Jagan dharna : ఢిల్లీలో జగన్ ఒంటరి పోరాటం.. ధర్నాకి కలిసొస్తామని ఎవరు చెప్పారు?

ఆంధ్రప్రదేశ్ లో అరాచకం పెరిగిపోయింది అంటూ వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో ధర్నాకు దిగుతున్నారు. ఆయన ఢిల్లీకి వెళ్ళేముందు తన గోడును మరోసారి X లో వెళ్ళబోసుకున్నారు.

 

 

ఆంధ్రప్రదేశ్ లో అరాచకం పెరిగిపోయింది అంటూ వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో ధర్నాకు దిగుతున్నారు. ఆయన ఢిల్లీకి వెళ్ళేముందు తన గోడును మరోసారి X లో వెళ్ళబోసుకున్నారు. అందులో కలిసొచ్చే పార్టీలతో కలసి ఆందోళన చేస్తామన్నారు… ఇంతకీ వైసీపీతో కలిసొచ్చే పార్టీలు ఏంటి? ఢిల్లీ ధర్నాకు వస్తామని ఏ పార్టీ అయినా జగన్ కి చెప్పిందా ?

జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్ళూ… బీజేపీకి అంటకాగారు. గత NDA ప్రభుత్వంలో వచ్చిన అన్ని బిల్లులకీ 23 మంది వైసీపీ ఎంపీలు మద్దతిచ్చారు. పార్లమెంట్ బయటా, వెలుపలా కూడా కమలంతోనే వైసీపీ ఎంపీల దోస్తీ కొనసాగింది. బీజేపీ తెచ్చిన ఏ బిల్లుని కూడా ఆ పార్టీ వ్యతిరేకించలేదు. అందుకే జగన్ పై ఉన్న సీబీఐ, ఈడీ కేసులు వాయిదా పడుతూ వచ్చాయన్న రూమర్ కూడా ఉంది. అప్పుడే కాదు… ఇప్పటికీ ప్రధాని మోడీతో జగన్ కి ఈక్వేషన్ బాగానే ఉంది. కానీ ఏపీలో ఇప్పుడు అదే బీజేపీ… కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఆ ప్రభుత్వంపైనే జగన్ పోరాటం చేస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ కూడా వైసీపీకి వ్యతిరేకమే. పైగా ఆ పార్టీకి అధ్యక్షురాలిగా తన చెల్లెలు షర్మిల ఉన్నారు.

మొన్నటిదాకా బీజేపీతో కలసి పనిచేసిన జగన్ కు ఢిల్లీలో కలిసొస్తామని చెప్పిన పార్టీ ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. కేంద్రంలో ఉన్నది రెండే కూటములు… ఒకటి బీజేపీ అధ్వర్యంలోని NDA. రెండోది కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి. బీజేపీ సపోర్ట్ ఇవ్వదు. కాంగ్రెస్ జగన్ ని నమ్మదు. ఇప్పుడు జగన్ ఈ రెండింటికీ కాకుండా పోయారు. జగన్ తో కలవడానికి… ఆ పార్టీకి పట్టుమని 10 మంది ఎంపీలు కూడా లేరు. అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఏపీలో తన మైలేజీ పెంచుకోడానికే జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారన్న సంగతి …. జాతీయ పార్టీలకు తెలియంది కాదు. అందుకే ఆయనకు మద్దతిస్తే నవ్వుల పాలవుతామని పార్టీల నేతలు అనుకుంటున్నారు. ఢిల్లీలో జగన్ ది ఒంటరి పోరాటమే తప్ప… కలసి వచ్చే పార్టీలు లేవు… తోటకూర కట్టా లేదు.