Babu Mohan : బీఆర్ఎస్‌లో చేరిక.. బాబుమోహన్ క్లారిటీ…

బీఆర్ఎస్ (BRS) పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. అభ్యర్థులు అనుకున్న వాళ్లు ముందే హ్యాండ్ ఇస్తే.. అభ్యర్థులుగా ప్రకటించిన తర్వాత మరికొందరు హ్యాండ్ ఇచ్చారు.

బీఆర్ఎస్ (BRS) పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. అభ్యర్థులు అనుకున్న వాళ్లు ముందే హ్యాండ్ ఇస్తే.. అభ్యర్థులుగా ప్రకటించిన తర్వాత మరికొందరు హ్యాండ్ ఇచ్చారు. వరంగల్ ఎంపీ స్థానం విషయంలో అదే జరిగింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు.. కడియం కావ్యకు వరంగల్‌ నుంచి ఎంపీ టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. ఐతే ఏదో కారణాలు పోటీ నుంచి తప్పుకుంటానని ప్రకటించిన కావ్య.. ఆ తర్వాత తండ్రితో కలిసి కాంగ్రెస్‌ (Congress) కండువా కప్పుకుంది. దీంతో వరంగల్‌ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్‌కు అభ్యర్థి లేకుండా పోయారు.

దీంతో రకరకాల పేర్లు తెరమీదకు వచ్చాయ్. కేసీఆర్‌ (KCR) కు, కారుకు గుడ్‌బై చెప్పిన బాబుమోహన్ (Babu Mohan) మళ్లీ బీఆర్ఎస్‌లో చేరుతారని.. వరంగల్‌ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. దీనిపై బాబుమోహన్ క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ తనకు ఫోన్ చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని బాబు మోహన్ ఖండించారు. తనకు కేసీఆర్ ఫోన్ చేయలేదన్నారు. కేసీఆర్‌తో తాను మాట్లాడి సుమారు ఐదేళ్లు అయిందని.. ప్రజాశాంతి పార్టీ తరఫున తాను వరంగల్‌ ఎంపీగా పోటీ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల టైంలో తాను పార్టీ మారాల్సిన అవసరం లేదని క్లియర్‌కట్‌గా చెప్పారు.

ఈ మధ్యే బీజేపీకి రాజీనామా చేసిన బాబుమోహన్‌.. ప్రజాశాంతి పార్టీ (Prajashanthi Party) లో చేరారు. వరంగల్‌ నుంచి పోటీ సిద్ధం అవుతున్నారు. ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరడం.. ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. బాబుమోహన్‌, కేసీఆర్‌కు మధ్య.. రాజకీయాలకు మించి మంచి అనుబంధం ఉంది. కేసీఆర్‌ను బావా అని పిలిచేవారు బాబుమోహన్. ఐతే కేసీఆర్‌ ఫోన్ చేయడంతో ఆయన మళ్లీ బీఆర్ఎస్‌లో చేరతారని ప్రచారం జరిగింది. దీనికి బాబుమోహన్ క్లారిటీ ఇచ్చారు.