JD Lakshminarayana : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పార్టీని ప్రకటించారు. జై భారత్ పార్టీ (Jai Bharath) పేరుతో ఈసారి ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోటీలోకి దిగుతున్నారు. గత ఏడాదే ఈ పార్టీని రిజిస్ట్రేషన్ చేయించారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేయాలని నిర్ణయించారు. జై భారత్ పార్టీ తరపునే ఆయన బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన నుంచి వైజాగ్ ఎంపీగా లక్ష్మీనారాయణ పోటీ చేసి ఓడిపోయారు. పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తున్నారన్న కారణంతో జనసేనకు రిజైన్ చేశారు. కొంతకాలం అక్కడే ఉండి… రైతు, ప్రజా సమస్యలు, యువత ఓటింగ్ పై అవగాహన కల్పించారు. విశాఖలోనే మళ్లీ పోటీ చేస్తానని జేడీ ప్రకటించినా… ఏ పార్టీ నుంచి అన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఏపీలో ఏ పార్టీ నుంచి కూడా జేడీకీ ఆహ్వానం అందలేదు కూడా… విశాఖ లోక్ సభకు ఆయా పార్టీల్లో అభ్యర్థులు ఉండటంతో.. ఆయన్ని ఎవరూ పట్టించుకోలేదు.
తెలంగాణ ఎన్నికల ముందు జేడీ లక్ష్మీనారాయణ అనేక సందర్భాల్లో కేసీఆర్ సర్కార్ ను పొగిడారు. దాంతో ఆయన్ని ఏపీ BRS చీఫ్ చేస్తారన్న ప్రచారం నడిచింది. చర్చలు కూడా జరిగాయి. కానీ తాను బీఆర్ఎస్‌లో చేరడం లేదని జేడీ ప్రకటించారు. శ్రీశైలంలో ఓ కార్యక్రమానికి వెళ్లినప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని పొగిడారు. దాంతో లక్ష్మీనారాయణ వైసీపీలో చేరతారన్న ప్రచారం కూడా జరిగింది. తాను ఏ పార్టీకి సపోర్ట్ ఇవ్వడం లేదని క్లారిటీ ఇచ్చారు. చివరికి జై భారత్ పేరుతో సొంత పార్టీని పెట్టారు జేడీ లక్ష్మినారాయణ.
జై భారత్ పార్టీతో జేడీ లక్ష్మీనారాయణ… ఏపీ అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల్లో అన్నింటిలోనూ తమ అభ్యర్థులను దింపుతారా? లేదంటే… ఆయన ఒక్కరే విశాఖ ఎంపీగా పోటీ చేస్తారా అన్నది ఇంకా తెలియలేదు. జేడీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారనీ.. అందుకే జై భారత్ పార్టీలో అందరికీ అవకాశం ఉండదని అంటున్నారు.