సమకాలిన క్రికెట్ లో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ పరుగుల వరద కొనసాగుతోంది. టెస్ట్ ఫార్మాట్ లో అత్యంత నిలకడగా రాణిస్తున్న జో రూట్ వరుస రికార్డులతో దుమ్మురేపుతున్నాడు. ఈ క్రమంలో ప్రతీ సిరీస్ లోనూ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డులను దాటేస్తున్నాడు. కోహ్లీ కంటే వేగంగా సచిన్ ఆల్ టైమ్ రికార్డులను అధిగమిస్తూ ఈ తరం గొప్ప ఆటగాళ్ళలో ఒకడిగా నిలిచేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. తాజాగా టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా క్రిస్టన్‌చర్చ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో జోరూట్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో జోరూట్ 15 బంతుల్లో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో జో రూట్.. క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను అధిగమించాడు. 2013లో అంతర్జాతీయ టెస్ట్‌లకు వీడ్కోలు పలికిన సచిన్ మొత్తం 200 టెస్ట్‌ల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో 1625 పరుగులు చేశాడు.
తాజాగా జోరూట్ 1630 పరుగులతో సచిన్‌ను అధిగమించాడు. జోరూట్ 149 టెస్ట్‌ల్లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం. ఈ జాబితాలో అలిస్టర్ కుక్, గ్రేమ్ స్మిత్ 1611 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. శివనారయన్ చంద్రపాల్ 1580 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. గతడేదిగా సూపర్ ఫామ్‌లో ఉన్న జోరూట్.. సచిన్ పేరిట ఉన్న ఒక్కో ఆల్‌టైమ్ రికార్డ్‌ను అధిగమిస్తూ వస్తున్నాడు. అంతేకాకుండా టెస్ట్‌ల్లో అత్యధిక పరుగుల ఘనతపై కూడా జోరూట్ కన్నేసాడు. ఈ రికార్డ్ సచిన్ పేరిటే ఉంది. మాస్టర్ బ్లాస్టర్ 200 టెస్ట్‌ల్లో 15,921 పరుగులు చేశాడు. జోరూట్ ప్రస్తుతం 12,574 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో 3-4 ఏళ్లలో సచిన్ రికార్డ్‌ను అధిగమించే అవకాశం ఉంది.
టెస్టుల్లో ఇంగ్లాండ్ బజ్ బాల్ కాన్సెప్ట్ తో ఆడుతుండడం జో రూట్ కు బాగా కలిసొచ్చింది. ఆడిన తొలి 117 టెస్టుల్లో 25 శతకాలు చేసిన రూట్.. బజ్‌బాల్ వచ్చాక 33 టెస్టుల్లో 10 సెంచరీలు సాధించాడు. అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గానూ రూట్ నిలిచాడు. ఈ విభాగంలో సచిన్‌దే దే అగ్రస్థానం. రూట్ ఫామ్‌ను చూస్తుంటే అర్ధశతకాల రికార్డును అధిగమించడం పెద్ద కష్టమేం కాదు. అంతేకాదు సెంచరీల రికార్డూ కూడా కొట్టేసేలా ఉన్నాడు. 35 శతకాలతో ఉన్న రూట్ ఇలాగే కొనసాగితే సెంచరీల హాఫ్ సెంచరీ ఖాయం. ఒకవేళ రూట్ ఖాతాలోకి శతకాల రికార్డు వచ్చినా.. దానిని అధిగమించే మరో ప్లేయర్ ఇప్పటికైతే దగ్గరలో లేడు.