి రాకముందున్న నేతలతోనే సంజయ్ తన కార్యక్రమాలను లాగించేశారట. అయితే పర్యటన వివరాలు కానీ, ఆహ్వానాలు కానీ తమకు లేకపోవడంవల్లే వెళ్లలేదని ఈటల వర్గం చెబుతున్నట్టు తెలిసింది.
మరోవైపు వరుసగా 20 ఏళ్ల పాటు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న రాజేందర్… ఓడిపోయాక హుజురాబాద్ వైపు చూడలేదన్నది లోకల్ టాక్. తొలుత కరీంనగర్ లోక్‌సభ సీటుపై కన్నేసినా అది కుదరకపోవడంతో మల్కాజ్‌గిరిపై మనసు పారేసుకుంటున్నారని, అందుకే ఈటల హుజురాబాద్ వైపు రావడం తగ్గించేశారన్న టాక్ నడుస్తోంది. అయితే సంజయ్ హుజూరాబాద్ పర్యటన కంటే ముందే పార్టీ అగ్రనేత అమిత్ షా, కిషన్ రెడ్డి సమక్షంలోనే ఇద్దరినీ పిలిచి క్లాస్ పీకారట… కలిసి పనిచేయండి… ఒకరిని ఒకరు డామినేట్ చేసే పద్దతి మంచిది కాదు.. రిపీట్ అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
సమావేశం తర్వాత ఇద్దరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమని షా చెప్పినా… వినకుండా సంజయ్ అక్కడ నుంచి వెళ్లిపోయారట. అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు మరింత తీవ్రం అయినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్ధులతో కుమ్మక్కై తనను సొంత పార్టీ వారే ఓడించారని సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఈటలను ఉద్దేశించినవేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఈటల రాజేందర్ వల్ల పార్టీకి ఒనగూరిన ప్రయోజనం ఏంటన్న చర్చ కూడా మొదలైందట. ఆయన వ్యక్తిగత పోకడలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని, ఆయన వల్ల క్రమశిక్షణ తప్పుతోందన్న ప్రచారాన్ని సంస్థాగత స్థాయికి తీసుకెళ్తోందట ఆయన వ్యతిరేక వర్గం. ఈ పరిస్థితుల్లో ఈసారి హుజురాబాద్ సెగ్మెంట్ పరిధిలో తన ఓటింగ్ తగ్గకుండా…సంజయ్ ముందు నుంచే జాగ్రత్త పడుతున్నట్టు తెలిసింది.
ఇటీవల జరిగిన సంస్థాగత కార్యదర్శుల సమావేశంలోనూ ఆరెస్సెస్ నేతలు కూడా ఇద్దరి మధ్య విభేదాలే పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని అభిప్రాయపడ్డట్టు తెలిసింది. కరీంనగర్ పార్లమెంట్ సీటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చింది కరీంనగర్, హుజూరాబాద్‌లోనే. మొత్తం రెండు లక్షల 60 వేల ఓట్లు పార్టీకి రాగా… మూడింట రెండు వంతులు ఈ రెండు నియోజకవర్గాల్లోనివే. ఈ పరిస్థితుల్లో హుజూరాబాద్‌లో పట్టున్న ఈటల నుంచి బండి సంజయ్‌కి ఎంత వరకు సహకారం లభిస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఇక్కడంతా పార్టీ కంటే మాజీ మంత్రి సొంత ఓట్ బ్యాంక్ ఎక్కువ. అందుకే సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా బండి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలిసింది. పార్టీ పెద్దలు ఆశించినట్టు పార్లమెంట్ ఎన్నికల నాటికి పరిస్థితులు చక్కబడతాయా…? లేక ఈ ఎత్తులు పైఎత్తులు… వ్యూహాలు ప్రతివ్యూహాలతో మరోసారి ఇక్కడ బీజేపీ నష్టపోతుందా అన్న చర్చ జరుగుతోంది.