ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికలకు మరో 5 నెలల సమయం ఉంది. టీడీపీ (TDP) – జనసేన (Janasena) రాబోయే సర్వత్రిక ఎన్నికలపై దృష్టి పెట్టింది. కాగా ఇప్పటికే ఈ రెండు పార్టీలు కలిసి 2024లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. ఇందుకోసం ఇరు పార్టీలు జాయింట్ యాక్షన్ కమిటీ, ప్రజలకు ఎన్నికల ప్రచారంలో ఇచ్చే హామీల రూపకల్పనకు నేడు ఉమ్మడి మేనిఫెస్టో (Joint manifesto) కమిటీ సభ్యులు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం అవుతున్నారు.
ఇక ఇరు పార్టీల నుంచి కీలక నేతలు ఇవాళ భేటీలో పాల్గొననున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, పార్టీ నేత పట్టాభి సభ్యులుగా ఉన్నారు. జనసేన నుంచి వరప్రసాద్, శరత్ కుమార్, ముత్తా శశిధర్, సభ్యులుగా ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం ఎన్టీఆర్ భవన్ వేదికగా ఈ సమావేశం జరగనుంది.
గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం పేరుతో మేనిఫెస్టో తీసుకురానున్నట్లు తెలిపారు. ఇక సూపర్ సిక్స్ పేరుతో.. ఆరు అంశాలు.. రైతులు, యువత, మహిళలు, బీసీ,పేదల కోసం ఏం చేస్తామన్నది టీడీపీ మినీ మేనిఫెస్టోలో పొందుపర్చింది. మహాశక్తి పేరిట ఆడబిడ్డలకు ప్రత్యేక నిధి, 18 ఏళ్ల నిండిన ప్రతి మహిళల ఖాతాల్లో నెలకు 1,500 రూపాయలు , తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డా చదువుకునేందుకు ఇంట్లో ఎంత మంది ఉన్నా ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం రూ. 15 వేలు ఇలా పలు అంశాలను టీడీపీ ప్రస్తావించింది.జనసేన ఎస్సీ ఎస్టీలు, యువత, భవన నిర్మాణ కార్మికులు, రైతులకు సంబంధించిన మరో నాలుగైదు ప్రతిపాదనలను టీడీపీ ముందు ఉంచింది. ఈ అంశాలపై ఇవాళ్టి ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ భేటీలో ఇరుపార్టీ సభ్యులు చర్చించి తుది నిర్ణయానికి రానున్నారు.
S.SURESH