వైటీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన షర్మిల.. ఢిల్లీ వేదికగా హస్తం పార్టీ పెద్దల సమక్షంలో కండువా కప్పుకున్నారు. ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీతో.. ఏ పార్టీ మీద ప్రభావం పడుతుంది.. ఎవరి ఓట్లకు గండి కొడుతుంది అన్న సంగతి ఎలా ఉన్నా.. ఎవరూ చేయలేని పని, కాదు కాదు ఎవరికీ సాధ్యం కాని పనిని షర్మిల సాధిస్తారా.. అంత సీన్ ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. షర్మిలకు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. జరిగినా జరగొచ్చు.. కాంగ్రెస్ అవసరం అలాంటిది మరి! వైఎస్ బ్రాండ్‌తో ఏపీలో జీవం కోల్పోయిన పార్టీకి.. అదే బ్రాండ్‌తో మళ్లీ జీవం పోయాలి అన్నది కాంగ్రెస్ పెద్దల ఆలోచన. అందుకే షర్మిలకు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగించినా.. పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఐతే మరి కాంగ్రెస్ పెట్టుకున్న నమ్మకాన్ని షర్మిల నిలబెట్టుకుంటారా.. ఆ పని ఆమెకు సాధ్యం అవుతుందా అన్నది ఇప్పుడు ప్రతీ ఒక్కరి మెదళ్లలో కదులుతున్న ప్రశ్న. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ఓ వెలుగు వెలిగింది.
వైఎస్ఆర్ హయాంలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడం అంటే మాములు విషయం కాదు. ఆ సమయంలో మహాకూటమిని ఎదుర్కొని, తెలంగాణవాదాన్ని తట్టుకుని.. రెండోసారి అధికారంలోకి తీసుకురావడం అంటే ఎలాంటి టఫ్ జాబ్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐతే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ వెలుగులు పోయాయ్. ఏపీలో కాంగ్రెస్ ఇప్పుడు పూర్తిగా చీకట్లోకి వెళ్లిపోయింది. ఏపీని రాజకీయ ప్రయోజనాల కోసం విడగొట్టారని.. సీమాంధ్ర జనాలు మండిపోయి కాంగ్రెస్‌కు ఒకరకంగా సమాధి కట్టేశారు. ఇప్పట్లో కోలుకోవడం కాదు కదా అలాంటి ఆలోచన కూడా చేయడం సాహసమే అవుతుంది అనే రేంజ్‌లో కాంగ్రెస్‌ను ఒకరకంగా ఏపీ నుంచి వెళ్లగొట్టేశారు అక్కడి జనాలు. ఐనా సరే కాంగ్రెస్ ప్రతీ ఎన్నికల్లో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. విఫలం అవుతూనే ఉది. 2019ఎన్నికల్లో మహామహుల్లాంటి నాయకులకు కూడా డిపాజిట్లు దక్కలేదు. కొన్నిచోట్ల నోటా కంటే తక్కువ వచ్చాయ్ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు.
దీంతో రఘువీరాలాంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు వ్యవసాయం చేసుకుంటూ కాలక్షేపం చస్తున్నారు. ఇలాంటి పార్టీ బాధ్యతలు తీసుకోబోతున్నారు షర్మిల. వైఎస్ బ్రాండ్ ఉన్నంత మాత్రాన ఇప్పుడు కాంగ్రెస్‌కు ఊపిరి అందుతుందా అంటే ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్లు వచ్చినా.. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోయలేకపోయారు. షర్మిల కాదు కదా.. ఇంకెంత గొప్ప నాయకులు చేరినా కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఏపీలో ఊపిరి పోసుకోవడం దాదాపు అసాధ్యమే. అనవసరంగా షర్మిల రాజకీయ భవిష్యత్‌ను ప్రమాదంలో పడేసుకున్నారు అన్నది మరికొందరి వాదన.