Narendhra Modi: మోదీ టూర్‌కు అమెరికా ఎందుకంత ప్రాధాన్యత ఇస్తోంది ? ఎవరి అవసరం ఎవరికి ఎక్కువగా ఉంది ?

ప్రధానమంత్రి మోదీ అమెరికా వెళ్లారు..అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు.. అధ్యక్షుడు సహా ఎంతో మందిని కలుస్తారు.. అయితే ఇందులో కొత్తేముంది ? మోదీ గతంలోనూ అమెరికా వెళ్లారు కదా..! 2014లో ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటికే ఆరుసార్లు అమెరికా వెళ్లివచ్చారు.. బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మొత్తం ముగ్గురు అధ్యక్షులను కూడా కలిశారు.

  • Written By:
  • Publish Date - June 20, 2023 / 04:31 PM IST

ఎన్నో ప్రసంగాలు కూడా చేశారు.. మరి మళ్లీ మోదీ అమెరికా వెళితే ప్రపంచం మొత్తం దీని గురించే ఎందుకు చర్చ జరుగుతోంది ? దేశాధినేతలన్న తర్వాత విదేశాల్లో పర్యటించడం.. ఆ దేశాధినేతలతో ద్వైపాక్ష అంశాలపై చర్చలు జరపడం.. ఒప్పందాలు కుదుర్చుకోవడం సహజంగా జరిగేదే కదా..! ప్రస్తుత మోదీ పర్యటన అలాంటిది కాదా ? కచ్చితంగా కాదనే చెప్పాలి.. ఇంకా వివరంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇకపై మరో లెక్కలాంటిది మోదీ అమెరికా టూర్. గతంలో ఆయన చేసిన అమెరికా పర్యటనలకు ఇప్పుడు చేస్తున్న పర్యటనకు చాలా తేడా ఉంది.

స్టేట్ విజిట్ ఆహ్వానంపై తొలిసారిగా అమెరికాకు మోదీ
ప్రధానమంత్రి మోదీ అమెరికా పర్యటనను ఖరారు చేస్తూ మే 10న వైట్‌హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. అధ్యక్షుడు బైడెన్… ఫస్ట్ లేడీ మోదీని అఫిషియల్ స్టేట్ విజిట్ కోసం అమెరికాకు ఆహ్వానిస్తున్నట్టు అందులో ఉంది. ఇలాంటి స్టేట్ విజిట్ ఆహ్వానం అమెరికా నుంచి చాలా అరుదుగా అందుతూ ఉంటాయి. మోదీ గతంలో అమెరికాలో చేసిన పర్యటనలన్నీ కేవలం అధికారిక పర్యటనలు మాత్రమే. అవి స్టేట్ విజిట్స్ కావు. ప్రస్తుతం జరుగుతున్న పర్యటన మాత్రమే స్టేజ్ విజిట్.

అధికారిక పర్యటనకు స్టేట్ విజిట్‌కు తేడా ఏంటి ?
ఏదైనా ఒక దేశంతో ద్వైపాక్షిక సంబంధాన్ని గతంలో ఎప్పుడూ లేని విధంగా బలోపేతం చేసుకోవడానికి లేదా మిగతా దేశాలకంటే ఆ దేశానికి ఇకపై అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అమెరికా అధ్యక్షులు భావించినప్పుడు మాత్రమే స్టేట్ విజిట్ ఇన్విటేషన్‌ను పంపుతారు. అధికారిక పర్యటనల కోసం అమెరికాలో అడుగుపెట్టిన తర్వాత లభించే స్వాగత సత్కారాలకు స్టేట్ విజిట్ వెల్‌కమ్‌పూర్తి భిన్నంగా ఉంటుంది. శ్వేతసౌధంలో 7వేల మంది ఇండో అమెరికన్ అతిథుల సమక్షంలో సౌత్ లాన్‌లో 21 గన్నుల సెల్యూట్‌‌తో మోదీకి బైడెన్ నుంచి స్వాగతం లభిస్తుంది. వైట్‌హౌస్‌లో ప్రధమ పౌరుడు, ప్రధమ పౌరురాలు ఇద్దరూ కలిపి… మోదీకి డిన్నర్ ఇస్తారు. అధికారిక పర్యటన ఖరారు కాకముందే దీని కోసం శ్వేతసౌధంలో ఏర్పాట్లు జరుగుతాయి.

