తెలంగాణలో ఎన్నికల హడావుడి ముగిసింది. దీంతో ఇక పాలన మీద నజర్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిలో భాగంగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టారు. ఇప్పటికే పలు శాఖలకు కొత్త చీఫ్ సెక్రటరీలను నియమించారు. ఇప్పుడు రాష్ట్రానికి కొత్త డీజీపీని నియమించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వరకు తెలంగాణ డీజీపీగా అంజనీ కుమార్ ఉండగా.. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయన స్థానంలో రవిగుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది.
ఐతేఇప్పుడు రవిగుప్తా స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్‌ను డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రేవంత్ సర్కార్. రవిగుప్తాను హోంశాఖ స్పెషల్ సీఎస్‌గా పంపించారు. ఐతే డీజీపీ జితేందర్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. ఆయన ట్రాక్ రికార్డు ఏంటి అని నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. జితేందర్ స్వస్థలం పంజాబ్‌లోని జలంధర్. సామాన్య రైతు కుటంబంలో జన్మించిన జితేందర్.. 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. శిక్షణ తర్వాత ఏపీ కేడర్‌కు ఎంపికైన జితేందర్.. మెుదటి పోస్టింగ్‌లో నిర్మల్ ఏఎస్పీగా పనిచేశారు.
ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్‌నగర్‌తో పాటు గుంటూరు జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తించారు. అనంతరం డిప్యూటేషన్‌పై ఢిల్లీ సీబీఐలో, 2004 నుంచి 2006 వరకు గ్రేహౌండ్స్‌లో విధులు నిర్వహించారు. ఆ తర్వాత డీఐజీగా ప్రమోషన్ పొంది… విశాఖపట్నం రేంజ్ డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. అప్పాలో కొంతకాలం పని చేసిన జితేందర్.. తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగానూ కొనసాగారు. ఏపీ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ నగర కమిషనరేట్‌లో ట్రాఫిక్ అదనపు కమిషనర్‌గానూ విధులు నిర్వర్తించారు.
తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్లశాఖ డీజీగానూ పనిచేశారు. ప్రస్తుతం ఆయన డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గానూ జితేందర్ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2025 సెప్టెంబరులో జితేందర్ పదవీ విరమణ ఉండగా.. ఇప్పుడు డీజీపీగా నియమితులైతే 14 నెలలపాటు కొనసాగే ఛాన్స్ ఉంటుంది. ఇక అటు డీజీపీతో పాటు పలువురు సీనియర్ ఐపీఎస్‌లకు కూడా స్థానచలనం కల్పిస్తూ.. రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.