బడుగు బలహీన వర్గాలకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో స్కీంలను అమలు చేస్తున్నాయి. వీటి ద్వారా వారికి ఆర్థిక సాయం అందజేస్తున్నాయి. ఇలాంటి వాటిలో కొన్ని పూర్తిగా కేంద్రం అమలు చేస్తుంటే.. మరికొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. కొన్ని పథకాలు మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ప్రజలకు అందజేస్తున్నాయి. అలాంటి వాటిలో పీఎం కిసాన్ యోజన ఒకటి. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. అయితే కొన్ని రాష్ట్రాలు కూడా తమవంతుగా రైతులను ఆదుకునేందుకు ముందుకొచ్చాయి.
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధినేత జగన్.. రైతులకు నగదు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 12 వేల రూపాయలను ఏటా రైతులకు నేరుగా అందిస్తామని మాటిచ్చారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో అమలు చేయడం ప్రారంభించారు. అయితే అప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పేరుతో ఓ స్కీం ఇంప్లిమెంట్ చేస్తోంది. దీని ద్వారా 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఏటా 6 వేల రూపాయలను నేరుగా వారి ఖాతలకు 3 విడతలుగా బదిలీ చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6 వేలకు అదనంగా తమకు జగన్ ఇచ్చే 12 వేలు వస్తాయని అందరూ ఆశించారు. అయితే జగన్ తెలివిగా వ్యవహరించి కేంద్ర ప్రభుత్వ సొమ్మును కూడా తమ ఖాతాలో వేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6 వేలకు మరో 7500 జత చేసి 13500 ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. హామీ ఇచ్చిన సొమ్ము కంటే తాము ఎక్కువగా ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. కేంద్రం నగదు విడదల చేసే సమయంలోనే జగన్ కూడా బటన్ నొక్కి ఈ డబ్బులు పంపిణీ చేయడం ప్రారంభించారు. దీంతో ఈ డబ్బంతా జగనే ఇస్తున్నారని రైతులను నమ్మించే ప్రయత్నం జరుగుతోంది. వాస్తవానికి మొదట్లో ఈ స్కీంకు పీఎం కిసాన్ యోజన పేరు కూడా జత చేయలేదు. అయితే బీజేపీ వాళ్లు ప్రశ్నించడంతో ఇటీవలే దీనికి వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ యోజన అని ప్రచారం చేస్తున్నారు.
ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు రైతులకు మరోసారి నగదు సాయం అందే సమయం ఆసన్నమైంది. కేంద్ర ప్రభుత్వం ఏటా మే, అక్టోబర్, ఫిబ్రవరి మాసాల్లో 2వేల చొప్పున రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. జగన్ ప్రభుత్వం మేలో 5500, అక్టోబర్ లో 2000 అందిస్తోంది. ఫిబ్రవరిలో జమ చేసే సొమ్ముకు, జగన్ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సొమ్ము. ఇక ఈ ఏడాది విషయానికొస్తే.. ప్రధాని మోదీ సోమవారమే అంటే ఫిబ్రవరి 27వ తేదీనే పీఎం కిసాన్ యోజన సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేసేశారు. ఇప్పటికే రైతుల అకౌంట్లలోకి డబ్బు వెళ్లిపోయింది. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం మంగళవారం.. అంటే ఫిబ్రవరి 28న తెనాలిలో బటన్ నొక్కి నగదు పంపిణీ చేయబోతున్నామని ప్రచారం చేస్తోంది. అంతేకాదు.. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించింది. ఇప్పటికే అకౌంట్లలో జమ అయిన కేంద్ర ప్రభుత్వ సొమ్ముకు ఇప్పుడు జగన్ బటన్ నొక్కి పంపిణీ చేయడమేంటి.. అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.