ఎవరినైనా స్టేట్‌విజిట్‌కు ఆహ్వానిస్తారా ?
స్టేట్ విజిట్ ఆహ్వానం అందరికీ అందదు. దానికి కూడా కొన్ని లెక్కలున్నాయి. అమెరికా అధ్యక్షుడు తన పదవీకాలంలో అంటే నాలుగేళ్ల సమయంలో ఒకే ఒక్కరిని స్టేట్ విజిట్ ఆహ్వానం పంపగలరు. అమెరికన్ డిప్లొమెటిక్ పాలసీలో ఈ నిబంధన ఉంది. అవసరాన్ని బట్టి దీన్ని కాస్త అటుఇటుగా సవరించి ఒకరిద్దరికి ఆహ్వానం పంపుతారు. కానీ అది అరుదుగా జరుగుతుంది. అమరికాలో దృష్టిలో అఫీషియల్ విజిట్స్ అంటే వాటికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. ప్రొటోకాల్ ప్రకారం అవి జరిగిపోతూ ఉంటాయి. అతిథులకు స్వాగత సత్కారాల నుంచి.. ద్వైపాక్షికంగా కుదుర్చుకునే ఒప్పందాలు.. రెండు దేశాల మధ్య జరిగే చర్చల వరకు స్టేట్ విజిట్‌కు అమెరికా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. కేవలం ఫోటోల కోసం ఫోజులు ఇవ్వకుండా ప్రాక్టికల్‌గా అనేక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు.

మోదీని స్టేట్ విజిట్‌కు ఎందుకు పిలిచారు ?
కాలం మారుతోంది.. ఎల్లకాలం ప్రపంచంపై అమెరికా పెత్తనమో.. రష్యా పెత్తనమో.. చైనా ఆధిపత్యమో సాగదు. ఒకప్పుడు మనల్ని చిన్నచూపు చూసిన దేశాలే ఇప్పుడు మనతో స్నేహం కోసం చేయిజాపుతున్నాయి. అన్ని రంగాల్లోనూ ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా భారత్ ఎదుగుతున్న తీరును అగ్రరాజ్యాలు గమనిస్తూనే ఉన్నాయి. సంక్షోభ సమయాల్లో భారత్ అనుసరించే విధానాలు, ప్రజాస్వామ్య దేశంగా స్వతంత్రంగా వ్యవహించే తీరు ఇప్పటికే ప్రపంచ దేశాలకు తెలిసొచ్చింది. ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా ఎంత ఒత్తిడి చేసినా.. పశ్చిమ దేశాలు విమర్శలు గుప్పించినా.. న్యూఢిల్లీ తన వైఖరి మార్చుకోలేదు. ఎవరి పక్షాన నిలబడకుండా.. యుద్ధాన్ని పూర్తిగా వ్యతిరేకించింది. చర్చలు, శాంతి ద్వారా మాత్రమే దేనికైనా పరిష్కారం లభిస్తుందన్న వసుదైక కుటుంబ సిద్ధాంతాన్ని చెప్పకనే చెప్పింది. ఓవైపు అమెరికా.. మరోవైపు రష్యా.. రెండు మిత్రదేశాలే… ఆ రెండు దేశాలు ఉక్రెయిన్‌కు తలోవైపు నిలబడినప్పుడు భారత్ మాత్రమే వ్యూహాత్మకంగా అడుగులు వేయగలిగింది. అమెరికా సహా పశ్చిమ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేసినా.. రష్యాపై తీవ్ర విమర్శలు గుప్పించకుండా అతి తక్కువకే ఆదేశం నుంచి ముడిచమురు కొనుగోలు చేయగలిగింది. భారత్‌కు అమెరికా అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి ఇలాంటి కారణాలు చాలా ఉన్నాయి. అంతేందుకు నాటో ప్లస్ దేశాల కూటమిలో భాగస్వామ్యం కావాలంటూ అమెరికా చేసిన ప్రతిపాదనను భారత్ తిరస్కరించింది. తాము పాటిస్తున్న స్వతంత్ర దౌత్య విధానానికి ముగింపు పలుకుతూ పశ్చిమ దేశాలకు చెందిన ఎలాంటి కూటముల్లోనూ చేరే ఉద్దేశం భారత్‌కు లేదని తేల్చి చెప్పింది

