తెలంగాణలో మహబూబ్‌నగర్ పార్లమెంట్‌లో ట్రయాంగిల్ ఫైట్ ఆసక్తి రేపుతోంది. మరి ఇందులో విజేతలు ఎవరు.. అసెంబ్లీ ఎన్నికల్లో పాలమూరును క్లీన్‌స్వీప్ చేసిన కాంగ్రెస్ గెలుస్తుందా.. మోదీ మ్యాజిక్ పనిచేస్తుందా.. మళ్లీ బరిలో నిలిచిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పరిస్థితేంటి.. గెలుపుపై ఎవరి లెక్కలు ఏంటి.. మహబూబ్‌నగర్‌లో నెగ్గేదెవరు…
మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానంలో.. ఈసారి గెలుపెవరిదనేది హాట్‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ… గెలుపుపై ఎవరి లెక్కలు వారివే. కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, బీఆర్ఎస్ తరఫున సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. మొదటి నుంచి త్రిముఖ పోరు సాగుతుందని లెక్కలేసిన విశ్లేషకులు… తీరా పోలింగ్ నాటికి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ నడిచిందని తేల్చేశారు. పోటీలో మేమున్నామంటూ చెప్పుకొచ్చిన గులాబీ పార్టీ… పోలింగ్‌కు ముందే చేతులెత్తేసినట్లు ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్న పరిస్థితి. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, కొడంగల్, నారాయణపేట, మక్తల్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కూడా ఈ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. దీంతో ఈ స్థానాన్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హస్తం పార్టీ ఎమ్మెల్యేలే ఉండటం, అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు జరగడం.. రేవంత్ సొంత జిల్లా కావడం తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. అభివృద్ధి.. ఎన్నికల్లో ప్రధాన అంశాలు మారాయి. ఈ పార్లమెంట్ స్థాంలో 2014లో 72.92 శాతం, 2019లో 65.39 శాతం పోలింగ్… ఈ ఎన్నికల్లో 71 .54 శాతం పోలింగ్ నమోదయింది. అభివృద్ధి అంశమే.. ఈ ఎన్నికల్లో ప్రధాన అజెండాగా కనిపించింది. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల మంజూరు.. సంగంబండ కాలువ అడ్డంకుల తొలగింపు వంటి వాటిని జనాల్లోకి తీసుకెళ్లింది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి తెలంగాణ సారథి… తాను ఢిల్లీకి వారధినంటూ వంశీచంద్ రెడ్డి ప్రచారం చేశారు. సీఎం రేవంత్ కూడా ఈ సెగ్మెంట్‌లో 9సార్లు పర్యటించారు.
బీజేపీ తరఫున పోటీ చేసిన డీకే అరుణ.. టికెట్ రాకముందే నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. మోదీ మేనియా, కేంద్ర ప్రభుత్వ పథకాలు, అయోధ్య టెంపుల్‌లాంటి ఇష్యూస్‌తో.. ఔర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ జనాల్లోకి వెళ్లారు. అర్బన్ ఓటింగ్ తమకు కలిసొస్తుందని జేజమ్మ అంచనా వేస్తున్నారు. వివిధ రకాల సమీకరణాలతో గెలుపు పక్కా అని ధీమాతో కనిపిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆలస్యంగా ప్రచారం ప్రారంభించిన బీఆర్ఎస్ అభ్యర్ది మన్నె శ్రీనివాస్ రెడ్డి… మాజీ ఎమ్మెల్యేలను కూడగట్టుకోని విస్త్రతంగా పర్యటించారు. బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలను జనాలకు వివరించారు. అయితే ఆయా నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు చేతులెత్తేసి.. బీజేపీకి ఓట్లు వేయించినట్లు లోకల్‌గా టాక్ వినిపిస్తోంది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్‌ది నామమాత్రం పోటీనేనన్న విశ్లేషణలు ఉన్నాయ్. కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లు రసవత్తరమైన పోరు సాగింది. గెలుపుపై ఎవరికి వారు ధీమాతో ఉన్నా… ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీ వస్తుందని అంటున్నారు. అభివృద్ధి మాత్రం తమను గట్టెక్కిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. సీఎం సొంత నియోజకవర్గం కూడా ఈ పార్లమెంట్ పరిధిలో ఉండటంతో గెలుస్తామన్న ధీమాలో ఉంది. కొడంగల్, జడ్చర్ల, షాద్‌నగర్, దేవరకద్ర నియోజకవర్గాల్లో మెజారిటీ సాధిస్తామని హస్తం పార్టీ శ్రేణులు లెక్కలు వేసుకుంటున్నాయ్. ఈ రసవత్తర పోరులో కమలానికి, గులాబీ బాసటగా నిలించిందని హస్తం పార్టి నేతలు ఆరోపిస్తున్నారు. అనైతిక రాజకీయంతో తమ గెలుపును ఆపలేరని తేల్చేస్తున్నారు. పెద్ద మెజారిటీ రాకపోయిన 10 నుంచి 20వేలతో గెలుస్తామని చెప్పుకొస్తున్నారు.
ఇక అటు మక్తల్, నారాయణపేట, మహబూబ్‌నగర్ నియోజకవర్గాల్లో తమకు ఆధిక్యం వస్తుందని…. ఇతర నియోజకవర్గాల్లోని అర్బన్ ఓటింగ్ కూడా కలిసి వస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని…. భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమాతో ఉన్నారు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ. ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లీడ్ వస్తుందని అంటుంటే… నాలుగు నియోజకవర్గాల్లో లీడ్ వస్తుందని బీజేపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. ఏది ఏమైనా నువ్వా నేనా అన్నట్లు సాగిన మహబూబ్‌నగర్ పోరులో.. ఎవరు గెలుస్తారన్న దానిపై ఆసక్తి రేపుతోంది.