గతంలో ఐటీలో పని చేస్తున్నాడంటే చాలు ముందు వెనుక ఆలోచించకుండా బ్యాంకులు లోన్లు ఇచ్చేవి. ఇళ్ళు నుంచి పెళ్లి వరకూ అన్నీ సజావుగా సమకూరేవి. పూర్వం ఒక సామెత ఉండేది పెరుగుట తరుగుట కొరకే అని. అది వీరికి బాగా సెట్ అవుతోంది ఇప్పుడు. మన్నటి వరకూ బీటెక్ చేస్తే చాలు ఐటీలో ఐదంకెల జీతంతో ఉద్యోగాలు వెల్ కం చెప్పాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉద్యోగాలు కాదు కదా కంపెనీలే మూత పడే పరిస్థితి సంభవించింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిని తాజాగా ఒక ఫైనాన్స్ సంస్థ జేపీ మోర్గాన్ విశ్లేషకులు అథ్యయనం చేసి బయటపెట్టారు. ఈ నివేదికలో 2024 ఆర్థిక సంవత్సరం వరకూ ఐటీ రంగం అట్టడుగున ఉండబోతోంది అని వెల్లడించారు. అందుకే ఫైనాన్సియల్ ఇయర్ 2025 ని లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికలు రచించుకోవాలని పేర్కొన్నారు.
అధిక వడ్డీ రేట్ల కారణంగా..
ఇటీవల కాలంలో జరిగిన ఎగ్జిక్యూటివ్ ల సమావేశంలో కూడా పెట్టుబడులపై ఆశాజనకమైన పరిస్థితులు కనిపించలేదని తెలిపారు. గత మూడు నెలల కంటే కూడా తాజాగా గడిచిన మూడు నెలలు మరింత క్షీణించిందని వివరించారు. దీనికి దీర్ఘకాలికంగా కొనసాగుతున్న అధిక వడ్డీ రేట్లే అని పేర్కొన్నారు. ఇలాగే కొనసాగితే ఆర్థికపరిస్థితి మరింత మందకొడిగా సాగే అవకాశం ఉంటుందని అంచనాల నడుమ భయపడి పెట్టుబడులు పెట్టడం లేదన్నారు.
యూఎస్ బేస్డ్ ప్రాజెక్టులే..
ఈ పరిస్థితుల గురించి గతంలోనే ఇన్ఫోసిస్, టాటా కన్సల్టింగ్, విప్రో, హెచ్ సి ఎల్ టెక్ తోపాటూ అన్ని దిగ్గజ కంపెనీలు హెచ్చరికలు జారీ చేశాయి. అయినప్పటికీ వడ్డీ రేట్లపై ఎలాంటి మార్పు కనిపించలేదు. దీంతో పాటూ మనకు వచ్చే ప్రజక్టులన్నీ అమెరికా బేస్డ్ కంపెనీలవే కావడంతో ఐటీ వ్యయాన్ని తగ్గించడంతోపాటూ కాంట్రాక్టుల కాలవ్యవధి తగ్గించడం లేదా రద్దు చేయడం వంటి అంశాల్లో తీవ్ర ఆలస్యం జరుగుతోంది. దీనికారణంగా కూడా ఉద్యోగులను తొలగించేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నాయి కంపెనీలు. తద్వారా ఐటీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని చెప్పుకొచ్చారు.
లే ఆఫ్ పెరిగి ఉద్యోగావకాశాల తగ్గుదల..
ఇలా చేయడం వల్ల ఎంతో కాలంగా పురోగతి సాధిస్తుందని వేచి చూసిన టెకీలకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇండియాలోని ప్రముఖ ఐటీ కంపెనీలకే కాకుండా విదేశాల్లోని సాప్ట్ వేర్ కంపెనీలకు కూడా ప్రాజెక్టులు తగ్గిపోయాయి. తద్వారా ఉద్యోగ అవకాశాలు క్షీణించాయి. కొందరు ఉద్యోగులను ఇప్పటికే లే ఆఫ్ ప్రకటించి ఇంటికి పంపించేశారు. ఆన్ బోర్టింగ్ లో చాలా ఆలస్యం జరిగింది. పైగా వేలాది మంది ఉద్యోగులు విధులను వదిలి పెట్టి వెళ్లిపోయారు. క్యాంపస్ ఇంటర్వూలను నిర్వహించలేకపోవడంతో తీవ్ర ప్రభావం పడింది.
T.V.SRIKAR