నాడు కాదు పొమ్మన్నారు.. నేడు రెడ్‌కార్పెట్ వేశారు
ఒక్కసారి చరిత్రలోకి వెళితే.. కార్గిల్ వార్‌తో పాటు బంగ్లాదేశ్ లిబరేషన్ పోరాటం సమయంలో అమెరికా భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించింది. 1999లో పాక్ దళాలు.. హిమాలయాల్లో కీలక ప్రాంతాల్లో తిష్టవేసినప్పుడు.. ఆ లొకేషన్‌ను తెలుసుకునేందుకు భారత్ అమెరికా సాయం కోరింది. GPS డేటా కోసం అభ్యర్థించింది. కానీ అమెరికా మనకు సాయం చేయలేదు. సీన్ కట్ చేస్తే.. ప్రస్తుతం భారత్ తన సొంత జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటోంది. ఈ ఒక్క విషయంలోనే కాదు ఇతర దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తూనే.. అమెరికా సహా ఏ దేశం పైనా ఆధారపడాల్సిన అవసరం లేకుండా భారత్ తన కాళ్లపై తాను నిలబడగలిగే స్థాయికి ఎదుగుతూ వచ్చింది. అమెరికా చైనాతో పోటీపడుతూ సొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటుంది. ఇంకా చెప్పాలంటే.. అమెరికా వెలుపల వ్యాపారం చేయడానికి ఆదేశ మల్టీనేషనల్ కంపెనీలకు ఇప్పుడు ఏకైక డెస్టినేషన్‌గా భారత్ మారింది.

మోడీ.. బైడెన్.. అండ్ ఇండియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 9 ఏళ్ల పాలనపై విమర్శలు గుప్పించడానికి అనేక అంశాలు ఉన్నా.. మోదీ అనేది ప్రస్తుతం కేవలం ఒక పేరు మాత్రం కాదు.. మోడీ అంటే వరల్డ్ బ్రాండ్…అమెరికా..ఆస్ట్రేలియా.. ఆఫ్రికా.. ఆయన ఎక్కడ అడుగుపెట్టినా.. మోదీ మానియాతో ఆ ప్రాంతం షేక్ అవుతుంది. ముఖ్యంగా విదేశాల్లో ఉంటున్న భారతీయుల్లో మోడీకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇటీవల జపాన్‌లో జరిగిన క్వాడ్ సమావేశంలో బైడెన్ స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. తాను ఎక్కడికివెళ్లినా మోడీ గురించే చర్చ జరగుతుందన్నారు. మన ప్రధానికి ఉన్న క్రేజ్ అటువంటిది. అమెరికా అధ్యక్షుడిగా ఎవరున్నా.. భారత్‌కు ప్రాధాన్యత దక్కుతూనే ఉంది. మరోసారి అధ్యక్ష రేసులో ఉన్నానని ప్రకటించిన బైడెన్ .. మోడీకి స్టేట్ విజిట్ ఇవ్వడానికి కూడా అనేక కారణాలున్నాయి. అమెరికా విదేశాంగ విధానాన్ని సమర్థంగా అమలు చేయడంలో బైడెన్ విఫలమయ్యారన్న ముద్ర వేసుకున్నారు. ఇరాన్ న్యూక్లియర్ డీల్‌ను పునరుద్ధరించలేకపోవడం, ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను అడ్డుకోలేకపోవడం, పశ్చిమాసియా దేశాల్లో బలమైన బంధాన్ని కొనసాగించలేకపోవడం ఇలా అనేక అంశాల్లో బైడెన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. పైగా మరోసారి అమెరికా అధ్యక్షుడు కావాలని ఆయన కలలుకంటున్నారు. ఇలాంటి సమయంలో భారత్ లాంటి దేశాల మద్దతు ఆయనకు చాలా అవసరం. ఎందుకంటే అమెరికా రాజకీయాలను శాసించే స్థాయిలో ప్రస్తుతం ఆదేశంలో ఇండియన్ కమ్యూనిటీ ఉంది.

