PAWAN KALYAN: ఏపీపై ఫోకస్ పెంచిన జనసేన.. డిసెంబర్ 1న జనసేన విస్తృత స్తాయి సమావేశం..

ఏపీలో ఎన్నికలకు కూడా మరో నాలుగు నెలలే గడువుంది. ఈలోపే పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఏపీలోనూ రాజకీయ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ సామాజిక యాత్ర పేరుతో ప్రజల్లో ఉంటోంది. యువగళం పాదయాత్ర ద్వార లోకేష్‌ కూడా జనంలో తిరుగుతున్నారు.

  • Written By:
  • Publish Date - November 29, 2023 / 05:14 PM IST

PAWAN KALYAN: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార పర్వం పూర్తి కావడంతో జనసేన పార్టీ ఏపీపై దృష్టిపెట్టింది. ఈ మేరకు డిసెంబర్ 1న జనసేన విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశానికి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుతోపాటు పార్టీ పిఏసీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా, నగర అధ్యక్షులు, నియోజకవర్గాల బాధ్యులు, అనుబంధ విభాగాల ఛైర్మన్లు, వీర మహిళా విభాగం నేతలు, అధికార ప్రతినిధులు హాజరవుతారని జనసేన ఒక ప్రకటనలో తెలిపింది.

ASSEMBLY ELECTIONS: కారుకి కలిసొస్తున్న 20 సీట్లు.. ఓట్లు చీల్చిపెడుతున్న కమలం

శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. కొద్ది రోజులుగా జనసేన.. తెలంగాణ ఎన్నికలపైనే ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. బీజేపీతో పొత్తు చర్చలు, జనసేన అభ్యర్థుల ఎంపిక, ప్రచారం.. ఇలా అనేక కార్యక్రమాల్లో జనసేన భాగమైంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించారు. ప్రధాని మోదీతో సభల్లోనూ పాల్గొన్నారు. అయితే, తెలంగాణలో ప్రచారం ముగియడంతో ఏపీపై దృష్టిపెట్టింది జనసేన. ఏపీలో ఎన్నికలకు కూడా మరో నాలుగు నెలలే గడువుంది. ఈలోపే పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఏపీలోనూ రాజకీయ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ సామాజిక యాత్ర పేరుతో ప్రజల్లో ఉంటోంది. యువగళం పాదయాత్ర ద్వార లోకేష్‌ కూడా జనంలో తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జనసేన కూడా అదే మార్గంలోకి వెళ్లాల్సిన అసవరం ఉంది.

త్వరలో చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి చర్చలు జరపనుంది. అలాగే ఏపీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అంశంపై అధ్యక్షుడు దిశానిర్దేశం చేయనున్నారు. టీడీపీతో సమన్వయం, ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఓటర్ల జాబితాలు పరిశీలన తదితర విషయాలపై కూడా చర్చిస్తారు. ప్రస్తుతం ఏపీలో జనసేన-టీడీపీ అధికారికంగా పొత్తు ప్రకటించిన సంగతి తెలిసిందే.