వచ్చింది కోటి.. పోయింది డ్యూటీ..
ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడడం కాదు కదా.. అలాంటి యాప్‌లు ఇన్‌స్టాల్ చేసినా తోలు తీస్తామన్నట్లుగా భయపెడుతున్నారు పోలీసులు. చాలా రాష్ట్రాల్లో ఇలాంటి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను బ్యాన్ చేశారు కూడా ! అలాంటి ఓ పోలీస్ అధికారే ఆన్‌లైన్ బెట్టింగ్ చేసి.. కోటి రూపాయలు సంపాదించాడు. కట్ చేస్తే ఉద్యోగం ఊడిపోయింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ డ్రీమ్ 11లో కోటిన్నర గెలుచుకొని వార్తల్లో నిలిచారు ఎస్‌ఐ సోమనాథ్. అయితే పోలీసు ఉన్నతాధికారులు తనపై తీసుకున్న క్రమశిక్షణా చర్య మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నిబంధనలను అతిక్రమించి పోలీస్‌శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేశారు.
మహారాష్ట్రలోని పింప్రీ, ఛించ్వాడ్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేసే సోమనాథ్.. అక్టోబరు 10న డ్యూటీలో ఉండి.. ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ మ్యాచ్‌పై బెట్టింగ్ చేశాడు. అదృష్టం పరీక్షించుకున్నాడు. కోటిన్నర గెలుచుకున్నాడు. దీంతో సోమనాథ్ కుటుంబసభ్యులు మిఠాయిలు పంచుకొని పార్టీ చేసుకున్నారు. మూడు నెలలుగా సోమనాథ్ డ్రీమ్ 11లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ విషయం డిపార్ట్మెంట్వరకూ తెలిసింది. దీంతో సోమనాథ్‌పై చర్యలు తీసుకున్నారు. తదుపరి విచారణ బాధ్యతలను డీసీపీకి అప్పగించారు. నిబంధనలు అతిక్రమించడంతో సదరు ఎస్‌ఐని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
ఒకవైపు ఇంట్లోకి కోటిన్నర రూపాయలు రాగా.. మరోవైపు ఎస్‌ఐ జాబ్ ఊడిపోవడంతో అతడు దు:ఖంలో మునిగిపోయారు. డ్రీమ్ 11 అనేది ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్. ఇది ఫాంటసీ క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ, హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, రగ్బీ, ఫుట్‌సల్, అమెరికన్ ఫుట్‌బాల్, బేస్‌బాల్‌లలో బెట్టింగ్ వేయడానికి అవకాశం కల్పిస్తుంది. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ తీవ్ర నష్టాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెట్టింగ్‌లకు అలవాటు పడి చాలామంది ఆర్థికంగా నష్టపోయినట్లు చెప్తున్నారు. బెట్టింగ్‌లు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యొద్దని సూచిస్తున్నారు. అలాంటిది ఓ ఎస్‌ఐ ఇలా చేస్తే ఊరుకుంటారు.. ఉద్యోగం ఊడపీకేశారు.