పార్టీ స్థాపించిన పదేళ్ళ తర్వాత అధికారంలో ఉండటంతో… జనసేన (Janasena) కార్యకర్తలు, పవన్ అభిమానులు (Pawan fans) సంబురాలు చేసుకుంటున్నారు. వంద శాతం స్ట్రైక్ రేట్ తో 21 స్థానాలకు 21 స్థానాలు గెలిచి అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా జనసేన ఉండటం, కూటమిలో కీలక పార్టీగా ఉండటం, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడం ఇలా ఎన్నో ఎన్నో ఆ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు మంచి జోష్ ఇస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీలో మంత్రి హోదాలో చూస్తున్న మెగా అభిమానులు అయితే తమ చిరకాల కోరిక నెరవేరింది అంటూ పొంగిపోతున్నారు.
ఈ తరుణంలో జనసేన పార్టీ (Jana Sena Party) సభ్యత్వాలు జోరు అందుకున్నాయి. ఆ పార్టీలో జాయిన్ అయిన సభ్యుల సంఖ్య ఒక మిలియన్ దాటింది. దీనిపై ఆ పార్టీ అధికారిక ప్రకటన చేసింది. పదేళ్ళ క్రితం ఒక్కడితో మొదలైన జనసేన ప్రస్తానం నేడు పది లక్షల క్రియాశీలక జనసేన సైనికులతో ముందుకు సాగుతోంది అని ఆ పార్టీ పేర్కొంది. క్రియాశీల సభ్యత్వ నమోదు గడువును మరో వారం పాటు పెంచుతున్నామని పార్టీ అధికారిక ప్రకటన చేసింది. 2014 మార్చ్ లో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్థాపించారు. 2019 లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది.
ఈ పదేళ్ళలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తన భార్యపై కూడా వైసీపీ (YCP) నేతలు కామెంట్స్ చేయడం… రాజకీయాలపై ఆసక్తి లేని వారిని కూడా కన్నీరు పెట్టించిన అంశం. 2019 లో ఆయన రెండు స్థానాల్లో పోటీ చేసి రెండు స్థానాల్లో ఓటమి పాలైనా కూడా ఎక్కడా ప్రభుత్వానికి భయపడి దాక్కోలేదు. దీనితో కార్యకర్తలు కూడా మరింత ఉత్సాహంతో పని చేసారు. పిఠాపురం (Pithapuram) లో పవన్ కళ్యాణ్ ను70 వేల పై చిలుకు మెజారిటీతో గెలిపించారు. ఇక పాలనపై పవన్ కళ్యాణ్ పట్టు పెంచుకుంటున్నారు. జనసేన పార్టీ మంత్రులు కూడా తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని, ఎమ్మెల్యేలు బాధ్యతగా పని చేయాలని పవన్ చెప్తూ వస్తున్నారు.