క్రికెట్ లో స్లెడ్జింగ్ అనగానే మనకు గుర్తొచ్చే టీమ్ ఏదైనా ఉందంటే అది ఆస్ట్రేలియానే… ఆట కంటే మాటలతోనే ప్రత్యర్థిని దెబ్బతీసే అలవాటు కంగారూలదే.. గత కొన్నేళ్ళుగా వరల్డ్ క్రికెట్ లో స్లెడ్జింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కంగారూలకు వారి భాషలోనే జవాబిచ్చిన టీమ్ మనదే.. అది కూడా వారి సొంతగడ్డపై ఆసీస్ క్రికెటర్ల మాటల యుద్ధానికి టీమిండియా ఆటతోపాటు మాటలతోనూ బదులిచ్చి వారికి బుద్ది చెప్పింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇరు జట్ల మధ్య వివాదాలు, మాటల యుద్ధాలు చాలా సార్లే జరగ్గా… కంగారూల నోటీదురుసుకు నోటితోనే జవాబివ్వడం ద్వారా భారత్ వారికి చెక్ పెట్టింది. ఇప్పుడు జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ మాటల యుద్ధం మొదలైంది. అయితే ఈ సారి భిన్నంగా భారత ఆటగాళ్ళు ఆసీస్ క్రికెటర్లను టీజ్ చేస్తున్నారు.
మన పేసర్లు కూడా కవ్వించే బంతులతో ఆసీస్ బ్యాటర్లను కాస్త గట్టిగానే ఇబ్బందిపెట్టారు. ఎప్పుడూ సొంతపిచ్ లపై చెలరేగిపోయే కంగారూ బ్యాటర్లు ఈ సారి మాత్రం మన బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు ఆపసోపాలు పడ్డారు. పెర్త్ టెస్టులో రెండోరోజు మిచెల్ స్టార్క్- హర్షిత్ రాణా ఫైట్ ఆటను మరింత రసవత్తరంగా మార్చింది. తనను కవ్వించిన స్టార్క్‌కు రాణా బంతితో సమాధానమిచ్చాడు. రాకాసి బంతితో స్టార్క్ హెల్మెట్ బద్దలుకొట్టాడు. హర్షిత్ రాణా బౌలింగ్ ను ఎదుర్కొనే క్రమంలో ఇబ్బందిపడిన స్టార్క్ నోటికి పనిచేప్పాడు. హర్షిత్.. నీకంటే ఎక్కువ వేగంగా బౌలింగ్ చేస్తానంటూ అంటూ రెచ్చగొట్టాడు. దీనికి నవ్వుతూ తిరిగి వెళ్ళిన హర్థిత్ తర్వాత రివేంజ్ తీర్చుకున్నాడు. హర్షిత్ రాణా భారీ బౌన్సర్ తో స్టార్క్‌కు సమాధానమిచ్చాడు. హర్షిత్ వేసిన బౌన్సర్ నుంచి స్టార్క్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అది ఊహించినంత బౌన్సర్ కాకపోవడం, స్టార్క్ ఎత్తు వల్ల బంతి హెల్మెట్‌కు తాకింది. బాల్ వేగానికి హెల్మెట్ బ్యాడ్జ్ విరిగిపోయింది. వెంటనే హర్షిత్ రాణా స్టార్క్‌కు వద్దకు వెళ్లి ఏమైనా గాయమైందేమోనని కంగారుపడుతూ అడిగాడు. స్టార్క్ ఓకే అని చెప్పడంతో రిలాక్స్ అయ్యాడు.
ఇక రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తన బ్యాటింగ్ తో ఆసీస్ కు విసుగు తెప్పించాడు. ఇదే క్రమంలో తన మాటలతోనూ వారితో ఓ ఆటాడుకున్నాడు. బౌలింగ్‌కు వచ్చిన మిచెల్ స్టార్క్‌ను యశస్వీ జైస్వాల్ కవ్వించాడు. స్టార్క్.. నువ్వు నాకు చాలా స్లోగా బంతులు వేస్తున్నావంటూ టీజ్ చేశాడు. జైస్వాల్ మాటలకు స్టార్క్ సమాధానం ఇవ్వకుండా నవ్వుతూ తిరిగి బౌలింగ్ కు వెళ్ళిపోయాడు. హర్షిత్ రాణాను ఉద్దేశించి స్టార్క్ చేసిన కామెంట్స్ కు కౌంటర్ గానే జైశ్వాల్ స్టార్క్ ను టీజ్ చేసినట్టు అర్థమవుతోంది. మొత్తం మీద నీవు నేర్పిన విద్యయే కదా అంటూ వారి స్లెడ్జింగ్ మంత్రాన్ని వారిపైనే భారత్ క్రికెటర్లు ప్రయోగిస్తున్నారు.