జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ ను వైజాగ్ పోలీసలు అరెస్ట్ చేశారు. విశాఖలోని నొవాటెల్ హెటల్ వద్ద ఆందోళన చేస్తున్న మనోహర్ ను, జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సెక్షన్ 30 అమలులో ఉండటంతో.. జనసేన ధర్నాకు అనుమతి లేదని పోలీసులు చెప్పుకొచ్చారు.
విశాకలో టైకూన్ కూడలిలో రోడ్డు మూసివేతను నిరసిస్తూ జనసేన నేత మనోహర్ ఆధ్వర్యంలో లో జనసేన ధర్మా చేసింది. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రియలెస్టేట్ వ్యాపారంలో భాగంగా నిర్మిస్తున్న కట్టడానికి వాస్తు బాగోలేదని రోడ్డును మూసేశారని ఈ సందర్భంగా మనోహర్ మండిపడ్డారు. వైసీపీ నేతల నిర్మాణాలకు వాస్తు దోషం ఉంటే రోడ్లను మూసేస్తారా? అని ప్రశ్నించారు. శాంతియుతంగా, ట్రాఫిక్ కు అడ్డు లేకుండా నిరసన తెలుపుతామని పోలీసులకు వినలేదు. ప్రజా సమస్యలు తీర్చమంటే నిర్బంధం ఎందుకు..? నిరసన తెలపకుండా అడ్డుకోమని చెప్పిన నియంతలు ఎవరు..? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని మనోహర్ ప్రశ్నించారు. నోవాటెల్ గేటు వద్దనే బైఠాయించి నిరసన.. తెలుపుతున్న మనోహర్ ను పోలీసులు అరెస్టు చేసి తమ వాహనంలో తరలించారు. ప్రజా సమస్యలను తీర్చాల్సిన ప్రభుత్వమే సమస్యలను సృష్టిస్తుంటే.. వాటి కోసం విపక్షాలు పోరాడాల్సిన విచిత్ర పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. విశాఖపట్నం నగర వాసులకు ఎంతో అవసరమైన టైకూన్ జంక్షన్ ను మూసి వేసి, ప్రజలకు లేనిపోని సమస్యలు తెచ్చి పెట్టిన ప్రభుత్వం ఎవరి కోసం ఇంత నాటకం ఆడుతుందో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
“ఇప్పటికే జనసేన పార్టీ ఈ సమస్యపై నాలుగుసార్లు నిరసన తెలిపినా అధికారుల నుంచి ఏ మాత్రం స్పందన రాలేదు. వినతి పత్రాలు ఇచ్చినా చలనం లేదు. ప్రజా సమస్యలపై పోరాడితే అడ్డుకోమని పోలీసులతో చెప్పింది ఎవరు..? విశాఖపట్నం వచ్చిన ప్రతిసారీ పోలీసులతో నిర్బంధ కాండ కొనసాగిస్తున్న ప్రభుత్వం తన అప్రజాస్వామిక పంథా వీడే వరకు పోరాటం చేస్తాం.. రోడ్డుపై నిలుచుని శాంతియుతంగా ఐదు నిమిషాలు నిరసన తెలిపే హక్కు కూడా లేకపోతే ఇంక ప్రజాస్వామ్యం ఎందుకు..? మూడు నెలల్లో మారిపోయే ఈ ప్రభుత్వం మాటలను వినాల్సిన అవసరం లేదు అని అధికారులు కూడా గుర్తుంచుకోవాలి. టైకూన్ కూడలి సమస్య తీరే వరకు జనసేన పార్టీ చివరి వరకు పోరాడుతుంది” అన్నారు.