Jaya Bachchan: ‘‘అలాగైతే.. సీనియర్ సిటిజెన్లను చంపేయండి’’.. రాజ్యసభలో జయాబచ్చన్ సంచలన వ్యాఖ్యలు

సీనియర్ సిటిజన్స్ గురించి గళం విప్పిన జయ బచ్చన్. 65 ఏళ్లు దాటిన వారిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్రాన్ని నిలదీస్తూ కొన్ని డిమాండ్లు చేశారు.

  • Written By:
  • Publish Date - September 23, 2023 / 12:53 PM IST

మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఎంపీ జయా బచ్చన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ సిటిజన్ల సమస్యలపై ఆమె గళం విప్పారు. ‘‘భారతదేశంలో సీనియర్ సిటిజెన్ గా ఉండటం నేరమా? పట్టించుకునే పరిస్థితి లేనప్పుడు.. ప్రభుత్వం సీనియర్ సిటిజెన్స్ అందరినీ చంపాలి. 65 ఏళ్ల తర్వాత పౌరుల కోసం ఒక్క వెల్ఫేర్ స్కీమ్ ను కూడా భారత ప్రభుత్వం అమలు చేయడం లేదు. వాళ్లు లెక్కలోకి రారా?’’ అని జయా బచ్చన్ ప్రశ్నించారు. ‘‘దేశంలోని సీనియర్ పౌరులు 70 సంవత్సరాల తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్ కు అర్హులు కాదు.. వాళ్లు ఈఎంఐపై లోన్స్ పొందలేరు. డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందలేరు. వారికి ఏ పనీ ఇవ్వరు.. అందువల్ల వారు మనుగడ కోసం ఇతరులపై ఆధారపడి బతకాల్సి వస్తోంది. పదవీ విరమణ వయస్సు (60-65 ఏళ్ల ఏజ్) వరకు అన్ని పన్నులు, బీమా ప్రీమియంలు చెల్లించిన సీనియర్ సిటిజెన్స్ కు ఇంత అన్యాయం జరుగుతోంది. సంక్షేమ పథకాలు, సడలింపులు లేకున్నా.. వారు అన్ని రకాల పన్నులు చెల్లించాల్సి వస్తోంది’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.,

పెద్దలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళితే..

‘‘రైల్వే, విమాన ప్రయాణాల్లో సీనియర్ సిటిజెన్స్ కు అందించే 50 శాతం రాయితీని కూడా కేంద్ర సర్కారు ఆపేసింది. ఇక ఇదే సమయంలో రాజకీయాలలో ఉన్న సీనియర్ సిటిజెన్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు, మంత్రులకు మాత్రం అన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారు. వారికి పెన్షన్లు కూడా లభిస్తున్నాయి. సాధారణ సీనియర్ సిటిజెన్స్ కు మాత్రం అన్యాయం జరుగుతోంది’’ అని జయా బచ్చన్ చెప్పారు. ‘‘దేశంలోని పెద్దలు ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళితే అది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుంది. పరిణామాలను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని ఆమె సర్కారుకు వార్నింగ్ ఇచ్చారు. ‘‘బ్యాంకుల వడ్డీ రేట్ల తగ్గింపు కారణంగా సీనియర్ పౌరుల ఆదాయం కూడా తగ్గుతోంది. అది కూడా ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది. కాబట్టి సీనియర్ పౌరుల ప్రయోజనాలపై సర్కారు ఫోకస్ పెట్టాలి’’ అని జయా బచ్చన్ తెలిపారు.

కేంద్రానికి జయాబచ్చన్ డిమాండ్లు ఇవీ..

* 60 ఏళ్లు పైబడిన పౌరులందరికీ తప్పనిసరిగా పెన్షన్ ఇవ్వాలి.
* ప్రతి ఒక్కరికీ హోదా ప్రకారం పింఛన్‌ ఇవ్వాలి.
* రైల్వే, బస్సు, విమాన ప్రయాణాలలో రాయితీ కల్పించాలి.
* తుదిశ్వాస వరకు అందరికీ ఆరోగ్య బీమా తప్పనిసరిగా ఉండాలి. ప్రీమియంను నేరుగా ప్రభుత్వమే చెల్లించాలి.
* సీనియర్ సిటిజెన్ లతో ముడిపడిన కోర్టు కేసుల విచారణ వేగంగా జరిగేలా చూడాలి.
* అన్ని సౌకర్యాలతో ప్రతి నగరంలో సీనియర్ సిటిజెన్ హౌస్ లను నిర్మించాలి.
* 10 -15 ఏళ్ల పాత కార్లను రద్దు చేసే నిబంధనను ప్రభుత్వం సవరించాలి. ఈ నిబంధన కేవలం వాణిజ్య వాహనాలకు మాత్రమే వర్తింపజేయాలి.