Pawan Kalyan: పవన్‌ పోటీ చేయబోయే స్థానం ఇదేనా.. జనసేనాని ఫిక్స్ అయిపోయారా ?

ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఒక లెక్క.. వారాహి కదులుతుంది.. ప్రభంజనం మొదలవుతుంది అంటూ.. పవన్ జోరు మీద కనిపిస్తున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలుసు అన్నట్లు వ్యూహాలు రచిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - June 13, 2023 / 02:26 PM IST

జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఎంత దూరం అయినా వస్తా.. జనంలోనే ఉంటా.. జనంలానే ఉంటా అంటూ.. వారాహి యాత్రకు సిద్ధం అవుతున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. పవన్ పోటీ చేయబోయే స్థానం ఏంటి అన్నది చాలా రోజుల నుంచి అభిమానులు, కార్యకర్తలను వేధిస్తున్న ప్రశ్న. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్‌.. పరాజయం మూటగట్టుకున్నారు. మళ్లీ అక్కడి నుంచే ఆయన పోటీ చేస్తారా.. లేదా కొత్త నియోజకవర్గంపై కన్నేస్తారా అనే చర్చ జరుగుతున్న వేళ.. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరికేసిందనే టాక్ వినిపిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో ప్రయోగాలు ఉండవని పవన్ క్లారిటీ ఇచ్చారు. ప్రకాశం నుంచి గోదావరి జిల్లాల వరకు పార్టీ బలం పెరిగిందని ఓ అంచనాకు వచ్చేశారు. టీడీపీ, బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలనేది పవన్ వ్యూహం. పొత్తుపైన తన అభిప్రాయం ఏంటో క్లారిటీ ఇచ్చేసిన పవన్.. బంతిని ఆ రెండు పార్టీల కోర్టులోకి నెట్టేశారు. ఇప్పుడు తాను పోటీ చేయబోయే స్థానంపై దృష్టి సారించారు. పార్టీ బలం ఏంటి.. తన బలం ఏంటి అని తెలుసుకునేందుకు సర్వే సంస్థలను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ రిపోర్టులు అందాయని.. తాను పోటీ చేయబోయే స్థానం గురించి పవన్ ఓ క్లారిటీకి వచ్చేశారని తెలుస్తోంది.

గోదావరి జిల్లాలతో పాటు.. రాయలసీమ నుంచి.. ఈసారి కూడా రెండు స్థానాల్లో పవన్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయ్. అందుకే గోదావరి జిల్లాల నుంచి వారాహి యాత్ర మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. పిఠాపురం, కాకినాడ రూరల్‌ నుంచి పవన్ పోటీ చేస్తారని మొదట్లో ప్రచారం జరిగినా.. ప్రత్తిపాడు వైపు పవన్ చూస్తున్నారని తెలుస్తోంది. మేకతోటి సుచరిత అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. జనసేన, టీడీపీ వేరుగా పోటీ చేయడం వల్ల కోల్పోయిన నియోజకవర్గాల్లో ప్రత్తిపాడు ఒకటి. ప్రత్తిపాడులో జనసేన ఓటు బ్యాంక్ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ ఈ నిర్ణయానికి వచ్చారనే ప్రచారం జరుగుతోంది.

దీంతో పాటు తిరుపతి నుంచి కూడా పవన్ పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. గతంలో చిరు ఇక్కడి నుంచే అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. టీడీపీతో పొత్తులో ఉంటే.. ఈ నిర్ణయం మారే చాన్స్ ఉంటుంది. మొత్తం మీద.. పిఠాపురం, కాకినాడ రూరల్, తాడేపల్లిగూడెం, అవనిగడ్డ, తిరుపతితో పాటు.. గతంలో పోటీ చేసిన భీమవరం, గాజువాక మీద కూడా పవన్ ప్రత్యేకంగా నజర్ పెట్టారు. ఇందులో ఏది ఫైనల్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వారాహి యాత్రలోనే దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని.. జనసేన వర్గాలు చెప్తున్నాయ్.