అమెరికాలో చక్రం తిప్పుతున్న ఇండియన్ అమెరికన్స్
కొత్తగా ఎవరైనా భారత్ నుంచి అమెరికాలోని ఏ ప్రాంతానికి వెళ్లినా..వేరే దేశం వచ్చామన్న ఫీలింగ్ అస్సలు ఉండదట. ఎటు చూసినా భారతీయులు కనిపిస్తారంట. నిజమే…అమెరికాలో ఇండియన్ పాపులేషన్ చాలా ఎక్కువ. విద్య, ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వలసవచ్చిన వారిలో మెక్సికన్ల తర్వాత భారతీయులే ఎక్కువ. అమెరికాలో దాదాపుగా 45 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అమెరికా జనాభాలో వీరి శాతం 1.3 శాతం. కేవలం వలసవాదులుగానే కాదు.. అమెరికా రాజకీయాలను కూడా వీళ్లు ప్రభావితం చేస్తున్నారు. వివిధ దేశాల నుంచి అమెరికాకు వలసవచ్చినవారిలో పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉన్నది కూడా మనవాళ్లే. బైడెన్ టీమ్‌లో 130 మంది ఇండియన్ అమెరికన్స్ పనిచేస్తున్నారంటే.. అమెరికా ప్రభుత్వం మనవాళ్లకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. బైడెన్ మరోసారి అధ్యక్షుడిగా గెలవాలంటే.. కచ్చితంగా భారతీయ అమెరికన్ల మద్దతు చాలా అవసరం.

అమెరికా అధ్యక్షడు ఎవరో డిసైడ్ చేసే.. బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, ఒహాయో రాష్ట్రాల్లో ఇండియన్ అమెరికన్ పాపులేషన్ చాలా ఎక్కువ. స్వింగ్ స్టేట్స్ గా చెప్పుకునే ఆరిజోనా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో దాదాపు 18 లక్షల మంది భారత జాతీయులు ఉన్నారు. రాజకీయంగా ఇండియన్ అమెరికన్స్ మొత్తం గంపగుత్తగా డెమొక్రట్లకే మద్దతు పలుకుతూ వచ్చారు. కానీ కొన్నేళ్లుగా వాళ్లు రిపబ్లికన్ పార్టీ వైపు కూడా మొగ్గుచూపడం మొదలు పెట్టారు. దీంతో ఇండియన్ అమెరికన్ ఓటు బ్యాంక్‌ను, మద్దతును కాపాడుకోవడం బైడెన్‌కు చాలా అవసరం. అందుకే మోడీని స్టేట్ విజిట్‌కు ఆహ్వానించి మరీ ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకునే పనిలో ఉన్నారు. ప్రిడేటర్ డ్రోన్స్ నుంచి జెట్ డీల్ వరకు ఎన్నో ఒప్పందాలు రెండు దేశాల మధ్య జరగబోతున్నా… మోదీ పర్యటన మాత్రం రాజకీయంగా బైడెన్‌కు అత్యవసరం. మోదీ అమెరికా పర్యటన ద్వారా భారత్ కు ఎన్ని ప్రయోజనాలు కలిగినా… మోడీని స్టేట్ ‌విజిట్‌కు ఆహ్వానించడం ద్వారా అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు పొందుతోంది. అమెరికాకు భారత్ అవసరం అంతగా పెరిగిపోయింది.