డబ్బు గురించి కాదు.. ఢిల్లీ ఫ్రాంచైజీతో గొడవపై పంత్

ఐపీఎల్ మెగావేలానికి సమయం దగ్గర పడింది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఈ నెల 24,25 తేదీల్లో ఆటగాళ్ళ వేలం జరగబోతోంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు రిటెన్షన్ జాబితాను ప్రకటించగా.. అటు వేలంలో ప్లేయర్స్ షార్ట్ లిస్ట్ ను కూడా బీసీసీఐ ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - November 19, 2024 / 05:22 PM IST

ఐపీఎల్ మెగావేలానికి సమయం దగ్గర పడింది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఈ నెల 24,25 తేదీల్లో ఆటగాళ్ళ వేలం జరగబోతోంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు రిటెన్షన్ జాబితాను ప్రకటించగా.. అటు వేలంలో ప్లేయర్స్ షార్ట్ లిస్ట్ ను కూడా బీసీసీఐ ప్రకటించింది. అయితే రిటెన్షన్ జాబితాలు ఖరారయ్యాక కొన్ని ఊహించని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రిటెన్షన్ లో ఈ సారి అందరికీ ఆశ్చర్యం కలిగించిన ఆటగాడు రిషబ్ పంత్… ఢిల్లీ సారథిగా జట్టును సమర్థవంతంగా లీడ్ చేస్తున్న పంత్ ను ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. దీనికి ఆ ఫ్రాంచైజీతో పంత్ కు విభేదాలు తలెత్తడమే కారణమని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఎక్కువ మొత్తం అడిగాడనీ, కోచ్ విషయంలో జోక్యం చేసుకున్నాడంటూ వేర్వేరు కారణాలతో కథనాలు వినిపించాయి. తాజాగా రిషబ్ పంత్ దీనిపై స్పందించాడు. అతను ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్ తో ఢిల్లీ ఫ్రాంచైజీతో విభేదాలు నిజమేనని తేలిపోయింది.

స్టార్ స్పోర్ట్ కు సంబంధించిన ఓ షోలో మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ రిషబ్ పంత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ ను ఢిల్లీ ఖచ్చితంగా మళ్ళీ తీసుకుంటుందని చెప్పుకొచ్చాడు. కొన్ని సందర్భాల్లో ఫ్రాంచైజీకి, ఆటగాడికి మధ్య రిటెన్షన్ మొత్తానికి సంబంధించి సరైన డీల్ కుదరకపోవడంతోనే వేలంలోకి వదిలేస్తాయని వ్యాఖ్యానించాడు. పంత్ విషయంలో ఇలాంటిదే జరిగి ఉండొచ్చంటూ గవాస్కర్ పరోక్షంగా కామెంట్ చేశాడు. దీనిపై ఎక్స్ వేదికగా పంత్ స్పందించాడు. ఈ వీడియోను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు. తన రిటెన్షన్ లో డబ్బు అసలు మ్యాటరే కాదని, వేరే కారణాలున్నాయని తేల్చేశాడు. దీంతో ఢిల్లీ ఫ్రాంచైజీ యాజమాన్యంతో రిటెన్షన్ మొత్తం కాకుండా వేరే విషయాల్లో పంత్ కు చెడిందని తెలుస్తోంది. ముఖ్యంగా కోచ్ ఎంపిక విషయంలో పంత్ విభేదించాడని సమాచారం. ప్రధాన కోచ్‌తో పాటు సహాయక సిబ్బంది విషయంలోనూ పంత్ ఢిల్లీ యాజమాన్యం ముందు కొన్ని డిమాండ్లు ఉంచాడని తెలుస్తోంది. దీని గురించి గత నెలలో పలుసార్లు చర్చలు కూడా కొనసాగాయి. పంత్ డిమాండ్‌ను ఢిల్లీ మేనేజ్ మెంట్ ఒప్పుకోలేదు. అంతకంతకూ విభేదాలు ముదురుతుండటంతో పంత్‌ను ఢిల్లీ వదులుకున్నట్టు తెలుస్తోంది.

పంత్ తాజా ట్వీట్ నేపథ్యంలో ఢిల్లీ అతన్ని మళ్ళీ తీసుకునే అవకాశాలు లేనట్టే. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయాస్ అయ్యర్ ను వేలంలో దక్కించుకోవాలని ఎదురుచూస్తోంది. కోల్ కత్తా నైట్ రైడర్స్ అయ్యర్ ను రిటైన్ చేసుకోకపోవడంతో అతను 2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చాడు. శ్రేయాస్ కోసం ఢిల్లీ చివరి వరకూ ప్రయత్నించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే పంత్ గత సీజన్ లో 13 మ్యాచ్ లు ఆడి మూడు హాఫ్ సెంచరీలతో 446 పరుగులు చేశాడు. 2016లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ వికెట్ కీపర్ ఇప్పటి వరకూ 111 మ్యాచ్ లలో 3284 పరుగులు చేశాడు. దీనిలో 3 శతకాలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కెప్టెన్సీలోనూ తనదైన మార్క్ చూపించిన పంత్ కారు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత మరింత నిలకడగా రాణిస్తున్నాడు. ఢిల్లీ వద్దనుకున్నా మెగా వేలంలో పంత్ కు కాభారీ ధర పలికే అవకాశం ఉంది.