అన్న వదిలిన బాణాన్ని అని అప్పుడెప్పుడో చెప్పిన షర్మిల (Sharmila).. ఇప్పుడు అదే అన్నకు బళ్లెంగా మారింది. ఎంతలా గుచ్చుకుంటుంది అంటే.. బయటకు చెప్పలేరు.. గట్టిగా అనలేరు అన్నట్లుగా తయారయింది జగన్ పరిస్థితి అనే టాక్ వినిపిస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా.. జగన్‌ను గద్దె దించడం కాదు కదా.. జగన్‌ను రాజకీయంగా నాశనం చేయడమే తన టార్గెట్ అన్నట్లుగా కనిపిస్తున్నారు షర్మిల. ఏపీకి రానే రాను.. తెలంగాణలో రాజకీయం (Telangana Politics) అని పట్టుపట్టిన షర్మిల.. వన్ ఫైన్ డే నిర్ణయం మార్చుకున్నారు. కాంగ్రెస్‌లో చేరి.. ఏపీ పగ్గాలు అందుకున్నారు. షర్మిల ఎంట్రీతో తమకు జరగబోయే ప్రమాదం ఏమీ లేదు అన్నట్లు బిహేవ్ చేసిన వైసీపీ నేతలు.. ఇప్పుడు అలర్ట్ అవుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు షర్మిలను టార్గెట్ చేస్తున్నారు.
ఎవరి తీరు ఎలా ఉన్నా.. షర్మిల మాత్రం పక్కా టార్గెట్‌తో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తున్నారు. జగన్ రాజకీయ జీవితాన్ని బుగ్గి చేయడమే లక్ష్యం అన్నట్లుగా పావులు కదుపుతున్నారు. జగన్ నోటి నుంచి వచ్చే ప్రతీ మాటకు కౌంటర్ ఇస్తున్నారు. వైసీపీ బలం అనుకున్న ప్రతీ విషయంపై దాడి చేస్తున్నారు. అందరూ అనుకుంటున్నట్లు జగన్ మంచోడే కాదని అంటున్న షర్మిల.. అసలు నువ్ వైఎస్ బిడ్డవేనా అంటూ సీఎంను టార్గెట్ చేస్తూ.. కొత్త చర్చకు కారణం అయ్యేలా చేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి కావడంలో.. వైఎస్ అనే పేరుది కీలక పాత్ర అనడంలో ఎలాంటి అనుమానం లేదు. వైఎస్ మరణం తర్వాత ఆ పేరుతోనే.. కాంగ్రెస్ ఓటు బ్యాంకును వైసీపీ వైపు తిప్పుకున్నారు. ఐతే అలాంటి వైఎస్ అనే సెంటిమెంట్‌ను కూడా వైసీపీకి దూరం చేయాలని ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నారు.
వైసీపీలో వైఎస్ (Jagan vs Sharmila) లేడని.. ఉన్నది వైవీ, విజయసాయి, రామకృష్ణారెడ్డి మాత్రమే అంటూ.. వైఎస్ అభిమానులను దగ్గర చేసుకుంటూనే.. వైసీపీ నుంచి వైఎస్ బ్రాండ్ తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు అంటూ.. జగన్‌ది మొత్తం అవినీతే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల. జగన్ ఎలాంటివాడో తనకే కాదు.. అమ్మకు కూడా తెలుసు అంటూ.. విజయమ్మ (YS Vijayamma) పేరు ప్రస్తావిస్తూ.. జగన్‌ను మరింత ఇరుకునపెడుతున్నారు. ఎలా ఉండే వారు ఎలా అయిపోయారనే కామెంట్లతో.. సింపథీ సాధించడంతో పాటు.. స్ట్రెయిట్ ప్రశ్నలు సంధిస్తూ.. జగన్, వైసీపీని మరింత లక్ష్యంగా చేసుకున్నారు షర్మిల.
జగన్, షర్మిల మధ్య ఏం జరిగింది అన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. తనకు న్యాయం చేయలేదని షర్మిలకు కోపం వచ్చిందా.. ఆస్తులపరంగా ఇబ్బందులు వచ్చాయా అన్న సంగతి పక్కనపెడితే… జగన్ అంతు చూడడమే లక్ష్యం అన్నట్లుగా షర్మిల తీరు కనిపిస్తోంది. ఆమెను మొదట్లో లైట్ తీసుకున్న వైసీపీని.. ఇప్పుడు షర్మిల వ్యవహారం గందరగోళంలో పడేస్తోంది. ఒక్కటి మాత్రం నిజం.. మన గురించి ఏమీ తెలియని శత్రువు నుంచి వచ్చే ప్రమాదంతో కంపేర్ చేస్తే.. మన గురించి అన్నీ తెలిసిన మన అనుకున్న వాడితోనే ప్రమాదం ఎక్కువ అనే కామెంట్లు పేలుతున్నాయ్ సోషల్ మీడియాలో.